మార్కెట్‌ మూడోరోజూ ముందుకే..! | Sensex soars 529 points as RIL and HDFC twins shine | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ మూడోరోజూ ముందుకే..!

Published Fri, Dec 25 2020 12:45 AM | Last Updated on Fri, Dec 25 2020 12:45 AM

Sensex soars 529 points as RIL and HDFC twins shine - Sakshi

ముంబై: క్రిస్మస్‌కు ముందురోజు స్టాక్‌ మార్కెట్‌కు భారీగా లాభాలొచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ షేర్లు రాణించడంతో మార్కెట్‌ మూడోరోజూ ముందుకే కదిలింది. బ్రెగ్జిట్‌ ఒప్పందం సఫలీకృతమవచ్చనే  ఆశలతో అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 46,973 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 13,749 వద్ద నిలిచింది. మూడురోజుల వరుస ర్యాలీతో సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో కోల్పోయిన భారీ నష్టాలన్నీ రికవరీ అయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ఈ వారం ఆరంభం నుంచి పరుగులు పెట్టిన ఐటీ షేర్ల జోరుకు బ్రేక్‌ పడింది. రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. అలాగే మీడియా, రియల్టీ రంగాల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ఈ వారంలో జరిగిన నాలుగురోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్లను నష్టపోయింది.  

సెంటిమెంట్‌ బలంగానే...  
డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు తేది దగ్గర పడుతున్న తరుణంలో సూచీలు స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, అయితే ఓవరాల్‌గా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలంగానే ఉందని స్టాక్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఐపీఓకు అనుపమ్‌ రసాయన్‌
స్పెషాలిటీ కెమికల్‌ రంగంలో సేవలు అందించే అనుపమ్‌ రసాయన్‌ ఐపీఓకు సిద్ధమైంది. ఐష్యూ ద్వారా కంపెనీ రూ.760 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఇందు కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. సమీకరించిన నిధుల్లో అధిక భాగం అప్పులను తీర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది.  ఐపీఓ భాగంగా కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా షేర్లను కేటాయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement