న్యూఢిల్లీ: డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా పరిస్థితులు, అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కరోనా వైరస్ సంబంధ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. మిగతా వాటితో పాటు ఆగస్టు నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు కూడా ఈ వారం ముగియనుండటంతో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొనే అవకాశం ఉంది‘ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ విభాగం) అజిత్ మిశ్రా తెలిపారు.
మరోవైపు, కరోనా వైరస్ కేసులతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ, అమెరికా – చైనా మధ్య వివాదంపైనా ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చి విభాగం హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు కదలికలు, రూపాయి–డాలర్ మారకం విలువలో మార్పులు, విదేశీ పెట్టుబడుల రాక తదితర అంశాలూ కీలకంగా ఉండగలవని వివరించారు. 21 ఆగస్టుతో ముగిసిన వారంలో కీలక సూచీలైన సెన్సెక్స్ 557 పాయింట్లు (1.47 శాతం), నిఫ్టీ 193 పాయింట్లు (1.72 శాతం) పెరిగాయి. దేశీయంగా కరోనా వైరస్‌లు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంట్ భారత మార్కెట్‌కు దన్నుగా నిలవడం ఇందుకు తోడ్పడింది.
సమీప కాలంలో ఎగువ దిశగానే..
సమీప భవిష్యత్‌లో మార్కెట్ ప్రయాణం ఎగువ దిశగానే సాగగలదని ఖేమ్కా పేర్కొన్నారు. అయితే, భారీ వేల్యుయేషన్ల కారణంగా మధ్య మధ్యలో లాభాల స్వీకరణకు ఆస్కారం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు మరింతగా అనుసంధానమైన విధంగా దేశీ మార్కెట్లు స్పందిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చి విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘ఇక ఇక్కణ్నుంచి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని భావించడానికి దోహదపడే సంకేతాలు, కరోనా వైరస్‌కు టీకా లేదా సరైన చికిత్స సంబంధ పరిణామాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి‘ అని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శిబానీ సర్కార్ కురియన్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా కేసులు 20 లక్షలకు చేరిన 16 రోజుల వ్యవధిలోనే ఏకంగా 30 లక్షల పైచిలుకు పెరిగాయి. ఈ అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయన్నది విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment