ఐటీ మినహాయింపు పరిమితి...3 లక్షలా..5 లక్షలా..? | How Modi Can Ensure Housing for All By 2022 | Sakshi
Sakshi News home page

ఐటీ మినహాయింపు పరిమితి...3 లక్షలా..5 లక్షలా..?

Published Sat, Jun 14 2014 12:56 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఐటీ మినహాయింపు పరిమితి...3 లక్షలా..5 లక్షలా..? - Sakshi

ఐటీ మినహాయింపు పరిమితి...3 లక్షలా..5 లక్షలా..?

 మోడీ సర్కారు బడ్జెట్‌పై ఊహల పల్లకిలో మధ్యతరగతి ప్రజలు

* హోమ్‌లోన్స్, ఆరోగ్య బీమా రాయితీలు పెరిగే చాన్స్
* సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి వ్యక్తిగత ఆదాయ పన్నులను పూర్తిస్థాయిలో సంస్కరించనున్నారా?  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాల నుంచి మాత్రం ఈ దిశగా లీకుల మీద లీకులు వస్తున్నాయి.  వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి(బేసిక్ లిమిట్)ని ఇప్పుడున్న రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా నివేదిక కోరినట్లు ఆదాయ పన్ను వర్గాలు పేర్కొన్నాయి.
 
వీటితో పాటు హోమ్‌లోన్స్, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటికి సంబంధించిన నివేదికను జూన్ 20లోగా ఇవ్వనున్నట్లు ఆదాయ పన్ను వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెలలో లోక్‌సభకు సమర్పించే బడ్జెట్‌లో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీ టీసీ)ను ప్రవేశపెట్టడమే కాకుండా అందులో ఈ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ)ని తగ్గించవచ్చన్న ప్రచారం కూడా బాగా జరుగుతోంది.
 
సాధ్యమేనా...?
గత ప్రభుత్వం డీటీసీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బీజేపీకి చెందిన మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వం వహించడం, ఆయన మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం నుంచి ఊరటనిస్తూ అనేక సూచనలు చేయడం, ఇప్పుడు బీజేపీనే అధికారంలోకి రావడంతో ఈ మార్పులపై ప్రజల్లో ఆశలు భారీగా పెరిగాయి. కానీ గతేడాది సిన్హా కమిటీ సూచనలు అమలు చేసే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు లేదంటూ అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం వాటిని తిరస్కరించడం జరిగింది.

ప్రస్తుతం ఉన్న బేసిక్ లిమిట్‌ను యశ్వంత్ సిన్హా చెప్పినట్లు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచితే రూ.60,000 కోట్లు ఆదాయం నష్టపోవాల్సి వుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరించలేదంటూ తిరస్కరించారు.  కానీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లు రెండు నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచితే తట్టుకునే శక్తి మన ఆర్థిక వ్యవస్థకి ఉందా అనేదే ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో ఇంతటి భారీ మినహాయింపును మోడీ కురిపిస్తారా అన్నదానిపై చర్చ మొదలైంది.
 
సిన్హా సూచించినట్లు ఆదాయ పన్ను శ్లాబ్‌ను రూ.3 లక్షల వరకు పెంచవచ్చన్నది ఎక్కువమంది అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ కూడా బేసిక్ లిమిట్ పెంపు పట్ల అనుకూలంగా మాట్లాడారు. దీనివల్ల ప్రజల వద్ద మిగులు ఆదాయం పెరుగుతుందని, తద్వారా వినియోగశక్తి మెరుగుపడి, పరోక్ష పన్నుల ఆదాయం వృద్ధిచెందుతుందని జైట్లీ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయనే ఆర్థిక మంత్రి కావడంతో, బేసిక్ లిమిట్ అయితే తప్పనిసరిగా పెంచవచ్చని టాక్స్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ  పరిమితి రూ. 3 లక్షలా? రూ. 5 లక్షలా అన్నది తెలియాలంటే బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement