
పారిస్: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార– అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8% నుంచి 1%కి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7%కి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది.
బ్రిటన్ అంచనాలూ తగ్గింపు
అలాగే, బ్రెగ్జిట్ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్ నుంచి బ్రిటన్ వైదొలిగితే యూరోపియన్ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4%నుంచి 0.8%కి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్ (బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనా వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది.