ఇస్లామాబాద్: అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ దేశ ఆర్ధిక పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో తెలీయని అనిశ్చితిలో దొరికిన చోట దొరికినంత అప్పు చేస్తోంది. తాజాగా తన మిత్ర దేశమైన చైనా దగ్గర మరికొంత ఋణం తీసుకునేందుకు అంతా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ మన చేతిలో ఉన్న చిప్పను అవతలకు విసిరేసి స్వాభిమానంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ గత కొంతకాలముగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఉన్న ఆస్తులను అమ్ముకోవడంతో పాటు మరోపక్క రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) దగ్గర కొంత ఋణం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మిత్రదేశం చైనా దగ్గర మరికొంత రుణాన్ని పొందనుంది. చైనాకు పాకిస్తాన్ ఇప్పటికే 2.07 బిలియన్ డాలర్ల రుణపడి ఉండగా తాజాగా తీసుకోనున్న మరో 600 మిలియన్ డాలర్ల రుణంతో కలిపి ఆ మొత్తం 2.44 బిలియన్ డాలర్లకు చేరనుంది.
దీంతో విపరీతంగా పెరుగుతున్న అప్పుల భారం దృష్ట్యా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ స్పందించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలపడేంత వరకు సైన్యం నిద్రపోకుండా పనిచేస్తుందని, అపార ప్రతిభావంతులను, ఉత్సాహవంతులైన వారిని చూసి పాకిస్తాన్ గర్విస్తోందని అన్నారు. ఎంతకాలం ఇలా పొరుగుదేశాల దగ్గర చిప్ప పట్టుకుని తిరుగుతాం. ముందు చేతిలోని ఆ చిప్పను విసిరేయాలి. రుణాల కోసం ఇతర దేశాల మీద మీద ఆధారపడటం మానేయాలి. సొంత కాళ్ళ మీద నిలబడి ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు.
ఇది కూడా చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment