నాలుగో రోజూ మార్కెట్ కళకళ
♦ తగ్గిన బ్రెగ్జిట్ భయాలు
♦ ‘వేతన సిఫారసుల’ జోరు
♦ ఈ ఏడాది గరిష్ట స్థాయికి నిఫ్టీ
♦ 84 పాయింట్ల లాభంతో 8,288 వద్ద ముగింపు
♦ 259 పాయింట్లు లాభపడి 27,000కు సెన్సెక్స్
బ్రెగ్జిట్ భయాలను భారత స్టాక్ మార్కెట్ అధిగమించింది. సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలకు దేశీయ సానుకూలతలు తోడవడంతో గురువారం స్టాక్ సూచీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 వేల పాయింట్లను, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,300 పాయింట్లను తాకాయి. నిఫ్టీ ఈ స్థాయిని తాకడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా గత నాలుగు రోజులగా స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతోంది.
గురువారం ట్రేడింగ్ చివరలో జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల షార్ట్ పొజిషన్ల కవరింగ్, తక్కువ ధరల్లో ఉన్న షేర్ల కొనుగోళ్ల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు (0.97 శాతం) లాభపడి 27,000 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు (1.02 శాతం) లాభపడి 8,288 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీకి ఇది ఈ ఏడాది గరిష్ట స్థాయి, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, టెలికం, టాటా గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషనల్లో సెన్సెక్స్ 602 పాయింట్లు లాభపడింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన క్వార్టర్ ఇదే.
వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ...!
వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళీకరించడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడం, కొత్త గనుల అన్వేషణ విధానానికి ఆమోదం, మాల్స్, సినిమాహాళ్లు 24 గంటలూ తెరిచి ఉంచేలా చట్టాన్ని సవరించడం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును పెంచాయని నిపుణులు పేర్కొన్నారు.ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి.