మళ్లీ 25వేల కిందకు..
లాభాల స్వీకరణతో క్షీణత...
♦ 371 పాయింట్ల నష్టంతో 24,966కు సెన్సెక్స్
♦ 101 పాయింట్లు నష్టపోయి 7,615కు నిఫ్టీ
నాలుగురోజుల సెలవుల అనంతరం సోమవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ముగిసింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ఒడిదుడుకులంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని నిపుణులు పేర్కొన్నారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 25 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 371పాయింట్లు (1.46 శాతం)నష్టపోయి 24,966 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్కో రోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఐదు వారాల్లో ఇదే మొదటిసారి. లోహ, ఫార్మా, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 660 పాయింట్లు లాభపడింది.
లాభాల్లో ప్రారంభమైనా...
అసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో స్టాక్ సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నిఫ్టీ 9 శాతానికి పైగా లాభపడింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండడం, దీనికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు తోడవడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈస్టర్ సెలవుల కారణంగా యూరోప్ మార్కెట్లు పనిచేయకపోవడం, రూపాయి క్షీణత, ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి.
దేశీయ కంపెనీలకు జోష్‌నిచ్చే ప్రభుత్వ రక్షణ రంగ సమీకరణ విధానం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రేట్ల కోత అంచనాలున్నప్పటికీ స్టాక్ మార్కెట్ నష్టాలపాలవడం ఆశ్చర్యకరమని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.
1.24 లక్షల కోట్ల సంపద నష్టం
సెన్సెక్స్ 371 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.24 కోట్లు ఆవిరై రూ.93,04,375 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ షేర్లలో ఎస్‌బీఐ, పీఎన్‌బీలు భారీగా నష్టపోయాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లను విక్రయించిన అశోక్ లేలాండ్
ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లను బల్క్‌డీల్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ విక్రయించింది. ఇవి రెండూ హిందూజా గ్రూప్ కంపెనీలే. 0.55 శాతం వాటాకు సమానమైన 32,63,923 షేర్లను సగటున రూ.915.96 ధరకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అశోక్ లేలాండ్ విక్రయించింది. ఈ బల్క్‌డీల్ విలువ రూ.299 కోట్లు.