మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయ్
* ఒడిదుడుకులకు కారణాలు
* 26న రైల్వే బడ్జెట్, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు
* 27న ఆర్థిక సర్వే
* 28న సాధారణ బడ్జెట్
న్యూఢిల్లీ: ఈ వారం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వివిధ సంఘటనలున్నందున స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
రైల్వే, కేంద్ర సాధారణ బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడతాయని వారు హెచ్చరించారు. అలాగే ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, సూచీల కదలికలు తీవ్రంగా వుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే గురు, శుక్ర, శనివారాల్లో (26, 27, 28 తేదీల్లో) వరుసగా రైల్వే, ఆర్థిక సర్వే, సాధారణ బడ్జెట్లను ఆయా మంత్రులు లోక్‌సభలో ప్రవేశపెడతారు. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవురోజైనప్పటికీ, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడయ్యే ఈ శనివారం మాత్రం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ 9-3.30 గంటల మధ్య యథావిధిగా కొనసాగుతుంది. దాంతో ఈ వారం మార్కెట్ వరుసగా ఆరురోజులపాటు పనిచేస్తుంది.
సంబంధిత రంగాలపై ఆసక్తి...
ఈ వారం ప్రారంభం నుంచీ బడ్జెట్ ముందస్తు అంచనాలకు అనుగుణంగా కొన్ని రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారని, ఆయా షేర్లలో ట్రేడింగ్ కార్యకలాపాలు ముమ్మరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటించబోయే సంస్కరణల పట్ల అంచనాలు, వాటి ప్రతిపాదనల ఆధారంగా సమీప భవిష్యత్తులో సూచీల కదలికలుంటాయని వారు తెలిపారు. వచ్చే కొద్దిరోజుల్లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, అయితే వారం మొత్తంమీద ప్రధాన అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు.
ప్రభావం తగ్గుతోంది...
చాలావరకూ సంస్కరణలు బడ్జెట్‌తో సంబంధం లేకుండానే జరుగుతున్నందున కొన్నేళ్లుగా మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం తగ్గుతోందని డీఎస్‌పీ మెరిలించ్ రీసెర్చ్ అనలిస్ట్ జ్యోతివర్థన్ జైపూరియా చెప్పారు. బడ్జెట్లలో పన్నులు, సుంకాల మార్పులు కూడా స్వల్పంగానే వుంటున్నాయని అన్నారు.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 16,500 కోట్లు...
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ క్యాపిటల్ మార్కెట్లో రూ. 16,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ వారు చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 50,205 కోట్లకు చేరింది. జనవరి నెలలో రూ. 33,688 కోట్ల నిధులు మార్కెట్లోకి ప్రవహించాయి. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ. 6,850 కోట్లు, రుణపత్రాల్లో రూ. 9,667 కోట్లు పెట్టుబడులు పెట్టడంతో, ఈ నెల మొత్తం విలువ రూ. 16,516 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది.