growth forecast
-
6.8 శాతం వరకూ భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది. ఎకానమీ పటిష్టమే.. 2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్‌లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది. → గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. → 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. → భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది. → భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి. → సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. → భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్‌పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ 2024లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ రిస్క్‌లు ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్నే కొనసాగించేందుకు (2024 చివరి వరకు) దారితీయవచ్చని తెలిపింది.తగినన్ని ఆహార నిల్వలు, పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయని, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం (4 శాతం) దిశగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.21 శాతానికి చేరడం తెలిసిందే. ‘‘పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురయ్యే ద్రవ్యోల్బణం రిస్క్, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ద్రవ్య విధానాన్ని సడలించే విషయంలో ఆర్బీఐ అప్రమత్తతను తెలియజేస్తోంది’’అని మూడీస్ పేర్కొంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్ఈ ఏడాదికి చివరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 7–9 తేదీల మధ్య జరగనుంది. గృహ వినియోగం పెరగనుందని చెబుతూ.. పండుగల సీజన్లో కొనుగోళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడాన్ని మూడీస్ తన నివేదికలో ప్రస్తావించింది. సామర్థ్య వినియోగం పెరుగుతుండడం, వ్యాపార సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుండడం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. -
భారత్ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 30 బేసిస్ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్ ఇంజిన్’’గా భారత్ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. -
వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్..
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు. బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది. తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనా పెంపు కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం. -
భారత్ వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ప్రపంచబ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 6.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రైవేటు వినియోగం తగ్గడం, ప్రభుత్వ రుణ వ్యయాలు, ద్రవ్యలోటు భయాల వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణమని ప్రపంచ ఆర్థిక అంశాలకు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. అయితే సేవల రంగం పటిష్టంగా ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా వివరించింది. కాగా 2022లో ప్రపంచ వృద్ధి 3.1 శాతం ఉంటే, 2023లో ఇది 2.1 శాతానికి తగ్గుతుందని కూడా తాజా నివేదికలో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. ఇక చైనా కాకుండా మిగిలిన వర్థమాన దేవాల ఎకానమీ గత ఏడాది 4.1 శాతం ఉంటే, 2023లో 2.9 శాతానికి తగ్గుతుందని కూడా పేర్కొంది. ఇదీ చదవండి: గుడ్ న్యూస్: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు -
నెలవారీ చెల్లింపులు మరింత భారం
ముంబై: వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. వృద్ధి అంచనాలకు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ పాలసీలోని ఇతర అంశాలు ►ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. ►సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ►ఆర్బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ►యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం. ►భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్ల పెంపు స్పీడ్ తగ్గినట్టే ఆర్బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్‌గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్‌గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
వేవ్‌లతో భారత్ ఎకానమీకి దెబ్బ,11 నుంచి 9.5 శాతానికి తగ్గిన వృద్దిరేటు
న్యూఢిల్లీ: మహమ్మారి తదుపరి వేవ్‌ల నుంచి భారత్ ఎకానమీకి ఇబ్బంది పొంచి ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవుట్‌లుక్ అనిశ్చితిలో ఉందని హెచ్చరించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తొలి (మార్చినాటి) అంచనాల 11 శాతాన్ని తాజాగా 9.5 శాతానికి తగ్గించింది. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాలెన్స్ షీట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం వచ్చే రెండేళ్లలో కనబడుతుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితం అవుతుంది. వ్యాక్సినేషన్ నత్తనడక నడుస్తుండడం ప్రతికూలాంశం. మొత్తం ప్రజల్లో కేవలం 15 శాతం మం దికి మాత్రమే ఇప్పటి వరకూ తొలి విడత వ్యాక్సినేషన్ జరిగింది. అయితే ఇకపై వ్యాక్సినేషన్ మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నాం. మొదటివేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో తయారీ, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినకపోయినప్పటికీ, సేవల రంగం మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. వాహన విక్రయాల వంటి కీలక వినియోగ సూచీలు 2021 మేలో తీవ్రంగా పడిపోయాయి. వినియోగ విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనలు తగ్గుతున్నాయి. రవాణా మెరుగుపడుతోంది. అయితే రికవరీ 2021 తొలి మూడు నెలల నాటి స్థాయిలో వేగంగా ఉండకపోవచ్చు. కుటుంబాల పొదుపు రేట్లు పడిపోతున్నాయి. దీనితో వినియోగానికి మద్దతు లభించడంలేదు. ఒకవేళ ఉన్న కొద్దోగొప్పో డబ్బును కుటుంబాలు పొదుపుచేసుకోవడం మొదలుపెడితే, ఎకానమీ పునఃప్రారంభమైనా కుటుంబాల పరంగా వ్యయాలు అంతగా వేగం పుంజుకోకపోచ్చు. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాలు తగిన సరళతరంగానే కొనసాగవచ్చు. అయితే ఇప్పట్లో తాజా ఉద్దీపన ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (2–6 శ్రేణి) కన్నా అధికంగా ఆరు శాతంపైగా కొనసాగుతున్న పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్ మరో దఫా రెపో రేటు కోతకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) అవకాశం లేదు. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ద్రవ్య విధానం విషయంలో ప్రభుత్వానికి పరిమితులున్నాయి. ఇందులో మొదటిది సెకండ్ వేవ్ రావడానికి ముందే– ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి. భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22లో రెండంకెలపైనే ఉంటుందని సెకండ్‌వేవ్‌కు ముందు పలు విశ్లేషణా సంస్థలు అంచనావేశాయి. అయితే తరువాత కాలంలో ఈ రేటును ఒకంకెలోపునకు తగ్గించేశాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఈ నెల ప్రారంభంలో వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. -
ఐఎంఎఫ్ : పాతాళానికి వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) షాకింగ్ అంచనాలతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్ వృద్ధి రేటు కేవలం 1.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 1991 చెల్లింపుల సంక్షోభం తర్వాత భారత్ వృద్ధి రేటు ఇంతటి కనిష్టస్ధాయికి చేరుతుందనే అంచనా వెలువడటం ఇదే తొలిసారి. వృద్ధి రేటు దిగజారినా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ పేర్కొంది. మరోవైపు అగ్రదేశాల్లో ఈ ఏడాది అమెరికా (-5.9), జపాన్ (-5.2), బ్రిటన్ (-6.5), జర్మనీ (-7.1), ఫ్రాన్స్ (-7.2), ఇటలీ (-9.1), స్పెయిన్ -8 శాతం నెగెటివ్ వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇక చైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందని తెలిపింది. భారత్, చైనాలు మాత్రమే సానుకూల వృద్ధి రేటును సాధిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పాశ్చాత్య దేశాల వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంటుందని పలు సంస్ధలు అంచనా వేస్తున్నాయి. చదవండి : మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విధ్వంసంతో 1991లో సరళీకరణ అనంతరం భారత్‌లో తొలిసారిగా వృద్ధి రేటు కనిష్టస్ధాయికి పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ సైతం వెల్లడించింది. దక్షిణాసియా ఆర్థిక దృక్కోణం నివేదికలో భారత్ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. మార్చి 31తో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు -3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని, మహమ్మారి వ్యాప్తితో స్వల్పకాలంలోనే వృద్ధి రేటును అనూహ్యంగా తగ్గించామని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. -
ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత
పారిస్: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార– అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8% నుంచి 1%కి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7%కి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది. బ్రిటన్ అంచనాలూ తగ్గింపు అలాగే, బ్రెగ్జిట్ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్ నుంచి బ్రిటన్ వైదొలిగితే యూరోపియన్ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4%నుంచి 0.8%కి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్ (బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనా వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థపై మూడీస్
ముంబై: భారత్ ఆర్ధిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించడమన్నది ఇక గతమేనని రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. 2015 ద్వితీయార్థానికి దేశం 6.5 శాతం వృద్ధి రేటు సాధన సామర్థ్యానికి చేరుకోగలదని గురువారం వెలువరించిన తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్ వృద్ధి రేటు ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరిపోయినట్లేనని, ఇంతకంటే దిగువకు పడిపోదని భావిస్తున్నామని కూడా పేర్కొంది. ఇక్కడ నుంచి ఇక రికవరీ బాట పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే నాల్గవ క్వార్టర్ నుంచీ పెట్టుబడులు పెరగాల్సి ఉంటుందని మూడీస్ ఆర్థికవేత్త గ్లాన్ లివీన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.