
సంస్థ 50వ వార్షికోత్సవంలో అంతరాయం
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతిక సాయం అందిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌పై ఉద్యోగులు నిరసన తెలిపారు. సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి పలుమార్లు అంతరాయం కలిగించారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ప్రసంగిస్తుండగా ఉద్యోగి ఇబ్దిహాల్ అబూస్సాద్ లేచి నినాదాలు చేశారు.
‘ముస్తఫా ఇది నీకు సిగ్గు చేటు.. మైక్రోసాఫ్ట్ చేతులకూ రక్తం అంటింది’అంటూ నిరసన తెలిపారు. ‘ఏఐని మంచి కోసం ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు కానీ.. మైక్రోఐసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి కృత్రిమ మేథ ఆయుధాలను అందించింది. 50 వేల మంది ప్రాణాలు తీసిన మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహకరించింది’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాకు సంఘీభావానికి చిహ్నమైన కెఫియేను వేదికపైకి విసిరారు.
అందుకు స్పందించిన సులేమాన్ ‘మీ నిరసనకు ధన్యవాదాలు.. నేను మీరు చెప్పింది విన్నాను’అని అన్నారు. సెక్యూరిటీ ఆమెను బయటికి పంపారు. తరువాత రెండో కార్యక్రమంలో నిరసనలు కొనసాగాయి. మాజీ సీఈఓలు బిల్‌గేట్స్, స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్లలు వేదికపై ఉండగా.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ నిరసన తెలిపారు. ఏఐ టూల్ ఉపయోగించి 2023లో లెబనాన్‌లపై చేసిన దాడుల్లో ముగ్గురు యువతులతోపాటు తన నానమ్మను బలిగొందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలస్తీనాకు సంఘీభావంగా మైక్రోసాఫ్ట్‌లో నిరసన ఇది మొదటిది కాదు. సత్యనాదెళ్ల సమావేశంలో ఇజ్రాయెల్‌తో సైనిక ఒప్పందాలను నిరసించినందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఐదుగురు ఉద్యోగులను తొలగించారు. అయితే అంతర్గత సమావేశం కావడంతో విషయం బయటికి రాలేదు. వార్షికోత్సవ సమయంలో జరగడంతో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం నాటి ఘటన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు సంస్థ స్వేచ్ఛనిస్తుందని, అదే సమయంలో అవి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అబూస్సాద్, అగర్వాల్‌లపై చర్యలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికయితే తమ ఐడీలు పనిచేయడం లేదని వారిద్దరూ తెలిపారు.