భర్త, అత్తమామలే హత్య చేశారని ఫిర్యాదు
మృతురాలి మామ.. ఎమ్మెల్యే గంటా వద్ద ఆడిటర్
భర్త, మామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గతేడాది వరకు ఆమె సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్‌ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.
గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది.
వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం.
విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్‌లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment