ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది.
ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్.
పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది.
మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు.
ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..
Comments
Please login to add a commentAdd a comment