UK Face A Recession In 2023: Falling Britain Graph, Facing Severe Economic Crisis - Sakshi
Sakshi News home page

UK Economic Crisis: పడిపోతున్న బ్రిటన్ గ్రాఫ్, ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!

Published Sun, Feb 19 2023 4:42 AM | Last Updated on Sun, Feb 19 2023 1:36 PM

UK face a recession in 2023 - Sakshi

యునైటెడ్‌ కింగ్‌డమ్‌. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం.  కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని  ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది.  

నానాటికీ పతనం...
బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి.  ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్‌ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేస్తోంది.

ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్‌ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్‌ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్‌ స్టడీస్‌ ఇనిస్టిట్యూట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్ల్‌ ఎమ్మర్‌సన్‌ అభిప్రాయపడ్డారు.

జీ–7 దేశాల్లో వెనక్కి  
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్‌ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర   ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్‌ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్‌ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్‌ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

డాలర్‌తో పౌండ్‌ విలువ            :         0.83
బ్రిటన్‌ జీడీపీ వృద్ధి రేటు అంచనా:          0.6%
ద్రవ్యోల్బణం                          :       10.1%

బ్రెగ్జిట్‌ దెబ్బ...
ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్‌ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్‌ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్‌ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్‌ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి.

శ్రామికులు కావలెను...
బ్రెగ్జిట్‌ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement