సర్వే జోరుతో లాభాలు
♦ ఆకట్టుకున్న ఆర్థిక సర్వే
♦ 178 పాయింట్ల లాభంతో 23,154కు సెన్సెక్స్
♦ 59 పాయింట్ల లాభంతో 7,030కు నిఫ్టీ
ఆర్థిక సర్వే ఆశావహ పరిస్థితులను ఆవిష్కరించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉండటం కూడా కలసివచ్చింది. దీంతో 3 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రిలీఫ్ ర్యాలీతో సెన్సెక్స్ 23 వేల పాయింట్లకు, నిఫ్టీ 7,000 పాయింట్ల ఎగువకు చేరాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 178 పాయింట్లు లాభంతో 23,154 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 7,030 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 555 పాయింట్లు(2.34 శాతం), నిఫ్టీ 181 పాయింట్లు(2.51 శాతం) చొప్పున నష్టపోయాయి.
యూబీ గ్రూప్ షేర్ల జోరు
బడ్జెట్లో హౌసింగ్ రంగానికి అనుకూలమైన సంస్కరణలు ఉంటాయన్న అంచనాలతో హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1-8 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి విజయ్ మాల్యా రాజీనామా చేయడంతో యూబీ గ్రూప్ కంపెనీలు-యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ 20 శాతం, మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 8 శాతం, యునెటైడ్ బ్రూవరీస్ 1 శాతం, యునెటైడ్ స్పిరిట్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,443 షేర్లు నష్టాల్లో, 1,041 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే స్థాయిలో తగిన నిధులు ఉన్నాయని చైనా కేంద్ర బ్యాంక్ అధినేత వెల్లడించడంతో చైనాతో సహా ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి.