వెలుగులో ఎఫ్ఎంసీజీ షేర్లు
♦ బ్రెగ్జిట్ పతనం నుంచి కోలుకుంటున్న మార్కెట్
♦ సెన్సెక్స్ 122 పాయింట్లు అప్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి బ్రిటన్ నిర్ణయించిన ప్రభావంతో గత శుక్రవారం జరిగిన పతనం నుంచి మార్కెట్ నెమ్మదిగా కోలుకొంటోంది. బ్రెగ్జిట్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ ఒక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలతో మంగళవారం ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. ఇదేక్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 26,525 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల పెరుగుదలతో 8,128 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితంరోజు సైతం స్వల్పలాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎఫ్‌ఎంసీజీ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. రుతుపవనాలు దేశంలో వేగంగా వ్యాపిస్తున్నాయన్న వార్తలతో హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) 3.25 శాతం ఎగిసింది. మరో ఎఫ్‌ఎంసీజీ షేరు ఐటీసీ 2.6 శాతం పెరుగుదలతో రెండేళ్ల గరిష్టస్థాయి రూ. 368 వద్ద క్లోజయ్యింది. వివిధ రంగాల సూచీల్లో కూడా అధికంగా ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.75 శాతం పెరిగింది. ఇక సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా లుపిన్ 4.4 శాతం పెరిగింది.
యూరప్ మార్కెట్ల ర్యాలీ
ఆసియా ప్రధాన మార్కెట్లలో ఒక్క హాంకాంగ్ తప్ప, మిగిలినవి స్వల్ప పెరుగుదలతో ముగిసాయి. సంక్షోభానికి కేంద్ర బిందువైన యూరప్ సూచీలు 1.5-3 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ సూచీ 2.5 శాతం ఎగిసింది. జర్మనీ డాక్స్ 1.7 శాతం ఫ్రాన్స్ కాక్ 2.4 శాతం చొప్పున ఎగిసాయి. అమెరికా సూచీలు కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి.