3 రోజుల లాభాలకు బ్రేక్
♦ జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు
♦ దశ, దిశ లేకుండా సాగిన ట్రేడింగ్
♦ 23 పాయింట్ల నష్టంతో 24,470కు సెన్సెక్స్...
జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. దశ, దిశ లేకుండా ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 23 పాయింట్ల నష్టంతో 24,470 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 7,425 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంజినీరింగ్, బ్యాంక్, వాహన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చివరి గంటలో బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాలు జోరుగా జరిగాయి.
ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి అనిశ్చితిగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది రేట్ల పెంపు ఉండొచ్చని సంకేతాలివ్వడం... ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రోల్ ఓవర్లు 67 శాతంగా ఉన్నాయి. గత మూడు నెలల రోల్ ఓవర్ల సగటు కూడా ఈ స్థాయిలోనే ఉంది.