న్యూస్‌మేకర్: సృష్టి దబాస్
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం.
ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్‌కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు.
కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్‌కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు.
ముందు కుటుంబం
ఢిల్లీలో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది.
‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది.
మొదటి అటెంప్ట్
టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని.
తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్‌లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి.
చట్ట ప్రకారం
సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్‌మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్‌కౌంటర్‌లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్‌డోజర్‌లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది.
అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్‌ను కూడా క్లాసికల్‌గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది
Comments
Please login to add a commentAdd a comment