చివర్లో అమ్మకాలు
⇒ కొనసాగిన ముందు జాగ్రత్త
⇒ ప్రారంభ లాభాలు ఆవిరి
⇒ స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు
⇒ మార్కెట్ అప్‌డేట్
ముంబై: ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభ లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లుగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులంటున్నారు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,115 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 29,270 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరి గంటన్నరలో అమ్మకాల ఒత్తిడికి లాభాలన్నీ హరించుకుపోయాయి. చివరకు 3 పాయింట్ల లాభంతో 28,968 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 8,767 పాయింట్ల వద్ద ముగిసింది.
మిశ్రమంగా రైల్ షేర్లు : మహీంద్రా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఏబీజీ షిప్‌యార్డ్ షేర్ 15 శాతం వరకూ పెరిగిందిజ గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వే షేర్లు మిశ్రమంగా ముగిశాయి.
ఐదు ఐపీఓలకు సెబీ ఆమోదం: కాగా ఐదు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం లభించింది. యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, ఏసీబీ (ఇండియా), శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌లు వీటిలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఐపీఓకు సంబంధించిన పత్రాలను గత ఏడాది సెబీకి సమర్పించాయి. గతంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడంతో పలు కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి.
మార్చి 10న యాడ్‌ల్యాబ్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) వచ్చే నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ సంస్థ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజిక పేరుతో ఒక ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌ను నిర్విహ స్తోంది. ఈ పార్క్‌ను ప్రముఖ చిత్ర నిర్మాత, దర్శకుడు మన్మోహన్ శెట్టి నిర్మించారు.