మాకిచ్చే జీతానికి ఈ మాత్రం పని చేస్తే చాల్లే..!: సర్వే | Gallup survey on companies employee relations and other topics | Sakshi
Sakshi News home page

కంపెనీలు-ఉద్యోగుల మధ్య సంబంధాలపై ‘గాలప్‌’సర్వే 

Published Sun, Jun 25 2023 2:35 AM | Last Updated on Sun, Jun 25 2023 11:06 AM

Gallup survey on companies employee relations and other topics - Sakshi

ఆఫీసులో ఎంత కష్టపడ్డా...  శాలరీ పెరిగేది మాత్రం అత్తెసరుగానే..  ఎంత గొడ్డు చాకిరీ చేసినా...  లభించే గుర్తింపు అంతంతే..  వేతనంతో పాటు ఇంకేదైనా అలవెన్స్‌  రూపంలో నగదు ఇస్తే బాగుంటుంది.. రోజూ ఆఫీసుకు రావాలా? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  ఎక్కువ రోజులుంటే బాగుండు.. 

మీకు ఈ మధ్యకాలంలో ఇలాగే అనిపిస్తోందా? పైన చెప్పుకున్న నాలుగు అంశాల్లో ఏదో ఒకటి మీకు వర్తిస్తుందా? అలాగైతే మీరు ఒంటరి వారేమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇదే విధమైన భావనలతో ఉన్నారు. కోవిడ్‌ భయం ముగిసి అన్నిరకాల ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో అఫీసులకు వెళ్లాల్సి వస్తున్న ఈ సమయంలో వారి మనోభావాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సర్వే సంస్థ ‘గాలప్‌’ఓ అధ్యయనం నిర్వహించింది. (వైట్‌హౌస్‌ స్టేట్ డిన్నర్‌: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)

కంపెనీలు, ఉద్యోగుల మధ్య సంబంధాలేమైనా బలపడ్డాయా? ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? పనిచేసే చోట ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వదిలిపెట్టి ఆఫీసులకు వస్తున్నవారిలో వివిధ కారణాలతో నెలకొన్న ఆందోళన, ఒత్తిడి తగ్గించడంపై కంపెనీలు దృష్టి పెట్టాయని తేల్చింది. ఉద్యోగుల్లో కోవిడ్‌ భయాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో కంపెనీలు వారిని ఆఫీసులకు రమ్మనడం మాత్రమే కాకుండా, వారి యోగక్షేమాలు కనుక్కునేందుకు, అవసరమైన సాయం చేసేందుకూ ముందుకొచ్చాయని గాలప్‌ అధ్యయనం పేర్కొంది. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ )

 

ఉద్యోగుల బాగోగులపై  కంపెనీల దృష్టి 
మూడేళ్ల క్రితం 2020 జనవరిలో మొదలైన కోవిడ్‌ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అట్టుడికించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులు మాత్రమే కాదు కరోనాతో సామాన్యుడి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితమయ్యారు. అయితే టీకాలు వేయడం మొదలైన తరువాత 2021 ఆఖరుకు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించి, 2022 మార్చికల్లా పరిస్థితులు సాధారణమయ్యాయి.

ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉద్యోగుల్లో ఆందోళన మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉందని, కోవిడ్‌ భయాలు తొలగినా ద్రవ్యోల్బణం, అర్థ వ్యవస్థ మందగమనం, భవిష్యత్తుపై చింత వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని గాలప్‌ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు గత ఏడాదిలో ఉద్యోగుల ఆందోళనను, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి.

కంపెనీలు ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రయత్నం చేయడం గత ఏడాది పతాక స్థాయిలో ఉన్నట్టు గాలప్‌ చెబుతోంది. 2009 నుంచి తాము ఈ ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్‌ సమాచారాన్ని నమోదు చేస్తున్నామని, 2022లో అది రికార్డు స్థాయిలో 23 శాతానికి చేరిందని తెలిపింది. కోవిడ్‌ ముందునాటి పరిస్థితితో పోలిస్తే భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగుల బాగోగులు చూసుకునే అంశం 33 శాతానికి చేరింది. (ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం ఆధారంగా ఈ అంచనాకొచ్చారు)  (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?)

కొనసాగుతున్న క్వైట్‌..  లౌడ్‌ క్విట్టింగ్‌.. 
మీరెలా ఉన్నారని కంపెనీ తరచూ అడుగుతూంటే ఉద్యోగులు సంతోషంగా మరింత కష్టపడతారని అనుకుంటాం కానీ, గాలప్‌ సర్వే ఫలితాలు దీనికి భిన్నంగానే కనిపించాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు క్వైట్‌ క్విట్టింగ్‌... అంటే ఆఫీసుకు రావడం.. అప్పగించిన పనిని పూర్తి చేయడం. ఎప్పుడు టైమ్‌ అవుతుందా.. అని కాచుకు కూర్చొని ఇంటికెళ్లిపోవడం చేస్తున్నారని సర్వే తెలిపింది. వీరు తాము పనిచేస్తున కంపెనీతో ఎలాంటి మానసికమైన సంబంధాన్ని కూడా కలిగిలేరని తెలిపింది.

నామ్‌ కే వాస్తే పని మాత్రం చేస్తున్నారు. అంతే. ఇలా క్వైట్‌ క్విట్టింగ్‌ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండగా.. కొంతమంది లౌడ్‌ క్విట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అంటే.. తరచూ గ్రూప్‌ లీడర్లు లేదా సెక్షన్‌ హెడ్‌లతో విభేదించడం, కంపెనీ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేయడం చేస్తున్నారు. తమకు తగ్గ పని చేయనందుకు కంపెనీ పట్టించుకోవడం లేదని వీరు భావిస్తున్నారు. 

క్వైట్‌ క్విట్టర్లు సరిగా పనిచేస్తే.. 
క్వైట్‌ క్విట్టర్లు.. తమకు అప్పగించిన పనికి మించి వీసమెత్తు ఎక్కువ చేసేందుకు ఇష్టపడరు. మాకిచ్చే జీతానికి ఈ మాత్రం చేస్తే చాల్లే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనర్థం.. వారు మరింత ఎక్కువ ఉత్పాదకత సాధించగల సామర్థ్యం ఉన్నవారే.

కానీ.. వేతనం, సౌకర్యాలు, నైతిక మద్దతు వంటి అనేక కారణాల వల్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఒకవేళ వీరు కూడా ఉత్సాహంగా పనిచేస్తే... అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. గాలప్‌ అంచనాల ప్రకారం క్వైట్‌ క్విట్టర్లు మనసుపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఏటా దాదాపు 8.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపుగా తొమ్మిది శాతం. 



ఒత్తిడి...పైపైకి!  
కోవిడ్‌ భయాలు తొలగిపోయినప్పటికీ గత ఏడాది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని గాలప్‌ సర్వే తెలిపింది. కోవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి మాదిరిగానే 2022లో­నూ ఉద్యోగుల్లో సుమారు 44 శాతం మంది తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఈ సర్వేలో తెలిపారు. చైనా, అమెరికా, కెనడాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది.

తూర్పు ఆసియా ప్రాంతంలో ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వారు, యువకులు 60 నుంచి 61 శాతం మంది రోజూ ఒత్తిడికి గురైనట్లు సర్వే వివరించింది. ఈ ఒత్తిడి పనికి సంబంధించింది మాత్రమే కాకుండా.. కుటుంబ ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి వాటివల్ల కూడా కావచ్చునని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. ఉద్యోగుల యోగక్షేమాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన కంపెనీల్లో ఈ ఒత్తిడి తక్కువగా ఉండటం!. 

ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిది..
కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మేలా? లేక ఆఫీసుకు రావాలా? ఈ రెండూ కాకుండా హైబ్రిడ్‌ పద్ధతుల్లో పనిచేయించుకోవాలా? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ చాలానే జరిగింది కానీ.. ఈ విషయాల్లో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం అన్నింటి కంటే మేలైన పద్ధతని గాలప్‌ చెబుతోంది.

అంతేకాదు... తరచూ మాట్లాడుతుండటం, వారికి అవసరమైన పనులు సులువుగా చేసి పెట్టగలగడం వంటివి ఉద్యోగులకు కంపెనీపై ఉన్న అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవని ఈ సర్వే తెలిపింది. పనిచేసే చోటుకు కాకుండా... పరిస్థితులు, వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చునని గాలప్‌ సూచిస్తోంది.  

మెరుగైన ఉద్యోగానికి మంచి సమయం 
2022లో కొత్త ఉద్యోగం చూసుకునేందుకు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైంది చూసుకునేందుకు మంచి సమయం ఇదే అని గాలప్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి కాగా.. 2019 నాటి స్థాయికి దగ్గరగా ఉండటం గమనార్హం. అయితే అమెరికా, కెనడాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదని సర్వే తెలిపింది.

చేసే ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారు స్వేచ్ఛగా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి 2022లో కనిపించిందని, ఇది కాస్తా ఉద్యోగాల లభ్యతను అధికం చేసిందని గాలప్‌ విశ్లేషించింది. ఆసక్తికరంగా... సర్వే చేసిన ఉద్యోగుల్లో యాభై శాతం మంది ఉద్యోగం మానేసే ఆలోచన చేశారు.

కంపెనీలు ఉద్యోగులను కోల్పోకూడదని అనుకుంటే వారి బాగోగులు మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరముందని గాలప్‌ తెలిపింది. ఇలా చేసిన కంపెనీల్లో ఉద్యోగం మానేసే ఆలోచన చేసిన వారు గణనీయంగా తక్కువగా ఉండటాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది.  

సమస్య వేతనం ఒక్కటే కాదు... 
ఒత్తిడి, పనిచేసే వాతావరణం లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగాలు మానేయాలని అనుకున్న వారికి గాలప్‌ ఒక ప్రశ్న వేసింది. ‘‘పరిస్థితులు మెరుగవ్వాలంటే మీ ఆఫీసులో లేదా మీ కంపెనీలో ఏ చర్యలు తీసుకోవాలి?’’అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 85 శాతం మంది కేవలం వేతనాలు, ఆర్థిక లాభాలు కాకుండా.. వర్క్‌/లైఫ్‌ బ్యాలెన్స్, ఎంగేజ్‌మెంట్‌ లేదా ఆఫీసు కల్చర్‌ వంటి విషయాలను ప్రస్తావించారు.

మిగిలిన 15 శాతం మంది సమాధానాలు ఏ కోవకూ చెందనివి కావడం గమనార్హం. ఎంగేజ్‌మెంట్‌ లేదా ఆఫీస్‌ కల్చర్‌ వర్గంలో మేనేజర్లు మరీ కఠినంగా ఉండరాదని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమివ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. సొంతంగా పనిచేసుకునేందుకు అవకాశముండాలని, కొత్త విషయాలు నేర్చుకునే సౌకర్యం, తగిన గౌరవం లభించాలని, ప్రమోషన్లలో అందరికీ సమాన అవకాశాలుండాలని మరికొందరు భావించారు.

దాదాపు 28 శాతం మంది వేతనాలు, ఇతర లాభాలను ప్రస్తావిస్తే.. ఆఫీసులో మంచి క్యాంటీన్‌/కేఫటేరియా ఉండాలని కొందరు, పిల్లల సంరక్షణ ఖర్చుల గురించి కొందరు, కంపెనీ ఫలితాలకు తగ్గట్టుగా ఉద్యోగులందరికీ సమానంగా ప్రతిఫలాలు దక్కాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఆఫీసు వాళ్లు హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని, భోజన సమయం మరింత పెంచాలని పని మధ్యలో సేద తీరేందుకు తగిన ప్రాంతం లేదని ఇంకొందరు భావించారు.  


- కంచర్ల యాదగిరిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement