బ్రెగ్జిట్ కూల్.. మార్కెట్ జూమ్! | Europe lifts Sensex 236pts to 27002 ahead of Brexit vote outcome | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్ కూల్.. మార్కెట్ జూమ్!

Published Fri, Jun 24 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

బ్రెగ్జిట్ కూల్.. మార్కెట్ జూమ్!

బ్రెగ్జిట్ కూల్.. మార్కెట్ జూమ్!

ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ఛాన్స్ తక్కువంటూ సర్వేలు
ర్యాలీ జరిపిన ఈక్విటీలు
సెన్సెక్స్ తిరిగి 27,000 పైకి
నిఫ్టీ 67 పాయింట్లు అప్
పెరిగిన రూపాయి...తగ్గిన బంగారం

ముంబై: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే అవకాశాలు తక్కువంటూ రిఫరెండంకు ముందస్తు సర్వేలు వెల్లడించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గురువారం కదంతొక్కాయి. ఇదేబాటలో భారత్ సూచీలు ఎగిసాయి. మళ్లీ రిస్క్ ఆస్తులవైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో బంగారం తగ్గింది. వర్థమాన కరెన్సీలతో పాటు రూపాయి సైతం బలపడింది. బ్రిటన్ రిఫరెండం ఫలితం భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వెల్లడవుతాయి.  51 శాతం మంది ప్రజలు ఈయూలో కొనసాగాలని కోరుకుంటుండగా, 49 శాతం మంది వైదొలిగేందుకు మొగ్గుచూపుతున్నట్లు డెయిలీ టెలిగ్రాఫ్, టైమ్స్ నిర్వహించిన తుది సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ తిరిగి 27,000 శిఖరాన్ని అధిరోహించింది. 237 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్ 27,002 వద్ద ముగిసింది. ఈ ముగింపు దాదాపు నెలరోజుల గరిష్టస్థాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగిసి 8,270 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

 యూరప్ మార్కెట్ల ప్రారంభంతో...
ట్రేడింగ్ ప్రారంభంలో ఆసియా ట్రెండ్‌ను అనుసరిస్తూ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన భారత్ మార్కెట్ మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పరుగులు తీసాయి. యూరప్ మార్కెట్లు జోరుగా మొదలుకావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లలో కూడా బ్రెగ్జిట్ భయాలు తొలగిపోయాయని, దాంతో ఎంపికచేసిన షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. యూరప్ పటిష్టంగా ప్రారంభంకావడం మన మార్కెట్‌లో సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని బీఎన్‌పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. యూరప్‌లోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 1,5 శాతం మేర ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు సైతం 0.8 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి.

 బ్రిటన్‌తో లింకున్న షేర్ల కొనుగోలు...
బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలున్న భారత్ కంపెనీల షేర్లలో తాజాగా కొనుగోళ్లు జరిగాయి. టాటా మోటార్స్ 3.2 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి రూ. 488 వద్ద ముగిసింది. అలాగే భారత్ ఫోర్జ్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం వరకూ ఎగిసాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతంపైగా ర్యాలీ చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, లుపిన్, మహీంద్రా, హెచ్‌యూఎల్‌లు 1-2 శాతం మధ్య పెరిగాయి. ఆయా రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బ్యాంకెక్స్ 1.61 శాతం ఎగిసింది. ఈ సూచీలో భాగస్వామ్యమున్న హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్, యస్ బ్యాంక్‌లు రికార్డు గరిష్టస్థాయిలో ముగి యడం విశేషం.

పుత్తడి ర్యాలీకి బ్రేక్...
బ్రిటన్ రిఫరెండం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తాత్కాలికంగా రిస్క్ ఆస్తులుగా పరిగణించే ఈక్విటీవైపు దృష్టిసారించి, బంగారాన్ని విక్రయించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహం మందకొడిగా ట్రేడయ్యింది. బ్రిటన్ వైదొలిగే అవకాశాలు తక్కువంటూ గత ఆదివారం నుంచే సర్వేలు వెలువడుతుండటంతో ప్రపంచ మార్కెట్లో ఈ మూడురోజుల్లో ఔన్సు బంగారం ధర 35 డాలర్లకుపైగా క్షీణించింది. బ్రెగ్జిట్ జరగవచ్చన్న అంచనాలతో గతవారం పుత్తడి ధర 1300 డాలర్ల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. గురువారం కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ మార్కెట్లో ఇది 1265 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 130 తగ్గి రూ. 29,680 వద్ద ముగిసింది. ఇటీవల ఈ ధర రూ. 31,000 స్థాయిని దాటిన సంగతి తెలిసిందే.

రూపాయికి బలం...
అటు అమెరికా డాలరు ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడటంతో స్థానికంగా రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 24 పైసలు పెరిగి 67.24 స్థాయికి బలపడింది. బ్రెగ్జిట్ జరగకపోతే తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారత్‌లోకి కొనసాగుతుందన్న అంచనాలతో రూపాయి పెరిగిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు.

ఫలితం తర్వాత...?
ఈయూలో కొనసాగేందుకే బ్రిటిషర్లు మొగ్గుచూపుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ, ఉండాలా...వద్దా అనే అభిప్రాయాల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా వుంది. ఫలితం ఎటువైపైనా రావొచ్చు. బ్రిటన్ ఎగ్జిట్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చన్న అంచనాల్ని దాదాపు విశ్లేషకులందరూ వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ 5-8 శాతం మధ్య పతనం కావొచ్చన్నది అంచనా.  ఇక కరెన్సీల్లో బ్రిటన్ పౌండ్, యూరోలతో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ 5 శాతం వరకూ క్షీణించే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం తిరిగి 1320 డాలర్ల స్థాయిని అందుకోవొచ్చని, కొద్దిరోజుల్లో 1400 డాలర్లకు సైతం పెరగవచ్చని నిపుణులు చెపుతున్నారు. భారత్‌లో పసిడి 5 శాతాన్ని మించి పెరగవచ్చని, 10 గ్రాముల ధర రూ. 32,000 మార్క్‌ను చేరే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు. ఇక  డాలరు, బాగా పెరగవచ్చని, దీంతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ గరిష్టస్థాయి 68.7కి తగ్గవచ్చన్నది అంచనా.

 అంతా బావుంటే..: బ్రిటన్ ఈయూలోనే వుండాలని నిర్ణయించుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ల గమనంపై విశ్లేషకులు భిన్నమైన అంచనాల్ని విన్పిస్తున్నారు. తాజా సర్వేలతో అమెరికా, భారత్‌లు వారం రోజుల్లో 2%, యూరప్ 5% పెరిగాయని, ఇప్పటికే పాజిటివ్ వార్తల్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులు చెపుతున్నారు. అయినా 2-5% మధ్య మరికొంత ర్యాలీ జరిగే ఛాన్స్ వుందని కొంతమంది మార్కెట్ నిపుణులు అంటుండగా,  రిఫరెండం సంగతి ముగిస్తే తిరిగి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ తెరపైకి రావొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. దీంతో మార్కెట్ ర్యాలీకి బ్రేక్ పడుతుందని వారంటున్నారు. బంగారం ధర తిరిగి 1200 డాలర్ల స్థాయికి తగ్గవచ్చని, రూపాయి 66.5 స్థాయికి బలపడవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement