
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభంతో ముగిసింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి క్షీణించడం వంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు పతనం కూడా సూచీల లాభాల్ని పరిమితం చేసింది. ఫలితంగా సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 44,633 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మెటల్, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
మళ్లీ కొత్త శిఖరాలపై సూచీలు...
మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ.., సూచీలు ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టస్థాయిలను అందుకోవడంతో పాటు సరికొత్త శిఖరాలపై ముగిశాయి. వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ప్రవాహం ఇందుకు కారణం. ఈ క్రమంలో సెన్సెక్స్ 335 పాయింట్లు ఎగిసి 44,953 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు లాభపడి 13,217 వద్ద జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెనెక్స్ 44,633 వద్ద, నిఫ్టీ 13,134 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టస్థాయిలు కావడం విశేషం.