చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి  | SVAMITVA Scheme: Empowering Rural India with Legal Land Ownership | Sakshi
Sakshi News home page

చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి 

Published Sun, Jan 19 2025 4:49 AM | Last Updated on Sun, Jan 19 2025 4:49 AM

SVAMITVA Scheme: Empowering Rural India with Legal Land Ownership

పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది 

స్వామిత్ర ఆస్తి కార్డుల అందజేత కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని 

65 లక్షల మందికి ప్రాపర్టీ కార్డుల అందజేత 

న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్‌లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు.

 ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు.

 ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. 

కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్‌గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. 

మృత మూలధనం కాదు 
‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. 

మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం.

 స్వామిత్ర (సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) యోజన పథకం ద్వారా డ్రోన్‌ సాంకేతికత సాయంతో మ్యాపింగ్‌ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 

భారత్‌లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్‌ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్‌ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement