వేతనాల బూస్ట్.. 216 పాయింట్ల ర్యాలీ
♦ 26,740 వద్ద సెన్సెక్స్ ముగింపు
♦ నిఫ్టీ 76 పాయింట్లు అప్
♦ జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై అంచనాలు
♦ ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు
♦ బ్రెగ్జిట్ భయాలు వెనక్కి
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యల ఫలితంగా బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు ర్యాలీ జరిపి 26,740 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర కేబినెట్ 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించడం ఇన్వెస్టర్లకు భారీ బూస్ట్‌నిచ్చింది. వేతనాల పెరుగుదల, బకాయిల చెల్లింపులతో దేశంలో వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు తాత్కాలికంగా బ్రెగ్జిట్ భయాలను పక్కనపెట్టారు.
అలాగే మాల్స్, సినిమా థియేటర్లు 24 గంటలూ తెరిచివుంచేందుకు తగిన చట్ట సవరణను, ఖనిజ తవ్వక విధానాన్ని కేబినెట్ ఆమోదించడం మార్కెట్‌కు మరింత ఊపునిచ్చిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపర్చిందని వారు వివరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్ల పెరుగుదలతో 8,200 శిఖరంపై 8,204 వద్ద ముగిసింది. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ ఆమోదం పొందవచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురికొల్పాయి.
ఆటో షేర్ల జోరు: వేతన సిఫార్సుల అమలుతో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాల ఫలితంగా ఆటోమొబైల్ షేర్లు తాజా ర్యాలీకి నేతృత్వం వహించాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా హీరోమోటో కార్ప్ 3.95%పెరిగింది.
రిటైల్ షేర్ల హవా: మాల్స్, సినిమాహాళ్లు 24 గంటలూ తెరిచివుంచేందుకు అవసరమైన బిల్లును కేబినెట్ ఆమోదించడంతో రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందిన షేర్లు పెరిగాయి. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను నిర్వహించే ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్స్, స్టోర్‌వన్ రిటైల్ షేర్లు 10 శాతం ర్యాలీ జరిపాయి. మల్టిప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్వహణలో వున్న ఐనాక్స్ లీజర్ 7 శాతం, పీవీఆర్ 3 శాతం చొప్పున పెరిగాయి.