నెలవారీ చెల్లింపులు మరింత భారం | RBI Hikes Lending Rate To 6.25 Percent Fifth Hike In A Row | Sakshi
Sakshi News home page

నెలవారీ చెల్లింపులు మరింత భారం

Published Thu, Dec 8 2022 1:24 AM | Last Updated on Thu, Dec 8 2022 1:24 AM

RBI Hikes Lending Rate To 6.25 Percent Fifth Hike In A Row - Sakshi

ముంబై: వరుసగా ఐదో విడత ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది.

ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. 

వృద్ధి అంచనాలకు కోత 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్‌బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్‌ సంస్థలు సైతం భారత్‌ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్‌ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్‌ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్‌ ప్రాంతాల్లో డిమాండ్‌ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.  

ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. 
మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు.  పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్‌బీఐ ఇటీవలే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

పాలసీలోని ఇతర అంశాలు 
ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. 
సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్‌బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. 
ఆర్‌బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్‌ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్‌ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. 
యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్‌ బ్లాక్, మల్టీ డెబిట్స్‌’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్‌ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్‌ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం.  
భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు.

రేట్ల పెంపు స్పీడ్‌ తగ్గినట్టే 
ఆర్‌బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్‌గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్‌ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. 
– సాక్షి గుప్తా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త 

రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్‌గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్‌బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. 
– సంజీవ్‌ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్‌ 

రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. 
– హర్షవర్ధన్‌ పటోడియా, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement