HR
-
కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం..అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
గతేడాది వరకు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం. విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. -
Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్.
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం. ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్‌కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు. కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్‌కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు. ముందు కుటుంబం ఢిల్లీలో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది. మొదటి అటెంప్ట్ టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని. తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్‌లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి. చట్ట ప్రకారం సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్కౌంటర్లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది. అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్‌ను కూడా క్లాసికల్‌గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది -
HR ప్లేయర్లు.. క్రికెట్లో దుమ్ము రేపారు! విజేతగా విరాట్ ఛాలెంజర్స్
నిత్యం కంప్యూటర్లు, నెట్వర్కింగ్ అంటూ రిక్రూట్మెంట్ చుట్టూ తిరిగే HR(హెచ్ఆర్) ఉద్యోగులు ఇప్పుడు క్రికెట్ మైదానంలో దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా జరిగిన రిక్రూట్మెంట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. రిక్రూటర్లు లాప్‌టాప్‌లు పక్కనబెట్టి.. క్రికెట్ బ్యాట్లు పట్టుకుని మురిపించారు. తామూ సిక్సర్లు కొట్టగలమని నిరూపించారు. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 22 నాకౌట్ మ్యాచ్‌లు జరిగాయి. ఎమోనిక్స్, విరాట్ ఛాలెంజర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి ఎండ్‌కార్డ్ పడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో విరాట్ ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది. దీంతో సీజన్ 1 టైటిల్‌ను ఛాలెంజర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఒక్కో టీంలో 8 మంది ప్లేయర్ల చొప్పున ఆడారు. ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం. అవార్డులు ఎవరికి అంటే? అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(అన్ని మ్యాచ్‌లకు), బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డలను అందజేశారు. CRI రైడర్స్ ఆటగాడు రోహిత్ బెస్ట్ బ్యాటర్ అవార్డును అందుకోగా.. విరాట్ ఛాలెంజర్స్ ఆటగాడు వెంకట్ ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన విరాట్ ఛాలెంజర్ ప్లేయర్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, నవీన్ బెస్ట్ ఫీల్డర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఫ్రైజ్ మనీ ఎంతంటే? విజేతగా నిలిచిన విరాట్ ఛాలెంజర్స్‌కు విన్నర్ కప్‌తో పాటు, రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన ఎమోనిక్స్ జట్టుకు రూ.30,000 నగదు బహుమతి లభించింది. ఇక రిక్రూటర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో విజయం సాధించడం పట్ల థ్రిల్‌గా ఉన్నామని టోర్నీ నిర్వాహకుడు రోహిత్ అన్నారు. "పాల్గొన్న అన్ని జట్లు ప్రదర్శించిన ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఛాంపియన్లుగా అవతరించినందుకు విరాట్ ఛాలెంజర్స్‌కు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన అన్ని జట్లకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్ నియామక పరిశ్రమలోని నిపుణుల మధ్య ఐక్యత, స్నేహ భావాన్ని పెంపొందించడానికి దోహదపడిందని "రోహిత్ పేర్కొన్నాడు.ఈ టోర్నమెంట్‌ను లింక్డ్ ఇన్, కన్రెప్, డిలిజెంట్తో పాటు స్టాఫింగ్ రివార్డ్స్ సంస్థలు స్పాన్సర్ చేశాయి. -
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు కొత్త హెచ్ఆర్ హెడ్
భారతీయ ప్రముఖ వ్యాపార సమ్మేళనం ఆదిత్య బిర్లా గ్రూప్ తమ కొత్త హెచ్ఆర్ హెడ్‌ను ప్రకటించింది. ముందస్తు పదవీ విరమణ తీసుకుంటున్న సంతృప్త్ మిశ్రా స్థానంలో అశోక్ రామ్చంద్రన్ను డైరెక్టర్ (హెచ్ఆర్) గా నియమించింది. నియామక మార్పులు 2024 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయి. అశోక్ రామ్‌చంద్రన్ ప్రస్తుతం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 నుంచి ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కొనసాగుతున్నారు. గ్రూప్‌లో చేరడానికి ముందు వోడాఫోన్ ఇండియాలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్ఆర్ విభాగంలో అశోక్ రామచంద్రన్‌కు 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక డాక్టర్ సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హెచ్ఆర్ గ్లోబల్ డైరెక్టర్, అలాగే బిర్లా కార్బన్ గ్రూప్ డైరెక్టర్, కెమికల్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మిశ్రా 1996లో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌లో చేరారు. -
గూగుల్ జాబ్ అంత ఈజీ కాదు గురూ.. రెజ్యూమ్ ఇలా ఉంటే మాత్రం..
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఈ సంస్థలో పని చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ అక్కడ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. గూగుల్ జాబ్ కోసం ఏటా 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించడం కంటే గూగుల్‌లో జాబ్ కొట్టడం చాలా కష్టమని భావిస్తుంటారు. గూగుల్ జాబ్ కోసం తీవ్రమైన పోటీతో పాటు నియామక ప్రక్రియ కూడా అంత ఆషామాషి కాదు. జాబ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల రెజ్యూమ్‌లోని ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో గూగుల్ కంపెనీ రిక్రూటింగ్ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కొన్ని కిటుకులను తెలియజేశారు. ఈ రెండు తప్పులు చేయొద్దు.. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. నోలన్ చర్చ్ 2012 నుంచి 2015 వరకు గూగుల్ రిక్రూటర్‌గా పనిచేశారు. గూగుల్‌లో ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. రెజ్యూమ్‌లో నివారించాల్సిన రెండు పెద్ద తప్పులను తెలియజేశారు. కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలను ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటిది సూటిగా లేని సమాచారం. అంటే మీ సామర్థ్యం, నైపుణ్యాల గురించి అర్థం కాకుండా పేరాలు పేరాలు రాయడం. మీ రెజ్యూమ్ ఇలా కనిపిస్తే నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.వ ఇదీ చదవండి ➤ Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన.. ఇక రెండవది స్పష్టత లేకపోవడం. అంటే మీరు మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వ్యక్తీకరించాలి. మీరు మీ రెజ్యూమ్‌లో అలా చేయలేకపోతే, ఆఫీస్‌లో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని ఇది సూచిస్తుంది. వీటిని అధిగమించడానికి చాట్‌జీపీటీ, గ్రామర్లీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవచ్చని చర్చ్ సూచించారు. కాగా వ్యయ నివారణలో భాగంగా గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో నియామకాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా, తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. -
హైదరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఆర్‌ఎం సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల నిర్వహణ సంస్థల సమాఖ్య ఎస్హెచ్ఆర్ఎంకి సంబంధించిన ’ఎస్హెచ్ఆర్ఎంటెక్23’ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో 120 పైచిలుకు వక్తలు, 4,000 పైగా హెచ్ఆర్, టెక్నాలజీ నిపుణులు పాల్గొంటున్నారు. సంబంధిత అంశాలపై 60 పైగా సెషన్లు నిర్వహిస్తున్నారు. కొత్త ధోరణులు, నవకల్పనల గురించి హెచ్ఆర్ నిపుణులు చర్చించుకునేందుకు ఇది వేదికగా ఉపయోగపడగలదని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. సాంకేతిక పురోగతి, దాని పరిణామాలు మానవ సామరŠాధ్యలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని కోవీలింగ్ అండ్ ఫ్రాంక్లిన్కోవీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎంఆర్ కోవీ తెలిపారు. టెక్నాలజీ వినియోగంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది
ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంస్థ గూగుల్ కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సంస్థ చేపట్టిన తొలగింపు చర్యలకు ఎంతో మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా సంస్థలో ఉద్యోగం కోసం ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలోనే హెచ్ఆర్ ఉద్యోగి ఓ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అందులో ఏముందంటే! యూ ఆర్ ఫైర్డ్... డాన్ లనిగన్ ర్యాన్ గూగుల్ లో హెచ్ఆర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డాన్ కాల్ అకస్మాత్తుగా డిస్కనెక్ట్ అయ్యింది.అలా ఎందుకు జరిగిందో కనక్కునేందుకు తన సిస్టమ్ నుంచి ఆఫీస్‌కు కాంటాక్ట్ అయ్యిందుకు ప్రయత్నించాడు. చివరికి సిస్టమ్ కూడా లాక్ అయ్యింది. ఇంతలో తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్న మెసేజ్ వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. ‘ గత శుక్రవారం వేల మందితో సిబ్బందిని గూగుల్ (Google) తొలగించింది. అందులో నేను కూడా ఉన్నానంటే నమ్మలేకున్నాను. గూగుల్‌లో తన ప్రయాణం ఇంత ఆకస్మిక ముగుస్తుందని ఊహించలేదని ర్యాన్ తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. గత వారం 12,000 సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలో ఈ కోతలు గురించి ఊహాగానాలు నెలల తరబడి చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఈ స్థాయిలో లేఆఫ్స్ ఊహించలేదుని ఉద్యోగులు అంటున్నారు. చదవండి: 70కి పైగా స్టార్టప్‌లలో వేలాది మంది తొలగింపు.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం -
హైదరాబాద్‌లో డార్విన్‌బాక్స్ కొత్త హెడ్‌క్వార్టర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల సంస్థ డార్విన్‌బాక్స్ హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సంఖ్య 700గా ఉండగా, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో కలిపి దాదాపు 1,200 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో సిబ్బందిని తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, రాబోయే మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు రోహిత్ వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ విభాగం లాభాలు నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. 2015లో చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని ప్రారంభించిన డార్విన్‌బాక్స్‌కు 700 పైచిలుకు క్లయింట్లు, దాదాపు 20 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సమీకరించిన 72 మిలియన్ డాలర్ల నిధులతో యూనికార్న్ హోదా (బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) దక్కించుకుంది. -
‘కేక’ 57 మిలియన్ డాలర్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల (హెచ్ఆర్–టెక్) సంస్థ ’కేక’ తాజాగా వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 57 మిలియన్ డాలర్లు సమీకరించింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) విభాగంలో ప్రారంభ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యధికమని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ యలమంచిలి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి ఉత్పాదనను రూపొందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు విజయ్ వివరించారు. 2016లో ప్రారంభమైన సంస్థ .. 5,500 పైగా చిన్న కంపెనీలకు సర్వీసులు అందిస్తోంది. -
రిటైల్ రంగ దిగ్గజంతో టీసీఎస్ భారీ డీల్
ముంబై: రిటైల్ రంగ దిగ్గజం మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ భారీ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మార్క్స్ అండ్ స్పెన్సర్ మానవ వనరుల కార్యకలాపాలను టీసీఎస్ మార్చనుంది. 70 శాతం ప్రాజెక్ట్ పనులను భారత్ నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూకే, యూరప్ నుంచి రూ.8,000 కోట్ల రిటైల్ వ్యాపారం నమోదవుతుందని సంస్థ భావిస్తోంది. ‘జూన్ త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయి. సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ప్రాజెక్టుల రాకపై కంపెనీ ఆశావహంగా ఉంది. చర్చలు కాంట్రాక్టులుగా మళ్లుతున్న వాటి శాతం మెరుగ్గా ఉంది. డిమాండ్ అల్ టైమ్ హైలో దూసుకెళుతోంది’ అని టీసీఎస్ యూరప్ రిటైల్ హెడ్ అభిజీత్ నియోగి తెలిపారు. చదవండి: Realme Pad X Tablet: రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు! -
మైక్రోసాఫ్ట్ ఆఫీసర్‌పై ఐబీఎం దావా
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొత్త చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే రే మెక్‌ఇంటైర్‌పై ఐబీఎం దావా వేసింది. వన్-ఇయర్ నాన్-కంపిటీటివ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై ఈ దావా దాఖలు చేసింది. లిండ్సే-రే అంతకముందు ఐబీఎంలో హెచ్ఆర్ అధినేతగా పనిచేశారు. ఐబీఎం నుంచి అకస్మాత్తుగా రాజీనామా చేసిన లిండ్సే, కంపెనీకి సంబంధించి ఎంతో కీలకమైన, రహస్య సమాచారం కలిగి ఉన్నారని పేర్కొంది. ఐబీఎం డైవర్సిటీ స్ట్రాటజీస్, హైరింగ్ టార్గెట్స్, టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ వంటి సమాచారమంతా ఆమె వద్ద ఉందని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో తెలిపింది. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు. తాత్కాలికంగా లిండ్సేను మైక్రోసాఫ్ట్‌కు వెళ్లకుండా జడ్జి నిషేధం విధించారు. లిండ్సే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె ఇంకా ఐబీఎంకి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌గానే పనిచేస్తున్నట్టు ఉంది. ఆమె తమ ఏడాది ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐబీఎం తెలిపింది.అయితే లిండ్సే వద్దనున్న ట్రేడ్ సీక్రెట్లు మైక్రోసాఫ్ట్‌కు అంత అవసరమైనవి కావని, తన కొత్త బాధ్యతల్లో వీటిని ఉపయోగించే అవకాశం లేదని ఆమె లాయర్లు చెబుతున్నారు. -
ఆ ఫొటోలు పంపితేనే ఉద్యోగం.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్ : అశ్లీల ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని హైదరాబాద్ షీ–టీమ్స్ సోమవారం అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతిలక్రా వెల్లడించారు. సదరు యువతి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖ సంస్థలో నిందితుడు హెచ్ఆర్ విభాగం అధిపతిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువతి సిటీకి చెందిన ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ సైతం పూర్తి చేసిన ఆమెకు ఉద్యోగం వచ్చింది, లేనిది తర్వాత చెప్తానంటూ చెప్పిన ఆ సంస్థ హెచ్ఆర్ విభాగాధిపతి బి.నరేందర్ సింగ్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఈ నెంబర్‌కు యువతి వాట్సాప్ ద్వారా సంప్రదించి తన ఉద్యోగం విషయం ఏమైందంటూ అడిగారు. దీనికి సమాధానంగా ‘నీ హాట్ ఫొటోస్ పంపాలంటూ’ అతడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు కొన్నాళ్ల వరకు మిన్నకుండిపోయారు. ఆపై మరోసారి సంప్రదించగా.. అలాంటి సమాధానమే వచ్చింది. తాను మరికొన్ని ప్రముఖ సంస్థలకూ రిక్రూట్మెంట్స్ చేస్తుంటానని, హాట్ హాట్ ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానని, లేకుంటే భవిష్యత్తులోనూ ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానంటూ బెదిరించాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన బాధితురాలు సిటీ షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని స్వాతిలక్రా కోరారు. వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ వైఫై సేవలు ప్రారంభం
బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ వైఫై సేవలను ఆ సంస్థ హెచ్ఆర్ ఫైనాన్స్ డైరెక్టర్ సుజాత టి రాయ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ టాటా కమ్యూనికేషన్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో 44 మిలియన్ వైఫై హట్స్పాట్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ రోమింగ్ లేకుండా మొబైల్ వినియోగదారులకు వైఫై సేవలు వర్తిస్తాయన్నారు. ఈ సేవలకు సంబంధించిన ప్యాకేజ్ లను ప్రకటించారు. ఏడు రోజుల కాల పరిమితి గల రూ.999 వోచర్, 15 రోజులు కాలపరిమితి గల రూ.1599, 30 రోజుల కాలపరిమితి గల రూ. 1999 వోచర్స్‌కు హై స్పీడ్‌లో అన్ లిమిటెడ్ డాటా వినియోగించవచ్చన్నారు. మై బీఎస్ఎన్ఎల్ ఆప్ ద్వారా డెబిట్, క్రెడిట్, ఇంటర్నేట్ బ్యాంకింగ్ వినియోగించి ప్యాకేజిలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎంటీ ఎల్ అనంతరామ్,ఎన్ఎటీఎఫ్ఎం సీజీఎం జాన్ థామస్‌లు పాల్గొన్నారు.