
ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్‌బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్నవాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనివ్వనున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా ఐదో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగియగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
అందరి కళ్లూ పావెల్ ప్రసంగంపైననే..
జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసే గురువారం రాత్రి ప్రసంగంపైననే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు.
► ఈ ఏడాది డిసెంబర్ వరకూ స్టాంప్ డ్యూటీని 3 శాతం మేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రియల్టీ షేర్లు దూసుకుపోయాయి. డీఎల్‌ఎఫ్ 10%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రొపర్టీస్, ఓబెరాయ్ రియల్టీ, సన్‌టెక్ రియల్టీ తదితర షేర్లు 7% లాభపడ్డాయి.
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment