ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని, ఆదివారాలు కూడా విధులకు హాజరుకావాలంటూ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో దీని మీద మామూలు చర్చ జరగడం లేదు. అయితే.. తమ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఎల్ అండ్ టీం హెచ్‌ఆర్ టీం స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై వివరణతో హెచ్‌ఆర్ హెడ్ సోనికా మురళీధరన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఉంచారు.
90 పని గంటల విషయంలో ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్(SN Subrahmanyan) వ్యాఖ్యలు జనాల్లోకి చాలా పొరపాటు వెళ్లాయంటూ లారెన్స్ & టూబ్రో(L & T) హెచ్‌ఆర్ హెడ్ సోనికా అంటున్నారు. ‘మా ఎండీ వ్యాఖ్యలు పొరపాటుగా జనంలోకి వెళ్లాయి. ఆయన చాలా సాధారణంగానే ఆ మాటలు అన్నారు. కానీ, అవి అనవసర విమర్శలు దారితీయడం నిజంగా బాధాకరం. వారానికి 90 గంటలు పని తప్పనిసరనిగానీ.. దానిని అమలు చేయాలనిగానీ ఆయనేం అనలేదు.
.. ఆయన ప్రతీ ఉద్యోగిని తన కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. అలాగే తన టీం బాగోగుల గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలో ఇది అంత్యంత అరుదైన విషయం’’ అని ఆమె అన్నారు. అలాగే.. ఆయన నాయకత్వాన్ని ఆమె ఆకాశానికెత్తారు. కాబట్టి.. ఆయన మాటల్ని అర్థం చేసుకుని, విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.
అంతటితో ఆగలేదు..
ఉద్యోగులు వారానికి 90 గంటలు(90 Hours Work) పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అయితే ఆయన పనిగంటల వరకు మాట్లాడినా ఈ వివాదం అంతగా ముదిరేది కాదేమో. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని అన్నారు. దీంతో రచ్చ మొదలైంది.
ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం చూసి ఆశ్చర్యానికి గురయ్యానంటూ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తం చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సైతం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అలాగైతే సండే పేరును ‘సన్ డ్యూటీ’గా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడటాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మరోవైపు.. పలువురు ప్రముఖులు సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం కొసమెరుపు.
చర్చ సరైన దిశగా వెళ్లడం లేదు. పని పరిమాణంపైనే కదా ఇదంతా. నా దృష్టిలో అయితే 40 గంటలా.. 70 గంటలా లేదంటే 90 గంటలా అని కాదు. ఎంత నాణ్యమైన పనిని అందించామా అన్నదే ముఖ్యం. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చవచ్చు. అందుకే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంతసేపు పని చేశామన్నది ముఖ్యం కాదు
:::మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment