brexit
-
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్‌రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్‌పై సంతకాలు చేశారు. -
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
ఈయూ, బ్రిటన్లతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు!
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ తదనంతర వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ రెండు ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే పూర్తి స్థాయిలో మదింపుచేయడం కష్టమని విశ్లేషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నిర్మాణం, పరిశోధనా–అభివృద్ధి, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి సేవల విషయంలో ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు. ఈయూ–బ్రిటన్ ఒప్పందం సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ అంచనాకు ప్రధాన కారణం. జనవరి 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలగనుంది (బ్రెగ్జిట్). ఈ పరిస్థితుల్లో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంపై అవరోధాలను తొలగించుకోవడానికి గురువారం జరిగిన చర్చలు కొంతవరకూ సఫలీకృతం అయ్యాయి. సేవల రంగానికి ప్రయోజనం... భారత్ వస్తువులకు ఎఫ్‌టీఏల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటు బ్రిటన్ ఇటు ఈయూ మార్కెట్లలో సేవల రంగానికి సంబంధించి మనం చక్కటి అవకాశాలను సొంతం చేసు కోవచ్చు. దీనికి తగిన వ్యూహముండాలి. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డీజీ కేంద్రానికి సిఫారసు చేశాం... యూరోపియన్ యూనియన్, బ్రిటన్లతో ఎఫ్టీఏలకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే నెల్లో భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తున్న సందర్భంగా దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వాన్ని కోరాం. – శరద్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ బ్రిటన్‌తో వాణిజ్య అవకాశాలు... ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలను ముందుకు తీసుకుని వెళ్లడానికి భారత్‌కు ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని భావించవచ్చు. – బిశ్వజిత్ ధర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
మార్కెట్ మూడోరోజూ ముందుకే..!
ముంబై: క్రిస్మస్కు ముందురోజు స్టాక్ మార్కెట్‌కు భారీగా లాభాలొచ్చాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. బ్రెగ్జిట్ ఒప్పందం సఫలీకృతమవచ్చనే ఆశలతో అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 46,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 13,749 వద్ద నిలిచింది. మూడురోజుల వరుస ర్యాలీతో సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో కోల్పోయిన భారీ నష్టాలన్నీ రికవరీ అయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ఈ వారం ఆరంభం నుంచి పరుగులు పెట్టిన ఐటీ షేర్ల జోరుకు బ్రేక్ పడింది. రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. అలాగే మీడియా, రియల్టీ రంగాల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ వారంలో జరిగిన నాలుగురోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్లను నష్టపోయింది. సెంటిమెంట్ బలంగానే... డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు తేది దగ్గర పడుతున్న తరుణంలో సూచీలు స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, అయితే ఓవరాల్‌గా మార్కెట్ సెంటిమెంట్ బలంగానే ఉందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐపీఓకు అనుపమ్ రసాయన్ స్పెషాలిటీ కెమికల్ రంగంలో సేవలు అందించే అనుపమ్ రసాయన్ ఐపీఓకు సిద్ధమైంది. ఐష్యూ ద్వారా కంపెనీ రూ.760 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఇందు కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. సమీకరించిన నిధుల్లో అధిక భాగం అప్పులను తీర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది. ఐపీఓ భాగంగా కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా షేర్లను కేటాయించనుంది. -
తప్పుడు ప్రచారం తడాఖా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్ నిరూపించారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది. గత ఏడాది అక్టోబర్‌లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్ ప్రభుత్వమే. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్ మ్యూలర్ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్‌లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్ మ్యూలర్ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది. ఇందులో నేరుగా ట్రంప్ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ట్రంప్ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్‌కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్‌లోనూ స్కాట్లాండ్ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో మార్ఫింగ్ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు. వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్‌లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్‌లో కామన్స్ సభ సభ్యులతో పోలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్‌కి చెందినవని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్‌లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఈయూకు టాటా..
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు. సంబరాలు.. నిరసనలు ఈ ప్రత్యేక సందర్భంలో లండన్‌లోని పార్లమెంట్ స్వే్వర్తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్‌డౌన్ తెలుపుతూ భారీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్‌తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది. మిశ్రమ స్పందన బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్‌ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్‌లోని డోవర్‌కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్‌లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు. ఈమె స్విట్జర్లాండ్‌లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్‌కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు. -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్‌తో బ్రెగ్జిట్‌పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో) -
రివైండ్ 2019: గ్లోబల్ వార్నింగ్స్
అంతర్జాతీయంగా 2019 ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... అమెరికా – ఉత్తర కొరియా అణు సంక్షోభం ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చాలని అగ్రరాజ్యం భావి స్తూ ఉంటే, దేశ అధ్యక్షుడు కిమ్ మరి న్ని అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త తల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలో జూన్ 30న అడుగు పెట్టడం ఈ ఏడాది అతి పెద్ద విశేషం గా చెప్పుకోవాలి. ఉత్తర కొరియాకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తర కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాధినేతలు అణు చర్చలు జర పాలని నిర్ణయించారు. కానీ అక్టోబర్ 1 వరకు అది సాధ్యం కాలేదు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లం ఘించి మరీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధులు అక్టోబర్ 5న సంప్రదింపులు జరిపారు. అవి కూడా ముందుకు వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఈ ఏడాది ఎన్నెన్నో ప్రభావవంతమైన ఘటనలకు వేదికయింది. ఆ వివరాలు చూస్తే... ట్రంప్ అభిశంసనకు ఓకే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనని ఎదుర్కొ న్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి పోటీదారు అయిన జో బైడెన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలకు తగు ఆధారాలు సంపాదించి, విచారణ జరపాలని... తనకు రాజకీయంగా సహకరించాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారని, కాంగ్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ ప్రతినిధుల సభలో విచారణ సాగింది. ప్రతినిధుల సభ అభిశంసనకి అనుకూలంగా ఓటు కూడా వేసింది. ఈ అభిశంసన తీర్మానం కొత్త ఏడాది జనవరిలో సెనేట్‌లో చర్చకు రానుంది. హాంగ్‌కాంగ్ భగ్గు హాంగ్‌కాంగ్‌లో భగ్గుమన్న నిరసనలు ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో మరెన్నో పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచాయి. చైనా చేసిన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో అగ్గి రాజుకుంది. ఈ బిల్లు నిందితుల్ని చైనాలో విచారించడానికి వీలు కల్పిస్తుంది. చైనా ప్రభుత్వ విధానాలపై కొన్నేళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హాంగ్‌కాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసిస్తూ రోడ్డెక్కారు. ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రమయ్యాయి. బ్రెగ్జిట్ గెలుపు.. బోరిస్ జాన్సన్ 2019 చివరలో బ్రిటన్ ఒక స్పష్టమైన వైఖరిని కనబరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను (బ్రెగ్జిట్) 2020 మార్చి 29 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించుకుంది. దీనికి తగ్గట్టుగా దేశంలో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధానిగా మూడు సార్లు బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన థెరెస్సా మే... తన పదవికి రాజీనామా చేయగా అప్పటికే కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ ఈయూతో ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ నుంచి వైదొలుగుతామని చెప్పారు. దీంతో పార్టీ ఆయన్ను ప్రధానిని చేసింది. అయితే సభలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించే సంప్రదాయవాదులు కూడా ఉండడంతో జాన్సన్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజార్టీతో నెగ్గారు. జనవరి 31లోగా బ్రెగ్జిట్‌కు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తానని జాన్సన్ వెల్లడించారు. అమెజాన్ చిచ్చు పుడమికి ఊపిరితిత్తులుగా పేరొందిన బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టించింది. ఇక్కడ కార్చిచ్చులు సర్వ సాధారణమైనా 2019లో 80 వేల చోట్ల చెలరేగిన కార్చిచ్చులు రికార్డు సృష్టించాయి. -
జనవరి 31న ‘బిగ్‌బెన్’ బ్రెగ్జిట్ గంటలు
లండన్: లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్‌లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్‌బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. -
సుస్థిరతకు బ్రిటన్ పట్టం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న ‘బ్రెగ్జిట్’ నినాదం రాజుకుని రాజకీయ రూపం సంతరించుకున్నప్పటినుంచీ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ చివరకు దృఢమైన నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్థిస్తున్న కన్సర్వేటివ్ పార్టీకి గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి రాజకీయ అస్థిరత్వానికి తెరదించింది. అయిదేళ్లలో మూడో దఫా జరిగిన ఈ ఎన్నికల్లో సైతం హంగ్ పార్లమెంట్ తప్పదని, కన్సర్వేటివ్‌లకు బొటాబొటీ మెజారిటీ వస్తుందని, అది విపక్షాలతో కలిసి జాతీయ సంకీర్ణ ప్రభుత్వంతో సరిపెట్టుకోక తప్పదని అంచనా వేసిన రాజకీయ పండితులను శుక్రవారం వెలువడిన ఫలితాలు వెక్కిరించాయి. పార్లమెంటు లోని 650 స్థానాల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 365 స్థానాలు సాధించగా, దాని ప్రధాన ప్రత్యర్థి లేబర్ పార్టీ కేవలం 203 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశం ఈయూలోనే ఉండాలని బలంగా వాదించిన లిబరల్ డెమొక్రాట్లకు కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. స్కాటిష్ నేషనల్ పార్టీకి 48 లభించాయి. ఎగ్జిట్ పోల్స్ కన్సర్వేటివ్‌లు భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉన్నదని ముందే జోస్యం చెప్పాయి. అదే నిజమైంది. పద్నాలుగేళ్ల తర్వాత కన్సర్వేటివ్ పార్టీకి పార్లమెంటులో ఇంత స్పష్టమైన మెజారిటీ లభించడం ఇదే మొదటిసారి. అలాగే ఆ పార్టీకి 1987లో లభించిన స్థానాలకన్నా ఈసారి అత్యధిక స్థానాలు వచ్చాయి. అటు లేబర్ పార్టీది ఘోరమైన పరాజయం. తాజా ఎన్నికలతో కలుపుకొని చూస్తే అది వరసగా నాలుగు సాధా రణ ఎన్నికల్లో ఓటమిపాలైట్టు లెక్క. పైగా 80 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కింది స్థాయికి అది పడిపోయిన దాఖలా లేదు. అయిదేళ్లలో మూడు పార్లమెంటు ఎన్నికలను చవిచూసిన బ్రిటన్ ప్రజానీకం ఈ అస్థిరతకూ, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలకూ విసుగెత్తి కన్సర్వేటివ్‌లకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. అయితే ఈ ఫలితాల్లో మరో ప్రమాదం పొంచివుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ గడ్డపై భారీగా సీట్లు సాధించింది. కనుక తమ డిమాండ్‌పై మరోసారి రెఫరెండం నిర్వహించాలని ఆ పార్టీ పట్టుబడుతుంది. అదే జరిగితే బ్రిటన్‌కు రాజ్యాంగ సంకటం ఎదురవుతుంది. 2014లో తొలిసారి జరిగిన రెఫరెండంలో 55 శాతంమంది ఐక్యతకే ఓటే యడంతో ఆ డిమాండ్ వీగిపోయింది. అయితే అప్పట్లో బ్రెగ్జిట్ గొడవ లేదు. ఈయూతో కలసి వుండాలన్న తమ ఆకాంక్షకు విరుద్ధంగా ఇప్పుడు జరగబోతోంది గనుక ఈసారి రెఫరెండం నిర్వహిస్తే వారు బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. 312 ఏళ్లక్రితం రెండు రాచ కుటుంబాల మధ్య ఏర్పడ్డ వివాహబంధంతో ఆ ప్రాంతం బ్రిటన్‌లో విలీనమైంది. ప్రపంచమంతా మితవాద ధోరణివైపు మొగ్గు చూపుతున్న వర్తమానంలో బ్రిటన్ అందుకు విరుద్ధమైన తీర్పునిస్తుందని కొందరు విశ్లేషకులు ఆశించిందంతా దురాశే కావొచ్చు. కానీ అందుకు కారణాలున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవలనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రూపంలో పోలికలున్న బోరిస్ జాన్సన్ ఆయన గుణాలనే పుణికిపుచ్చుకున్నారు. తరచుగా మహిళ లను కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం, ఇస్లాంను పెనుభూతంగా చూడటం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వంటì దురలవాట్లు జాన్సన్‌కు కూడా ఉన్నాయి. పైగా ఈయూతో ఒప్పందం కుదిరితే సరేసరి... లేదా ఏ ఒప్పందమూ లేకుండా బయటికొచ్చేయడానికి కూడా సిద్ధమని ఆయన చేసిన ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. మొన్న మే నెలలో మరో 27 సభ్య దేశాలతోపాటు బ్రిటన్లోకూడా జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అంతకుముందున్న 19 స్థానాల్లో 15 కోల్పోయి, నాలుగుకు పరిమితమైంది. లేబర్ పార్టీ అంతకుముందున్న 20 స్థానాల్లో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. ఈయూతోనే ఉండాలన్న లిబరల్ డెమొక్రాట్లు అంతకుముందున్న ఒక స్థానం నుంచి ఏకంగా 15కు చేరుకున్నారు. బ్రెగ్జిట్‌కు పట్టుబడుతున్న తీవ్ర మితవాద రాజకీయ పక్షం బ్రెగ్జిట్ పార్టీ 29 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకూ, ఆర్నెల్లక్రితం జరిగిన ఈయూ ఎన్నికల ఫలితాలకూ పొంతనే లేదు. ఆ ఎన్నికల్లో దెబ్బతిన్న కన్సర్వే టివ్‌లు చాలా త్వరగా కోలుకుని బలోపేతం కాగా, లేబర్ పార్టీకి అవే ఫలితాలు పునరావృతమ య్యాయి. ఈయూ ఎన్నికల్లో పుంజుకున్నట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం బ్రెగ్జిట్ పార్టీ ఈ ఎన్ని కల్లో సున్నా చుట్టింది. ఒక్క సీటూ గెల్చుకోలేక డీలాపడింది. బోరిస్ జాన్సన్ రూపంలో బలమైన మితవాది రంగంలో ఉండగా నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని బ్రెగ్జిట్ పార్టీ దండగని ఓటర్లు అనుకుని ఉండొచ్చు. భారీగా మెజారిటీ సాధించిన బోరిస్ జాన్సన్‌కు ఇప్పుడు చేతినిండా పని. ఆయన పరిపూర్తి చేయాల్సిన కర్తవ్యాలు సాధారణమైనవి కాదు. సాధ్యమైనంత తక్కువ నష్టంతో ఈయూ నుంచి బయటకు రావడం, ఆ సంస్థ సభ్య దేశాలతో విడివిడిగా మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం రెండూ సంక్లిష్టమైనవి. బ్రెగ్జిట్‌ను వచ్చే జనవరి 31కల్లా పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన పదే పదే చెప్పారు. అదంత సులభం కాదు. అందులో ఎన్ని చిక్కు ముడులున్నాయంటే...బ్రిటన్ ఏ ఒప్పందమూ లేకుండా నిష్క్రమించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. ఈ క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి కొన్ని ‘పొదుపు’ చర్యలు కూడా ఆయన తీసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్హెచ్ఎస్) సహా పలు పథకాలకు కోత, ప్రైవేటీకరణ వంటివి తప్పకపోవచ్చు. ఎన్‌హెచ్‌ఎస్‌ని ప్రైవేటీకరిస్తే ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని లేబర్ పార్టీ చేసిన ప్రచారాన్ని ఖాతరు చేయని జనం సుస్థిర ప్రభుత్వంతో తమకు మేలే తప్ప కీడు జరగదని విశ్వసించారు. దాన్ని జాన్సన్ ఎలా నిలబెట్టుకోగలరో చూడాలి. -
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్‌కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్‌పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్‌లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్‌కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
బ్రెగ్జిట్ ఆలస్యానికే ఓటు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆలివర్ లెట్విన్ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు. ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్ పార్టీ నేత కార్బైన్ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్ అర్థరహితం. అక్టోబర్ ఆఖరు కల్లా బ్రెగ్జిట్ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్‌కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్ సాటర్డే సెషన్’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉండగా ఫాక్‌ల్యాండ్ యుద్ధంపై ఓటింగ్ కోసం ఏర్పాటైంది. -
జాన్సన్‌కు అగ్నిపరీక్ష
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి తప్పుకోవడానికి తుది గడువు సమీపిస్తుండటంతో బేజారె త్తుతున్న బ్రిటన్ పౌరులకు ఊహించని కబురు అందింది. ప్రధాని బోరిస్ జాన్సన్‌కూ, ఈయూకు మధ్య దీనిపై ఒక ఒప్పందం కుదిరిందన్నదే దాని సారాంశం. అయితే అందుకు సంతోషించాలో, కంగారు పడాలో తెలియని అయోమయావస్థలో చాలామంది పౌరులున్నారు. ఎందుకంటే ఇప్పు డున్న పరిస్థితుల్లో జాన్సన్ ఈయూతో ఏ మేరకు మెరుగైన ఒప్పందానికి రాగలిగారో... దానికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. జాన్సన్ మాత్రం బ్రహ్మాండం బద్దలు చేశానని స్వోత్కర్షకు పోతున్నారు. దాన్ని పార్లమెంటు ఆమోదించి తీరాలం టున్నారు. శనివారం జరగబోయే ఓటింగ్‌లో ఆ కార్యక్రమం పూర్తయితే ఇతర ప్రాధాన్యతల దిశగా వేగం పెంచవచ్చునని హితవు చెబుతున్నారు. కానీ తనకు ముందు పనిచేసిన థెరిస్సా మే ఇలాగే ఒక ఒప్పందానికి వచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టి భంగపడ్డారు. వరసగా మూడుసార్లు పార్లమెంటులో ఓడిపోయి చివరకు ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా ఓటేసినవారంద రినీ జాన్సన్ కొత్త ఒప్పందంపై ఒప్పించాల్సి ఉంటుంది. కన్సర్వేటివ్ పార్టీకి కొందరు గుడ్‌బై చెప్పగా, మరికొందరిని పార్టీయే బయటకు పంపింది. మిగిలినవారిలో అనేకులు బ్రెగ్జిట్‌ను ఆపాలని కోరు కుంటున్నారు. ఇదంతా చాలదన్నట్టు కన్సర్వేటివ్ పార్టీకి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ(డీయూపీ) ఈ ఒప్పందంపై పెదవి విరుస్తోంది. ఆ పార్టీకి పార్ల మెంటులో పదిమంది సభ్యులున్నారు. విపక్షం లేబర్ పార్టీ సరేసరి. తాము ఈ ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. కనుక తాజా ఒప్పందం ఆమోదముద్ర పొందడం అంత సులభమేమీ కాదు. అయితే జాన్సన్ మాటల్ని మన దేశంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం విశ్వసిస్తున్నాయి. కనుకనే బోరిస్ జాన్సన్ ఒప్పందం గురించి ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీశాయి. ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పలికితే దాదాపు ఏడాదికాలంగా ఉన్న అనిశ్చితి తొలగి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతుందని... ఇది టాటా మోటార్స్, టీసీఎస్ వంటి సంస్థలకు లబ్ధి చేకూరుస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. జాన్సన్ మొదలుకొని స్టాక్ మార్కెట్ల వరకూ ఎవరికెన్ని నమ్మకాలున్నా ఒప్పందం సజావుగా సాకారమవుతుందని చెప్పలేం. 2016లో తొలిసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్లు ఈయూ నుంచి దేశం తప్పుకోవాల్సిందేనని తీర్పునిస్తే...ఉత్తర ఐర్లాండ్ పౌరులు మాత్రం ఈయూలో కొనసాగాలని తేల్చారు. ఇది బ్రిటన్‌లో ప్రాణాంతక సమస్యగా మారింది. 1949లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న ఐర్లాండ్ దేశంతో ఉత్తర ఐర్లాండ్‌ను విలీనం చేయాలంటూ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ(ఐఆర్ఏ) ఆవిర్భవించింది. హింసాత్మక చర్యలతో బ్రిట న్ను హడలెత్తించింది. చివరకు రెండు ఐర్లాండ్ల మధ్యా సరిహద్దులేమీ ఉండబోవన్న హామీ ఇచ్చి 1998లో ఆ సంస్థతో బ్రిటన్ సంధి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే 2016 బ్రెగ్జిట్ రెఫరెండంలో ఉత్తర ఐర్లాండ్ వాసులు తాము ఈయూలో కొనసాగుతామని తేల్చిచెప్పారు. తాము ఈయూ నుంచి వైదొలగుతూ తమ ప్రాంతమైన ఉత్తర ఐర్లాండ్‌ను ఆ సంస్థ పరిధిలో ఎలా ఉంచాలో బ్రిటన్‌కు అర్ధం కావడం లేదు. ఈయూ నుంచి బయటకు వచ్చిన వెంటనే రెండు ఐర్లాండ్ల మధ్యా చెక్‌పోస్టులు నిర్మించాలి. సరుకు రవాణాపై సుంకాలు వసూలు చేయాలి. ఇదే జరిగితే ఉత్తర ఐర్లాండ్ జనం తిరగ బడతారు. సరిహద్దు రేఖలు గీస్తారా అంటూ ఆగ్రహిస్తారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఐఆర్ఏ మళ్లీ పుంజుకుని సమస్యలు సృష్టిస్తుందని, చివరకు దేశం నుంచి ఉత్తర ఐర్లాండ్ విడి పోతుందని బ్రిటన్ రాజకీయ నాయకత్వం భయపడుతోంది. దీన్నుంచి గట్టెక్కడం కోసమే తాము ఈయూ నుంచి విడిపోయినా సుంకాల విషయంలో మాత్రం ఆ సంస్థ పరిధిలోనే ఉంటామని థెరిస్సా మే ఒప్పందం నిర్దేశించింది. ఉత్తర ఐర్లాండ్‌కు ఇది సంతోషం కలిగించినా బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలవారు మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. ఒప్పందం ఓటమి పాలుకావడానికి అది ప్రధాన కారణం. దీనికి జాన్సన్ ఓ చిట్కా కనుక్కున్నారు. దాని ప్రకారం రెండు ఐర్లాండ్ల మధ్యా సరుకులపై ఎలాంటి తనిఖీలూ ఉండవు. చెక్పోస్టులుండవు. ఉత్తర ఐర్లాండ్ నుంచి బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సరుకులపై మాత్రం ఈయూ నిర్దేశించిన సుంకాలను బ్రిటన్ వసూలు చేయాల్సి ఉంటుంది. తన ఒప్పందం మొత్తం బ్రిటన్ను ఈయూ సుంకాల పరిధిలో లేకుండా చూసింది గనుక ఎవరికీ అభ్యంతరం ఉండబోదని జాన్సన్ నమ్ముతున్నారు. వాస్తవానికి బ్రిటన్ పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవులు. కానీ దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి శనివారం రోజున పార్లమెంటు సమావేశం కాబోతోంది. పార్టీకి దూరమైన కన్సర్వేటివ్‌లను ఆ ఓటింగ్‌లో జాన్సన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అలాగే లేబర్ పార్టీ నుంచి కొందరినైనా చీల్చగలగాలి. డీయూపీని సైతం దారికి తెచ్చుకోవాలి. ఇవన్నీ అసాధ్యమని అందరూ అంటున్నారు. కానీ జాన్సన్ మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఓటింగ్ పూర్తయి విజయం సాధిస్తే ఒప్పం దానికి అనుగుణంగా చట్టం రూపొందించాలి. అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఈ నెల 31లోగా ఆమోదం పొందాలి. కానీ అంత ఆదరాబాదరాగా ఈ వ్యవహారం ముగుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. బిల్లుపై వెల్లువెత్తే అభ్యంతరాలూ, వాటికి ప్రభుత్వం ఇచ్చే వివరణలూ చాలా ఉంటాయి. అందరినీ సంతృప్తిపరిస్తే సరేసరి...లేనట్టయితే సవరణలకు సిద్ధప డాలి. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడైనా ఆటంకం ఎదురైతే బ్రెగ్జిట్ గడువు పెంచుతారా అన్నది ప్రధాన ప్రశ్న. దానికి ఎవరూ జవాబివ్వడంలేదు. చివరికిదంతా జాన్సన్ మెడకు చుట్టుకుని ఆయన నిష్క్రమిస్తారో, ఇది మరో రెఫరెండానికి దారితీస్తుందో వేచి చూడాలి. -
బ్రెగ్జిట్ డీల్.. జోష్!
గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారం కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటామని, మన దేశంలో మదుపు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగిశాయి. స్వల్పంగానైనా, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 71.19కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 39,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 11,586 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ సూచీల్లో ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ‘రికవరీ’ ఆశలు...: ఉద్దీపన చర్యలు, పండుగల డిమాండ్, మంచి వర్షాలు కురియడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం... ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలను పెంచుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఫలితంగా నష్ట భయం భరించైనా సరే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశం పెరిగిందని, కొనుగోళ్లు జోరుగా సాగాయని వివరించారు. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15% లాభంతో రూ.47.4 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, సునీల్ ముంజాల్‌లు ఈ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు ఈ లాభాలకు కారణం. ► బ్రెగ్జిట్ డీల్‌పై అనిశ్చితి తొలగిపోవడంతో టాటా మోటార్స్ షేర్ జోరుగా పెరిగింది. టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ఇంగ్లాండ్‌లోనే ఉండటంతో తాజా బ్రెగ్జిట్ డీల్ ఈ కంపెనీకి ప్రయోజనకరమన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. టాటా మోటార్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. లాభాలు ఎందుకంటే.... ► బ్రెగ్జిట్ డీల్ బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారమైంది. దీంతో యూరోపియన్ యూనియన్‌తో ఉన్న 46 ఏళ్ల అనుబంధానికి బ్రిటన్ వీడ్కోలు పలకనున్నది. సూత్రప్రాయంగా కుదిరిన ఈ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ►సుంకాల పోరుకు స్వస్తి ! సుంకాల పోరుకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దీనికనుగుణంగా సంప్రదింపులు వేగవంతం చేయాలని అమెరికాను చైనా కోరడం సానుకూల ప్రభావం చూపించింది. ►మరిన్ని ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థలో జోష్‌ను పెంచడానికి మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. ► వాహన స్క్రాప్ పాలసీ ముసాయిదా భారత్‌లో వాహన స్క్రాప్ పరిశ్రమను చట్టబద్ధం చే యడంలో భాగంగా రవాణా మంత్రిత్వ శాఖ వాహ న స్క్రాప్ పాలసీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ►జోరుగా విదేశీ కొనుగోళ్లు ఈ నెల తొలి 2 వారాల్లో నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గత 4 ట్రేడింగ్ సెషన్లలో రూ.2,000 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. రూ.1.59 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.59 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.59 లక్షల కోట్లు పెరిగి రూ.147.90 లక్షల కోట్లకు చేరింది. -
బ్రెగ్జిట్‌కు కొత్త డీల్
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌కు జంకర్ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మద్దతిస్తున్న డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది. ఇదీ ఒప్పందం... ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు. తాజా ఒప్పందం ఇదీ... బ్రెగ్జిట్ తరవాత ఐర్లాండ్‌కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు. ► యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది. ► ఐర్లాండ్‌కు– ఉత్తర ఐర్లాండ్‌కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్‌లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి. ► బ్రిటన్ నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్‌కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్ మార్కెట్ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్ పాటించటం... సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్‌లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. -
అడుగడుగునా అడ్డంకుల్లో బ్రెగ్జిట్
యూరోపియన్ యూనియన్ నుంచి ఏ క్షణంలో బ్రిటన్ వైదొలగాలని నిర్ణయించుకుందో అప్పటినుంచి ఆ నిర్ణయానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాని దెబ్బకు ఒక ప్రధాని ఇప్పటికే పదవి నుంచి దిగిపోగా ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సమస్యను పరిష్కరించలేక బ్రిటన్ చరిత్రలోనే అత్యంత స్వల్పకాలంలో ప్రధాని పదవిలో ఉన్న బలహీనుడిగా చరిత్రకెక్కనున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జాన్సన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హౌస్ ఆఫ్ కామన్స్ ఈ మంగళవారమే అడ్డుకట్టవేసింది. ప్రతినిధుల సభలో చుక్కెదురు కావడంతో జాన్సన్ మెజారిటీ కోల్పోయినప్పటికీ అధికారంలో ఉంటున్న వ్యక్తిగా మిగిలిపోయారు. ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్‌ను పక్కనపెట్టడానికి పార్లమెంటు అనుమతి తీసుకుని, అక్టోబర్ 15లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరిపించాలని జాన్సన్ ప్రయత్నించారు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వ గెలుపునకు 133 ఓట్లు తక్కువయ్యాయి. బ్రెగ్జిట్ నుంచి తప్పుకోవడానికి అక్టోబర్ 31ని తుది గడువుగా నిర్దేశించారు. ఈలోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపకుండా చేయాలని లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనలిస్టులు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేశారు. జాన్సన్ మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల కలయికతో తాను బ్రిటన్ ప్రధాని కావాలని లేబర్ పార్టీ నేత జెరెమి కోర్బిన్ చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ అండగా నిలబడటం లేదు. అక్టోబర్ 31లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపడానికి ప్రతిపక్ష లేబర్ పార్టీతో పాటు స్కాటిష్ నేషనలిస్టులు, లిబరల్స్ వంటి ఇతర చిన్నా చితకా పార్టీలు కూడా తమ ఆమోదం తెలుపటం లేదు. అక్టోబర్ 31లోగా యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలిగేలా చేయాలన్న తన నిర్ణయం కూడా అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. పైగా, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి పెట్టిన అక్టోబర్ 31 గడువు ముగిశాక పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే బ్రెగ్జిట్‌పై తాను చేసిన ప్రతిజ్ఞ విషయంలో విఫలమయ్యాడనే కారణంతో బ్రిటన్ ఓటర్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. జాన్సన్ స్వచర్మ సంరక్షణకోసం రెండు ఎత్తులు వేయవచ్చు. అక్టోబర్ 31లోగా బ్రిటన్ ఈయూని వదిలి వెళ్లడానికి నేరుగా బ్రస్సెల్స్ తోనే కొత్తగా ఒప్పందానికి ప్రయత్నించవచ్చు. తనకున్న ఆకర్షణ శక్తితో దీన్ని సాధిస్తానని ఆయన చెబుతున్నప్పటికీ తనపై పెద్దగా నమ్మకాల్లేవు. బ్రిటన్ ప్రధానిపై ఈయూకి కూడా నమ్మ కం లేకుండా పోవడం గమనార్హం. ఇక రెండోది ఏమిటంటే, బ్రిటన్ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టి ఈయూతో ఎలాంటి ఒప్పం దమూ లేకుండానే బ్రెగ్జిట్ నుంచి బయటపడటం. ఇది శాసనోల్ఘంఘనే అవుతుంది. పైగా ఈయూనుంచి వైదొలిగేందుకు ఎలాంటి శాసనపరమైన అనుమతుల జోలికి తాను వెళ్లనని, ఈ విషయంలో ఆలస్యాన్ని తాను ఏమాత్రం కోరుకోవడం లేదని జాన్సన్ తేల్చి చెప్పారు కూడా. మూడో అవకాశం కూడా ఉంది. బ్రెగ్జిట్ నుంచి వైదొలగడాన్ని వాయిదా వేయాలని, గడువును మరింతగా విస్తరించాలని ఈయూను కోరడానికి బదులుగా జాన్సన్ తన ప్రధానపదవికి రాజీనామా చేయడం. ఇది వ్యక్తిగతంగా తన ప్రతిష్టను పెంచుతుందేమో కానీ రాజకీయ భవి ష్యత్తు ముగిసిపోతుంది. పైగా బ్రెగ్జిట్ గడువును పెంచాలంటున్న ప్రతిపక్షంతో కలిసి తనకు వ్యతి రేకంగా ఓటేసిన 21 మంది టోరీ ఎంపీలపై జాన్సన్ కఠిన చర్యతీసుకున్నారు. వీరిలో విన్స్టన్ చర్చిల్ మనవడు నికోలస్ సోమ్స్ కూడా ఉన్నారు. మరోవైపున నూరుమందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఈ బహిష్కరణ వేటును తీవ్రంగా అభిశంసిస్తూ ఉత్తరం రాశారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం బ్రిటన్ రాజకీయాలకు సంబంధించి గడ్డుదినంగా మారనుంది. అసాధారణ ఘటనల కారణంగా రాజ కీయ పరిస్థితి ఆకస్మిక మార్పులకు గురికావచ్చు. జాన్సన్ ఆశ మొత్తంగా ఇదేమరి. కానీ అలా జరగకపోతే, బ్రేకులు పనిచేయని కారు స్లోమోషన్లో గోడకు గుద్దుకున్న పరిస్థితిలో జాన్సన్ ఇరుక్కుపోవచ్చు కూడా. వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
గందరగోళంలో బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ అక్టోబర్ 31కల్లా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్తా పార్లమెంటును సస్పెండ్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్‌కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 31లోగా బ్రెగ్జిట్ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి? రహస్య పద్ధతితో సాధిస్తారా? మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్సన్ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్ డెమొక్రాట్స్ నేత అయిన జో స్విన్సన్ మాట్లాడుతూ తామూ బోరిస్ జాన్సన్ మాదిరిగా ఒక సీక్రెట్ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది. తుది అస్త్రంగా అవిశ్వాసం... మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్ జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్ జాన్సన్ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్‌ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్ 31 తరువాత బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఒప్పందంతో బయటకు... థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 –18లలో జరిగే యూనియన్ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్ ఏదో ఒక రకంగా యూనియన్ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్‌కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం లేకుండానే వీడుతుందా..? మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్ 31 తరువాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో భాగం కాదు కాబట్టి. ఇదే జరిగితే జాన్సన్ బ్రెగ్జిట్ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్‌కు కష్టం కావచ్చు. ముందస్తు ఎన్నికలు..? పార్లమెంటు సస్పెన్షన్ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్ జాన్సన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్‌కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్ గెలిస్తే.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్ ఆఫ్ కామన్స్‌లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్‌కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్‌పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? పార్లమెంటును సస్పెండ్ చేయడంపై ఇప్పటికే బ్రిటన్ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్‌తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్ ఇప్పుడు కూడా బోరిస్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్ బంతి బ్రిటన్ కోర్టులో పడిపోతుంది!