మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొత్త చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే రే మెక్ఇంటైర్‌పై ఐబీఎం దావా వేసింది. వన్-ఇయర్ నాన్-కంపిటీటివ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెపై ఈ దావా దాఖలు చేసింది. లిండ్సే-రే అంతకముందు ఐబీఎంలో హెచ్‌ఆర్ అధినేతగా పనిచేశారు. ఐబీఎం నుంచి అకస్మాత్తుగా రాజీనామా చేసిన లిండ్సే, కంపెనీకి సంబంధించి ఎంతో కీలకమైన, రహస్య సమాచారం కలిగి ఉన్నారని పేర్కొంది. ఐబీఎం డైవర్సిటీ స్ట్రాటజీస్, హైరింగ్ టార్గెట్స్, టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ వంటి సమాచారమంతా ఆమె వద్ద ఉందని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో తెలిపింది.
అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు. తాత్కాలికంగా లిండ్సేను మైక్రోసాఫ్ట్‌కు వెళ్లకుండా జడ్జి నిషేధం విధించారు. లిండ్సే లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె ఇంకా ఐబీఎంకి హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌గానే పనిచేస్తున్నట్టు ఉంది. ఆమె తమ ఏడాది ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐబీఎం తెలిపింది.అయితే లిండ్సే వద్దనున్న ట్రేడ్ సీక్రెట్లు మైక్రోసాఫ్ట్‌కు అంత అవసరమైనవి కావని, తన కొత్త బాధ్యతల్లో వీటిని ఉపయోగించే అవకాశం లేదని ఆమె లాయర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment