Microsoft employees
-
ఇజ్రాయెల్‌తో సైనిక ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల నిరసన
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతిక సాయం అందిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌పై ఉద్యోగులు నిరసన తెలిపారు. సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి పలుమార్లు అంతరాయం కలిగించారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ప్రసంగిస్తుండగా ఉద్యోగి ఇబ్దిహాల్ అబూస్సాద్ లేచి నినాదాలు చేశారు. ‘ముస్తఫా ఇది నీకు సిగ్గు చేటు.. మైక్రోసాఫ్ట్ చేతులకూ రక్తం అంటింది’అంటూ నిరసన తెలిపారు. ‘ఏఐని మంచి కోసం ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు కానీ.. మైక్రోఐసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి కృత్రిమ మేథ ఆయుధాలను అందించింది. 50 వేల మంది ప్రాణాలు తీసిన మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహకరించింది’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాకు సంఘీభావానికి చిహ్నమైన కెఫియేను వేదికపైకి విసిరారు. అందుకు స్పందించిన సులేమాన్ ‘మీ నిరసనకు ధన్యవాదాలు.. నేను మీరు చెప్పింది విన్నాను’అని అన్నారు. సెక్యూరిటీ ఆమెను బయటికి పంపారు. తరువాత రెండో కార్యక్రమంలో నిరసనలు కొనసాగాయి. మాజీ సీఈఓలు బిల్‌గేట్స్, స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్లలు వేదికపై ఉండగా.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ నిరసన తెలిపారు. ఏఐ టూల్ ఉపయోగించి 2023లో లెబనాన్‌లపై చేసిన దాడుల్లో ముగ్గురు యువతులతోపాటు తన నానమ్మను బలిగొందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా మైక్రోసాఫ్ట్‌లో నిరసన ఇది మొదటిది కాదు. సత్యనాదెళ్ల సమావేశంలో ఇజ్రాయెల్‌తో సైనిక ఒప్పందాలను నిరసించినందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఐదుగురు ఉద్యోగులను తొలగించారు. అయితే అంతర్గత సమావేశం కావడంతో విషయం బయటికి రాలేదు. వార్షికోత్సవ సమయంలో జరగడంతో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం నాటి ఘటన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు సంస్థ స్వేచ్ఛనిస్తుందని, అదే సమయంలో అవి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అబూస్సాద్, అగర్వాల్‌లపై చర్యలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికయితే తమ ఐడీలు పనిచేయడం లేదని వారిద్దరూ తెలిపారు. -
మైక్రోసాఫ్ట్ గివింగ్ క్యాంపెయిన్
మైక్రోసాఫ్ట్ సంస్థ గివింగ్ క్యాంపెయిన్ పేరిట పలు కార్యక్రమాలు చేపడుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ 1983లో ‘గ్లోబల్ గివింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 2000 సంవత్సరం నుంచి భారత్‌లో కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఎంఎస్ఐడీసీ) దేశవ్యాప్తంగా తన ఉద్యోగులతో గివింగ్ క్యాంపెయిన్ చేపడుతోంది. ఈ క్యాంపెయిన్ లో తొలిరోజు.. ఈ నెల 17న డే ఆఫ్ కేరింగ్ జరుపుకొంది. డే ఆఫ్ కేరింగ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఫొటోగ్రఫీపై ఆసక్తిగల వారు వివిధ ఎన్జీవోలను సందర్శించి, అవి చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు తీశారు. ‘గివింగ్ క్యాంపెయిన్’లో భాగంగా ఈ నెల 28న ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’, ఈ నెల 31న 5కే రన్/వాక్ కార్యక్రమాలు చేపట్టనుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గల మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరూ ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’లో పాల్గొంటారు. ప్రపంచంలోని ప్రతి టైమ్జోన్లోనూ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమకు తోచిన రీతిలో పరుగు, ఈత, నడక, బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఈ నెల 31న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఉద్యోగులు 5కే రన్/వాక్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను ఎల్వీ ప్రసాద్, శంకర నేత్ర చికిత్సాలయాలకు అందిస్తారు. - సిటీప్లస్ -
ప్రతీ వ్యక్తి సాధికారతే మైక్రోసాఫ్ట్ లక్ష్యం
వాషింగ్టన్: భూగ్రహంపై ఉన్న ప్రతీ వ్యక్తి, ప్రతి సంస్థ సాధికారత కోసం ఉత్పాదకతను పునర్ ఆవిష్కరించడమే తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ భాగస్వాములకు, ఉద్యోగులకు ఒక లేఖను మెయిల్ చేశారు. ఇక్కడ సోమవారం నుంచి ప్రారంభమై 4రోజుల పాటు జరిగే 2014 వరల్డ్‌వైడ్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ లేఖ రాశారు. ఈ సమావేశంలో ఆయన నేడు (బుధవారం) కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశానికి భారత్ నుంచి 150 మంది హాజరవుతున్నారు. కాగా టెక్నాలజీ వినియోగంలో భారత్‌లోని చిన్నసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సంబంధిత విభాగ జనరల్ మేనేజర్ మీతుల్ బి. పటేల్ ఈ సమావేశంలో చెప్పారు.