అంతా మన మంచికే..!
అటు పరిపాలకుల నుంచి ఉన్నత అధికారుల వరకూ దాదాపు ఒకేఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం అవుతోంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఉన్నా... దీర్ఘకాలంలో బ్రెగ్జిట్ భారత్‌కు లాభించే అంశమేనన్నది వీరి వాదన. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే...
స్థిరత్వం కొనసాగుతుంది
పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. లిక్విడిటీ విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా భారత్ తగిన చర్యలను తీసుకుం టుంది. ప్రస్తుతం ఒడిదుడుకులున్నా... సమీప కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలోనే కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం.
- జయంత్ సిన్హా, ఆర్థికశాఖ సహాయమంత్రి
కలిసి వచ్చే అంశమే
అనిశ్చితి సమయాల్లో పెట్టుబడుల అవకాశాలకు భారత్ వేదికగా మారబోతోంది. బ్రెగ్జిట్ భారత్‌కు పూర్తిగా సానుకూల అంశమే. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడం లాభిస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచకపోవటమూ సానుకూలమే.
- అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు
భవిష్యత్ బాగుంటుంది
బ్రెగ్జిట్ ప్రభావం తక్షణం ఇతర అన్ని దేశాల్లానే భారత్‌పైనా పడుతుంది. అయితే పెట్టుబడులకు చక్కటి ప్రాం తంగా భారత్ కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వ్యూహాత్మకంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లు భారత్‌కు చక్కటి మార్కెట్‌ను సృష్టించే అవకాశం ఉంది.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
ఎగుమతులకు దెబ్బే...
భారత్ ఎగుమతులపై తాజా పరిణామాలు ప్రతికూలత చూపిస్తాయి. కరెన్సీ ఒడిదుడుకులు చాలా ముఖ్యాంశం. బ్రిటన్ పౌండ్, యూరోలు బలహీనపడతాయి. దీంతో ఆయా దేశాల ప్రొడక్టులతో విదేశాలకు విపరీతమైన పోటీ పెరుగుతుంది. అయితే ఆ రెండు ప్రాంతాలతో భారత్ వాణిజ్యంపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. - భారత ఎగుమతి సంఘాల సమాఖ్య
భారత్-బ్రిటన్ బంధం పటిష్టం
తాజా పరిణామం భారత్, బ్రిటన్ బంధం మరింత పటిష్టమవడానికి దారితీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. తాజా బ్రిటన్ పరిణామాలు పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల దృష్టి వర్ధమాన దేశాలకు ప్రత్యేకించి భారత్‌వైపు మళ్లేట్లు చేస్తుంది. - జీపీ హిందూజా, హిందూజా గ్రూప్ కో-చైర్మన్