
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ హెచ్‌ఆర్ విభాగంలో కీలక మార్పులు చేసింది. కాథ్లీన్ హొగన్ స్థానంలో అమీ కోల్ మన్‌ను కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్య నాదెళ్ల నేరుగా ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖలు పంపించారు.
దశాబ్దానికి పైగా మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా సేవలందించిన హొగన్ "ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. నేరుగా సీఈవో సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేసే ఈ హోదాను కొత్తగా సృష్టించారు. చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా మైక్రోసాఫ్ట్ పై కాథ్లీన్ చూపిన ప్రభావాన్ని అతిశయోక్తిగా చెప్పలేమని సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు.
"గత పదేళ్లకు పైగా ఆమె మన సాంస్కృతిక పరివర్తనకు నాయకత్వం వహించారు. వృద్ధి మనస్తత్వాన్ని స్వీకరించి చురుకుదనంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవటానికి ఇది మనకు దోహదపడింది" అంటూ సత్య నాదెళ్ల ప్రశంసించారు.
ఇక మైక్రోసాఫ్ట్ లో 25 ఏళ్లకు పైగా పనిచేసిన కోల్ మన్ ఇటీవల మానవ వనరులు, కార్పొరేట్ ఫంక్షన్లకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సత్య నాదెళ్ల ఆమెను "నమ్మకమైన సలహాదారు" అని అభివర్ణించారు.
ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలలో ఒకటిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే పనితీరు నిర్వహణ ప్రక్రియను సమీక్ష చేపట్టిన మైక్రోసాఫ్ట్ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment