derivatives contracts
-
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ వేళల పొడిగింపు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి. రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది.. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. -
మిడ్క్యాప్స్లోనూ డెరివేటివ్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ స్టాక్స్‌లోనూ డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నెల 24 నుంచీ నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో కాంట్రాక్టులను అనుమతించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందినట్లు పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ నుంచి ఎంపిక చేసిన 25 స్టాక్స్తోకూడిన పోర్ట్‌ఫోలియోను నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ట్రాక్ చేస్తుందని వివరించింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన స్టాక్స్‌లోనూ విడిగా డెరివేటివ్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. ఒక్కో స్టాక్‌కు ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిలో వెయిటేజీ ఉంటుందని వివరించింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో భాగంగా నెలవారీ గడువు కాంట్రాక్టును మినహాయించి వారం రోజుల్లో గడువు ముగిసే(వీక్లీ) కాంట్రాక్టులతోపాటు, మరో మూడు నెలవారీ సీరియల్ కాంట్రాక్టులకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. లార్జ్ క్యాప్స్‌లో..: ప్రస్తుతం ఇండెక్స్ డెరివేటివ్స్ ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లేదా రంగాల ఆధారంగా ఎంపిక చేసిన కౌంటర్లలో అందుబాటులో ఉన్నట్లు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీ విక్రమ్ లిమాయే ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మిడ్‌క్యాప్స్ 17 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకునే బాటలో నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో డెరివేటివ్స్ అదనపు హెడ్జింగ్ టూల్‌గా వినియోగపడతాయని వివరించారు. ఇటీవల మార్కెట్ ర్యాలీలో విభిన్నతరహా ఇన్వెస్టర్ల నుంచి మిడ్‌క్యాప్‌లో లావాదేవీలు పెరగడం, లిక్విడిటీ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ఏడాదిలో 39% వృద్ధి చూపడం గమనార్హం! -
ఐదో రోజూ అదే జోరు
ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్నవాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనివ్వనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా ఐదో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగియగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అందరి కళ్లూ పావెల్ ప్రసంగంపైననే.. జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసే గురువారం రాత్రి ప్రసంగంపైననే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ► ఈ ఏడాది డిసెంబర్ వరకూ స్టాంప్ డ్యూటీని 3 శాతం మేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రియల్టీ షేర్లు దూసుకుపోయాయి. డీఎల్ఎఫ్ 10%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రొపర్టీస్, ఓబెరాయ్ రియల్టీ, సన్‌టెక్ రియల్టీ తదితర షేర్లు 7% లాభపడ్డాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
డెరివేటివ్స్ ముగింపు కీలకం
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా పరిస్థితులు, అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కరోనా వైరస్ సంబంధ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. మిగతా వాటితో పాటు ఆగస్టు నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు కూడా ఈ వారం ముగియనుండటంతో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొనే అవకాశం ఉంది‘ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ విభాగం) అజిత్ మిశ్రా తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ కేసులతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ, అమెరికా – చైనా మధ్య వివాదంపైనా ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చి విభాగం హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు కదలికలు, రూపాయి–డాలర్ మారకం విలువలో మార్పులు, విదేశీ పెట్టుబడుల రాక తదితర అంశాలూ కీలకంగా ఉండగలవని వివరించారు. 21 ఆగస్టుతో ముగిసిన వారంలో కీలక సూచీలైన సెన్సెక్స్ 557 పాయింట్లు (1.47 శాతం), నిఫ్టీ 193 పాయింట్లు (1.72 శాతం) పెరిగాయి. దేశీయంగా కరోనా వైరస్లు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంట్ భారత మార్కెట్‌కు దన్నుగా నిలవడం ఇందుకు తోడ్పడింది. సమీప కాలంలో ఎగువ దిశగానే.. సమీప భవిష్యత్‌లో మార్కెట్ ప్రయాణం ఎగువ దిశగానే సాగగలదని ఖేమ్కా పేర్కొన్నారు. అయితే, భారీ వేల్యుయేషన్ల కారణంగా మధ్య మధ్యలో లాభాల స్వీకరణకు ఆస్కారం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు మరింతగా అనుసంధానమైన విధంగా దేశీ మార్కెట్లు స్పందిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చి విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘ఇక ఇక్కణ్నుంచి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని భావించడానికి దోహదపడే సంకేతాలు, కరోనా వైరస్‌కు టీకా లేదా సరైన చికిత్స సంబంధ పరిణామాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి‘ అని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శిబానీ సర్కార్ కురియన్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా కేసులు 20 లక్షలకు చేరిన 16 రోజుల వ్యవధిలోనే ఏకంగా 30 లక్షల పైచిలుకు పెరిగాయి. ఈ అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయన్నది విశ్లేషణ. -
మళ్లీ 25వేల కిందకు..
లాభాల స్వీకరణతో క్షీణత... ♦ 371 పాయింట్ల నష్టంతో 24,966కు సెన్సెక్స్ ♦ 101 పాయింట్లు నష్టపోయి 7,615కు నిఫ్టీ నాలుగురోజుల సెలవుల అనంతరం సోమవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ముగిసింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ఒడిదుడుకులంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని నిపుణులు పేర్కొన్నారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 25 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. వచ్చే వారం ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 371పాయింట్లు (1.46 శాతం)నష్టపోయి 24,966 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్కో రోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఐదు వారాల్లో ఇదే మొదటిసారి. లోహ, ఫార్మా, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 660 పాయింట్లు లాభపడింది. లాభాల్లో ప్రారంభమైనా... అసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో స్టాక్ సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నిఫ్టీ 9 శాతానికి పైగా లాభపడింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండడం, దీనికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు తోడవడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈస్టర్ సెలవుల కారణంగా యూరోప్ మార్కెట్లు పనిచేయకపోవడం, రూపాయి క్షీణత, ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. దేశీయ కంపెనీలకు జోష్‌నిచ్చే ప్రభుత్వ రక్షణ రంగ సమీకరణ విధానం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రేట్ల కోత అంచనాలున్నప్పటికీ స్టాక్ మార్కెట్ నష్టాలపాలవడం ఆశ్చర్యకరమని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. 1.24 లక్షల కోట్ల సంపద నష్టం సెన్సెక్స్ 371 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.24 కోట్లు ఆవిరై రూ.93,04,375 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ షేర్లలో ఎస్బీఐ, పీఎన్‌బీలు భారీగా నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లను విక్రయించిన అశోక్ లేలాండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లను బల్క్‌డీల్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ విక్రయించింది. ఇవి రెండూ హిందూజా గ్రూప్ కంపెనీలే. 0.55 శాతం వాటాకు సమానమైన 32,63,923 షేర్లను సగటున రూ.915.96 ధరకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అశోక్ లేలాండ్ విక్రయించింది. ఈ బల్క్‌డీల్ విలువ రూ.299 కోట్లు. -
ఒడిదుడుకుల వారం..!
రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి దృష్టి... * విశ్లేషకుల అభిప్రాయం... * ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల * ముగింపు ఈ వారంలోనే... న్యూఢిల్లీ: డెరివేటివ్‌ల కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. రెండు కీలకమైన అంశాలు-రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి కళ్లు ఉంటాయని, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, ముడి చమురు ధరల గమనం, ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్లో ప్రకటించే సంస్కరణలు, రూపాయి కదలికలు.. ఇవన్నీ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. ఎలాంటి ప్రధాన ప్రపంచ సంఘటనలు లేనందున ఆర్థిక సర్వే, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ అంశాలు తగిన ప్రభావం చూపిస్తాయనేది విశ్లేషకుల మాట. ఫిబ్రవరి డెరివేటివ్‌ల కాంట్రాక్టులు ఈ నెల 25న(గురువారం)ముగుస్తాయని, ఈ నేపథ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లోనే చలిస్తాయని, సానుకూలంగానే స్టాక్ మార్కెట్ ఉండొచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం ఇత్యాది అంశాలకనుగుణంగానే స్టాక్ మార్కెట్ గమనం ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు. బడ్జెట్ కీలకం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెలలోనే పార్లమెంట్‌కు సమర్పించే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లపైననే స్టాక్ మార్కెట్ భవిష్యత్ గమనం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఈ మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ కారణంగా స్టీల్, సిమెంట్, బొగ్గు, ఐరన్ ఓర్, ఎరువుల కంపెనీలకు సంబంధించిన షేర్లలో కదలికలు ఉంటాయని సింఘానియా వివరించారు. మరోవైపు ఈ నెల 26(శుక్రవారం)గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాల సమీక్ష-ఆర్థిక సర్వే ఉంటుంది. ప్రభుత్వ విధానాల అమలు తీరును ఈ సర్వే ప్రతిబింబిస్తుంది. సాధారణ బడ్జెట్ ఈ నెల 29న ప్రవేశపెడతారు. బడ్జెట్ అంచనాల కారణంగా రంగాల వారీగా కంపెనీల షేర్లు ప్రభావితం కావచ్చని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. గత వారంలో సెన్సెక్స్ 723 పాయింట్లు లాభపడి 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా ఈ నెల మొదటి మూడు వారాల్లో సెన్సెక్స్ 1,162 పాయింట్లు(4.67%) నష్టపోయింది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, ఈ నెలకు సంబంధించి యూరోజోన్ మార్కెట్ ఎంఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు నేడు(సోమవారం) వెలువడుతున్నాయి. అమెరికాలో క్యూ4 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 26న) వెలువడుతాయి. రూ. 4,600 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,600 కోట్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళన, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు దీనికి ప్రధాన కారణాలు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.13,414 కోట్లు ఉపసంహరించుకున్నట్లైంది. డిపాజిటరీ సంస్థల గణాంకాల ప్రకారం, ఈనెల 1-18 తేదీల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,503 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.96 కోట్లు మొత్తం రూ.4,599 కోట్లు నికరంగా తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కాగా జనవరిలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.13,381 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో రూ.3,274 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారు. ముడి చమురు ధరల పతనం కారణంగా పశ్చిమాసియా దేశాల సావరిన్ వెల్త్ ఫండ్స్.. వర్థమాన దేశాల మార్కెట్లో చేసిన భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నాయని సాస్ ఆన్లైన్డాట్కామ్ సీఓఓ సిద్ధాంత్ జైన్ చెప్పారు. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు ఈ స్థాయిలో తరలిపోతున్నాయన్నారు. రూపాయి పతనం, చైనా ఆర్థిక మందగమనంపై ఆందోళన విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయని వివరించారు. -
3 రోజుల లాభాలకు బ్రేక్
♦ జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ♦ దశ, దిశ లేకుండా సాగిన ట్రేడింగ్ ♦ 23 పాయింట్ల నష్టంతో 24,470కు సెన్సెక్స్... జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. దశ, దిశ లేకుండా ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 23 పాయింట్ల నష్టంతో 24,470 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 7,425 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంజినీరింగ్, బ్యాంక్, వాహన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చివరి గంటలో బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాలు జోరుగా జరిగాయి. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి అనిశ్చితిగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది రేట్ల పెంపు ఉండొచ్చని సంకేతాలివ్వడం... ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రోల్ ఓవర్లు 67 శాతంగా ఉన్నాయి. గత మూడు నెలల రోల్ ఓవర్ల సగటు కూడా ఈ స్థాయిలోనే ఉంది. -
చివర్లో అమ్మకాలు
⇒ కొనసాగిన ముందు జాగ్రత్త ⇒ ప్రారంభ లాభాలు ఆవిరి ⇒ స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు ⇒ మార్కెట్ అప్డేట్ ముంబై: ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభ లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లుగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులంటున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 29,115 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 29,270 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరి గంటన్నరలో అమ్మకాల ఒత్తిడికి లాభాలన్నీ హరించుకుపోయాయి. చివరకు 3 పాయింట్ల లాభంతో 28,968 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 8,767 పాయింట్ల వద్ద ముగిసింది. మిశ్రమంగా రైల్ షేర్లు : మహీంద్రా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఏబీజీ షిప్‌యార్డ్ షేర్ 15 శాతం వరకూ పెరిగిందిజ గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వే షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఐదు ఐపీఓలకు సెబీ ఆమోదం: కాగా ఐదు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం లభించింది. యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్ఎల్ లాజిస్టిక్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఏసీబీ (ఇండియా), శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్లు వీటిలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఐపీఓకు సంబంధించిన పత్రాలను గత ఏడాది సెబీకి సమర్పించాయి. గతంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడంతో పలు కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. మార్చి 10న యాడ్‌ల్యాబ్స్ ఐపీఓ న్యూఢిల్లీ: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) వచ్చే నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ సంస్థ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజిక పేరుతో ఒక ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను నిర్విహ స్తోంది. ఈ పార్క్‌ను ప్రముఖ చిత్ర నిర్మాత, దర్శకుడు మన్మోహన్ శెట్టి నిర్మించారు. -
మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయ్
* ఒడిదుడుకులకు కారణాలు * 26న రైల్వే బడ్జెట్, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు * 27న ఆర్థిక సర్వే * 28న సాధారణ బడ్జెట్ న్యూఢిల్లీ: ఈ వారం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వివిధ సంఘటనలున్నందున స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రైల్వే, కేంద్ర సాధారణ బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడతాయని వారు హెచ్చరించారు. అలాగే ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, సూచీల కదలికలు తీవ్రంగా వుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే గురు, శుక్ర, శనివారాల్లో (26, 27, 28 తేదీల్లో) వరుసగా రైల్వే, ఆర్థిక సర్వే, సాధారణ బడ్జెట్లను ఆయా మంత్రులు లోక్‌సభలో ప్రవేశపెడతారు. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవురోజైనప్పటికీ, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడయ్యే ఈ శనివారం మాత్రం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ 9-3.30 గంటల మధ్య యథావిధిగా కొనసాగుతుంది. దాంతో ఈ వారం మార్కెట్ వరుసగా ఆరురోజులపాటు పనిచేస్తుంది. సంబంధిత రంగాలపై ఆసక్తి... ఈ వారం ప్రారంభం నుంచీ బడ్జెట్ ముందస్తు అంచనాలకు అనుగుణంగా కొన్ని రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారని, ఆయా షేర్లలో ట్రేడింగ్ కార్యకలాపాలు ముమ్మరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించబోయే సంస్కరణల పట్ల అంచనాలు, వాటి ప్రతిపాదనల ఆధారంగా సమీప భవిష్యత్తులో సూచీల కదలికలుంటాయని వారు తెలిపారు. వచ్చే కొద్దిరోజుల్లో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, అయితే వారం మొత్తంమీద ప్రధాన అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. ప్రభావం తగ్గుతోంది... చాలావరకూ సంస్కరణలు బడ్జెట్‌తో సంబంధం లేకుండానే జరుగుతున్నందున కొన్నేళ్లుగా మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం తగ్గుతోందని డీఎస్పీ మెరిలించ్ రీసెర్చ్ అనలిస్ట్ జ్యోతివర్థన్ జైపూరియా చెప్పారు. బడ్జెట్లలో పన్నులు, సుంకాల మార్పులు కూడా స్వల్పంగానే వుంటున్నాయని అన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 16,500 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ క్యాపిటల్ మార్కెట్లో రూ. 16,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ వారు చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 50,205 కోట్లకు చేరింది. జనవరి నెలలో రూ. 33,688 కోట్ల నిధులు మార్కెట్లోకి ప్రవహించాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ. 6,850 కోట్లు, రుణపత్రాల్లో రూ. 9,667 కోట్లు పెట్టుబడులు పెట్టడంతో, ఈ నెల మొత్తం విలువ రూ. 16,516 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది.