Why UK PM Liz Truss Resigned After 45 Days, What Happened - Sakshi
Sakshi News home page

Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?

Published Fri, Oct 21 2022 5:00 AM | Last Updated on Fri, Oct 21 2022 1:40 PM

Liz Truss 45 days as Prime Minister, what happened - Sakshi

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది.  బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్‌ ట్రస్‌ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది.

బ్రిటన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్‌ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్‌ చరిత్రలో లిజ్‌ ట్రస్‌ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్‌ ప్రధాని జార్జ్‌ కానింగ్‌ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్‌ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు.  

విద్యుత్‌ బిల్లులు ఫ్రీజ్‌
ప్రజాసంక్షేమం పేరుతో  లిజ్‌ ట్రస్‌ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్‌ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్‌ బిల్లుల్ని ఫ్రీజ్‌ చేస్తూ  నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం  పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది

మినీ బడ్జెట్‌ ప్రకంపనలు
బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్‌టెంగ్‌ సెప్టెంబర్‌ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు  సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్‌లో చూపించకుండా విద్యుత్‌ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్‌ విలువ భారీగా పడిపోయింది.

ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్‌ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్‌ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది.  కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్‌ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్‌టెంగ్‌పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్‌లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా  అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  

హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి
బ్రిటన్‌ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్‌ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్‌ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్‌ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్‌ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement