మేల్కొలుపు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపై
కార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?
ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.
స్త్రీలకు రెండు ఉద్యోగాలు
ఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?
జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.
ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్‌వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.
వారానికి 60 గంటలు
ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది.
భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.
హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?
చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.
స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలి
ఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
స్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్‌ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.
– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్
– ఫణికుమార్ అనంతోజు, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment