ఆరోగ్యం ఏమాత్రం చెడిపోకుండా.. అసలు ఎన్ని గంటలు పని చేస్తే సరిపోతుంది?. 7 గంటలా?, 8 గంటలా?, పోనీ 10 గంటలా?.. ఏదో ఒక సందర్భంలో తమను తాము ఉద్యోగులు వేసుకునే ప్రశ్నే ఇది. అయితే అది పనిని, పని ప్రదేశాన్ని బట్టి మారొచ్చనేది నిపుణులు చెప్పే మాట. అలాంటప్పుడు మార్గదర్శకాలు, లేబర్ చట్టాలు ఎందుకు? అనే ప్రశ్న తలెత్తడం సహజమే కదా!.
ఆమధ్య కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టెడ్ అకౌంటెంట్.. పుణేలో ఓ ఎమ్మెన్సీలో చేరిన నాలుగు నెలలకే అనారోగ్యం పాలై చనిపోయింది. పని ఒత్తిడి వల్లే తన కూతురి ప్రాణం పోయిందంటూ సదరు కంపెనీకి, కేంద్రానికి బాధితురాలి తల్లి ఓ లేఖ రాసింది. యూపీలో ఫైనాన్స్ కంపెనీలో పని చేసే తరుణ్ సక్సేనా.. 45 రోజులపాటు విశ్రాంతి తీసుకోకుండా పని చేసి మానసికంగా అలసిపోయాడు. చివరకు టార్గెట్ ఒత్తిళ్లను భరించలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైనాలో, మరో దేశంలోనూ ఇలా పని వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు చూశాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు తీవ్రస్థాయిలో పని గంటల గురించి.. పని వాతావరణం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు ఇలా.. ఉద్యోగులు ఇన్నేసి గంటలు బలవంతంగా పని చేయడం తప్పనిసరేనా? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
భారత్‌లో పనిగంటలను నిర్దారించేవి యాజమానులు/ సంస్థలు/కంపెనీలే. కానీ, ఆ గంటల్ని నియంత్రించేందుకు చట్టాలు మాత్రం అమల్లోనే ఉన్నాయి. అవే.. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, షాప్స్ అండ్ ఎస్టాబిష్‌మెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి.
ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం..
రోజూ వారీ పని గంటలు: గరిష్టంగా 9 గంటలు
వారంలో పని గంటలు: గరిష్టంగా 48 గంటలు
రెస్ట్ బ్రేక్స్: ప్రతీ ఐదు గంటలకు ఆరగంట విరామం కచ్చితంగా తీసుకోవాలి
ఓవర్ టైం: నిర్ణీత టైం కన్నా ఎక్కువ పని చేస్తే చేసే చెల్లింపు.. ఇది ఆయా కంపెనీల, సంస్థలపై ఆధారపడి ఉంటుంది
షాప్స్ అండ్ ఎస్టాబిష్‌మెంట్స్ యాక్ట్‌లు
రోజువారీ పని గంటలు: 8-10 గంటలు
వారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితం.. ఓటీని కలిపి 50-60 గంటలు
రెస్ట్ బ్రేక్స్: ఫ్యాక్టరీస్ యాక్ట్ తరహాలోనే తప్పనిసరి విరామం
కొత్త లేబర్ చట్టాల ప్రకారం..(అమల్లోకి రావాల్సి ఉంది)
రోజువారీ పని గంటలు: 12 గంటలకు పరిమితం
వారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితం
ఓవర్ టైం: అన్నిరకాల పరిశ్రమల్లో.. త్రైమాసికానికి 125 గంటలకు పెరిగిన పరిమితి
‘దేశంలోని ఉద్యోగులకు పని వేళలను కుదించండి.. ఆ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూడండి’ తాజా పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ఇది. ‘‘ఇది అత్యవసరమైన అంశం. గంటల తరబడి పనితో.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఒకవైపు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. పని గంటలను పరిమితం చేసే చట్టాలకు ప్రాధాన్యమిస్తూనే.. కఠినంగా వాటిని అమలయ్యేలా చూడాలి’’ అని కార్మిక శాఖ మంత్రి మాన్షుక్ మాండవియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల పని గంటలకు సాధారణ మార్గదర్శకాలు
ఫుల్ టైం వర్క్.. ఎనిమిది గంటలకు మించకుండా వారంలో ఐదు దినాలు.. మొత్తం 40 గంటలు.
ఓవర్ టైం.. 40 పని గంటలకు మించి శ్రమిస్తే.. రకరకాల సమస్యలు రావొచ్చు. అందుకే ఓటీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
పని మధ్యలో.. ఎక్కువ సేపు తదేకంగా పని చేయడం అంత మంచిది కాదు. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం కంపల్సరీ.
ఆయా దేశాల జనాభా, ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాల వారపు పని గంటల జాబితాను పరిశీలిస్తే.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలుగా కంబోడియా, మయన్మార్, మెక్సికో, మలేషియా, బంగ్లాదేశ్ లిస్ట్‌లో ప్రముఖంగా ఉన్నాయి. అత్యల్పంగా పని గంటల దేశాలుగా దక్షిణ ఫసిఫిక్ దేశం వనౌతు, కిరిబాటి, మొజాంబిక్, రువాండా, సిరియా ఉన్నాయి.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ పని గంటలు ఉన్న దేశంగా జాబితాలో భారత్ కూడా ఉంది. అందుకు కారణం.. దేశ శ్రామిక శక్తిలో 51 శాతం ఉద్యోగులకు వారానికి 49 పని గంటల విధానం అమలు అవుతోంది కాబట్టి. అలాగే ఆ మధ్య వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. 78 శాతం భారతీయ ఉద్యోగులు పని గంటలతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం, పని ప్రాంతాల్లో పరిస్థితులు మానవీయ కోణంలో కొనసాగాలన్నా.. తక్షణ చర్యలు అవసరం అని థూరూర్ లాంటి వాళ్లు చెబుతున్నారు. అందుకు అన్నా సెబాస్టియన్ అకాలమరణా ఉదంతాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. చిన్నవయసులో.. అదీ కొత్తగా ఉద్యోగంలో చేరి మానసికంగా వేదనకు గురైంది ఆమె. అలా.. ఆరోగ్యం చెడగొట్టుకుని ఆస్పత్రిపాలై.. ప్రాణం పొగొట్టుకుంది. దేశ ఎదుగుదలకు శ్రమించే ఇలాంటి యువ నిపుణల బాగోగుల కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇలాంటి వరుస విషాదాలు.. వ్యవస్థాగత వైఫల్యాలను ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హద్దులు చెరిపేసి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తాయా?.
Comments
Please login to add a commentAdd a comment