Tax rebates
-
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐటీ మినహాయింపు పరిమితి...3 లక్షలా..5 లక్షలా..?
మోడీ సర్కారు బడ్జెట్‌పై ఊహల పల్లకిలో మధ్యతరగతి ప్రజలు * హోమ్లోన్స్, ఆరోగ్య బీమా రాయితీలు పెరిగే చాన్స్ * సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి వ్యక్తిగత ఆదాయ పన్నులను పూర్తిస్థాయిలో సంస్కరించనున్నారా? కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాల నుంచి మాత్రం ఈ దిశగా లీకుల మీద లీకులు వస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి(బేసిక్ లిమిట్)ని ఇప్పుడున్న రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా నివేదిక కోరినట్లు ఆదాయ పన్ను వర్గాలు పేర్కొన్నాయి. వీటితో పాటు హోమ్లోన్స్, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటికి సంబంధించిన నివేదికను జూన్ 20లోగా ఇవ్వనున్నట్లు ఆదాయ పన్ను వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెలలో లోక్‌సభకు సమర్పించే బడ్జెట్లో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీ టీసీ)ను ప్రవేశపెట్టడమే కాకుండా అందులో ఈ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ని తగ్గించవచ్చన్న ప్రచారం కూడా బాగా జరుగుతోంది. సాధ్యమేనా...? గత ప్రభుత్వం డీటీసీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బీజేపీకి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వం వహించడం, ఆయన మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం నుంచి ఊరటనిస్తూ అనేక సూచనలు చేయడం, ఇప్పుడు బీజేపీనే అధికారంలోకి రావడంతో ఈ మార్పులపై ప్రజల్లో ఆశలు భారీగా పెరిగాయి. కానీ గతేడాది సిన్హా కమిటీ సూచనలు అమలు చేసే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు లేదంటూ అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం వాటిని తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బేసిక్ లిమిట్‌ను యశ్వంత్ సిన్హా చెప్పినట్లు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచితే రూ.60,000 కోట్లు ఆదాయం నష్టపోవాల్సి వుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరించలేదంటూ తిరస్కరించారు. కానీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లు రెండు నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచితే తట్టుకునే శక్తి మన ఆర్థిక వ్యవస్థకి ఉందా అనేదే ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో ఇంతటి భారీ మినహాయింపును మోడీ కురిపిస్తారా అన్నదానిపై చర్చ మొదలైంది. సిన్హా సూచించినట్లు ఆదాయ పన్ను శ్లాబ్‌ను రూ.3 లక్షల వరకు పెంచవచ్చన్నది ఎక్కువమంది అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ కూడా బేసిక్ లిమిట్ పెంపు పట్ల అనుకూలంగా మాట్లాడారు. దీనివల్ల ప్రజల వద్ద మిగులు ఆదాయం పెరుగుతుందని, తద్వారా వినియోగశక్తి మెరుగుపడి, పరోక్ష పన్నుల ఆదాయం వృద్ధిచెందుతుందని జైట్లీ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయనే ఆర్థిక మంత్రి కావడంతో, బేసిక్ లిమిట్ అయితే తప్పనిసరిగా పెంచవచ్చని టాక్స్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ పరిమితి రూ. 3 లక్షలా? రూ. 5 లక్షలా అన్నది తెలియాలంటే బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సిందే.