ముంబై: అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా లాభపడటంతో సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 51,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 15,173 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు ఆల్‌టైం హై కావడం విశేషం. కన్జూమర్, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఆటో, ఆర్థిక, మీడియా, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 435 పాయింట్ల పరిధిలో 51,157 – 51,592 శ్రేణిలో కదలాడగా.., నిఫ్టీ 123 పాయింట్ల రేంజ్‌లో 15,065 –15,188 స్థాయిల మధ్య ట్రేడైంది. ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప జేసే డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి రిటైల్ ధరల(సీపీఐ) ఆర్థిక గణాంకాలు నేడు (శుక్రవారం) విడుదల అవుతాయి. ఇన్వెస్టర్లు ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నారు. మార్కెట్లో మూమెంటమ్ ఇలాగే కొనసాగితే నిఫ్టీ తనకు కీలక నిరోధంగా ఉన్న 15,250 స్థాయిని ఛేదించవచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాలుగు శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ ...
ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించడంతో గత కొన్ని రోజులుగా నష్టాన్ని చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం రాణించింది. ఈ షేరు బీఎస్‌ఈలో రూ.1,980 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 4.55 శాతం ఎగిసి రూ.2064 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4.13 శాతం లాభంతో రూ.2056 వద్ద స్థిరపడింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం ఢిల్లీ డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రపంచ మార్కెట్లకు పావెల్ వ్యాఖ్యల జోష్...
అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, కొత్త ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయికి చేరుకునే వరకు అవసరమైతే భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు. పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, జపాన్, సౌత్ కొరియా మార్కెట్లకు గురువారం సెలవు రోజు.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
1. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించడంతో హిందా ల్కో షేరు ఆరు శాతం లాభపడింది
2. రూట్ మొబైల్ షేరు ఇంట్రాడేలో 20 శాతం ఎగసి రూ.1,527 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది.
3. డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు మెప్పించినా ఎంఆర్‌ఎఫ్ షేరు ఏడు శాతం పతనమై రూ.90,084 వద్ద స్థిరపడింది.
4. ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఐటీసీ షేరు అరశాతం క్షీణించి రూ.227 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment