ఒక్క మ్యాథ్స్‌ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది.. | India has the maths talent to lead frontier AI research Satya Nadella | Sakshi
Sakshi News home page

ఒక్క మ్యాథ్స్‌ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..

Published Thu, Jan 9 2025 8:26 AM | Last Updated on Thu, Jan 9 2025 8:26 AM

India has the maths talent to lead frontier AI research Satya Nadella

న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలని టెక్‌ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్‌ మోడల్స్‌ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్‌ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా  ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.

కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్‌ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఇండియా ఏఐ టూర్‌ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.

ప్రస్తుతం ఓపెన్‌ఏఐ, గూగుల్‌లాంటి టెక్‌ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్‌ మోడల్స్‌) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్‌టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, మహీంద్రా గ్రూప్‌ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.

ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్‌ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.  

5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
ఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ దక్షిణాసియా ప్రెసిడెంట్‌ పునీత్‌ చందోక్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement