ఒడిదుడుకుల వారం..!
రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి దృష్టి...
* విశ్లేషకుల అభిప్రాయం...
* ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల
* ముగింపు ఈ వారంలోనే...
న్యూఢిల్లీ: డెరివేటివ్‌ల కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారంలో స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
రెండు కీలకమైన అంశాలు-రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వేలపై అందరి కళ్లు ఉంటాయని, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, ముడి చమురు ధరల గమనం, ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్‌లో ప్రకటించే సంస్కరణలు, రూపాయి కదలికలు.. ఇవన్నీ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
ఎలాంటి ప్రధాన ప్రపంచ సంఘటనలు లేనందున ఆర్థిక సర్వే, ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ అంశాలు తగిన ప్రభావం చూపిస్తాయనేది విశ్లేషకుల మాట. ఫిబ్రవరి డెరివేటివ్‌ల కాంట్రాక్టులు ఈ నెల 25న(గురువారం)ముగుస్తాయని, ఈ నేపథ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లోనే చలిస్తాయని, సానుకూలంగానే స్టాక్ మార్కెట్ ఉండొచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం ఇత్యాది అంశాలకనుగుణంగానే స్టాక్ మార్కెట్ గమనం ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు.
బడ్జెట్ కీలకం...
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెలలోనే పార్లమెంట్‌కు సమర్పించే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లపైననే స్టాక్ మార్కెట్ భవిష్యత్ గమనం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఈ మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ కారణంగా స్టీల్, సిమెంట్, బొగ్గు, ఐరన్ ఓర్, ఎరువుల కంపెనీలకు సంబంధించిన షేర్లలో కదలికలు ఉంటాయని సింఘానియా వివరించారు.
మరోవైపు ఈ నెల 26(శుక్రవారం)గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాల సమీక్ష-ఆర్థిక సర్వే ఉంటుంది. ప్రభుత్వ విధానాల అమలు తీరును ఈ సర్వే ప్రతిబింబిస్తుంది. సాధారణ బడ్జెట్ ఈ నెల 29న ప్రవేశపెడతారు. బడ్జెట్ అంచనాల కారణంగా రంగాల వారీగా కంపెనీల షేర్లు ప్రభావితం కావచ్చని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. గత వారంలో సెన్సెక్స్ 723 పాయింట్లు లాభపడి 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా ఈ నెల మొదటి మూడు వారాల్లో సెన్సెక్స్ 1,162 పాయింట్లు(4.67%) నష్టపోయింది.
ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, ఈ నెలకు సంబంధించి యూరోజోన్ మార్కెట్ ఎంఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు నేడు(సోమవారం) వెలువడుతున్నాయి. అమెరికాలో క్యూ4 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 26న) వెలువడుతాయి.
రూ. 4,600 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి..
ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,600 కోట్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళన, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు దీనికి ప్రధాన కారణాలు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.13,414 కోట్లు ఉపసంహరించుకున్నట్లైంది.
డిపాజిటరీ సంస్థల గణాంకాల ప్రకారం, ఈనెల 1-18 తేదీల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.4,503 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.96 కోట్లు మొత్తం రూ.4,599 కోట్లు నికరంగా తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కాగా జనవరిలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.13,381 కోట్లు ఉపసంహరించుకోగా, డెట్ మార్కెట్లో రూ.3,274 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారు.
ముడి చమురు ధరల పతనం కారణంగా పశ్చిమాసియా దేశాల సావరిన్ వెల్త్ ఫండ్స్.. వర్థమాన దేశాల మార్కెట్లో చేసిన భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నాయని సాస్ ఆన్‌లైన్‌డాట్‌కామ్ సీఓఓ సిద్ధాంత్ జైన్ చెప్పారు. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు ఈ స్థాయిలో తరలిపోతున్నాయన్నారు. రూపాయి పతనం, చైనా ఆర్థిక మందగమనంపై ఆందోళన విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయని వివరించారు.