లాభాల స్వీకరణ.. ర్యాలీకి బ్రేక్
♦ 54 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ బ్రెగ్జిట్‌కు ముందు జాగ్రత్త
♦ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ముంబై: రెండు రోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. బ్రిటన్ రిఫరెండం మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 26,813 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ భయాలు తగ్గడం, కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళీకరించడం వంటి అంశాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 342 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఇక తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల క్షీణతతో 8,220 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
డాలరుతో రూపాయి మారకపు విలువ మరో 20 పైసలు తగ్గడం కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్పారు. బ్రిటన్ రిఫరెండం దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ను తగ్గించుకుంటున్నారని, దాంతో మార్కెట్ బలహీనంగా ముగిసిందని బీఎన్‌పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. ఇతర ప్రపంచ మార్కెట్లలో కూడా ట్రేడింగ్ మందకొడిగా సాగింది.
సెన్సెక్స్-30లో 21 షేర్లు డౌన్...
సెన్సెక్స్-30 షేర్లలో 21 షేర్లు తగ్గుదలతో ముగిసాయి. ఆదాని పోర్ట్స్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ షేర్లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, సిప్లా, లుపిన్, గెయిల్‌లు 0.5-1 శాతం మధ్య తగ్గాయి. పెరిగిన షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా 1.68 శాతం ఓఎన్‌జీసీ ఎగిసింది. మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీలు అరశాతం వరకూ పెరిగాయి.