Liz Truss
-
షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్!
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో లిజ్ మాట్లాడిన సంభాషణలతో పాటు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ పంపుకున్న సందేశాలు వంటి కీలక రహస్యాలు రష్యా చేతికి చిక్కినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. ట్రస్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే రష్యా ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఈ ఫోన్ హ్యాక్ చేసిన రష్యాకు బ్రిటన్ రహస్యాలు తెలిశాయని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయుధ సరఫరా, మిత్ర దేశాలతో సంబంధాలతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆమె వివర్శించిన సంభాషణలు కూడా పుతిన్ చేతికి చేరినట్లు వెల్లడించింది. ఇతర దేశాలకు కీలక సమాచారం చిక్కడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని తెలిపింది. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూకే చరిత్రలోనే అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఆమే కావడం గమనార్హం. పదవి చేపట్టాక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, మంత్రులు రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ స్వతహాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ఎలాంటి పోటీ లేకుండా బ్రిటన్ ప్రధాని అయ్యారు. చదవండి: ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి -
రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు
లండన్: భారత మూలాలు కలిగిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ఆయన తన లక్ష్యాలను స్పష్టం చేశారు. మాటలతో కాదు చేతలతో తానేంటో చూపిస్తానని ప్రకటించారు. లిజ్ ట్రస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని వెల్లడించారు. రిషి సునాక్ ప్రసంగంలోని 5 ప్రధానాంశాలు ఇవి... 1. బ్రిటన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా తలెత్తిన విపరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థ బలహీనపడింది. 2. బ్రిటన్ను అభివృద్ధి పథంలో నడపాలని లిజ్ ట్రస్ కోరుకున్నారు. గొప్ప లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేసిన ఆమెను మెచ్చుకోవాల్సిందే. కానీ లిజ్ ట్రస్ హయాంలో కొన్ని తప్పులు జరిగాయి. 3. నేను నా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే పని తక్షణమే ప్రారంభమవుతుంది. 4. ఆర్థిక స్థిరత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తాం. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నేను చేసిన ప్రయత్నాలను మీరంతా చూశారు. 5. మాటలతో కాదు నా పనితీరుతో మన దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి ప్రతిరోజు కష్టపడతాను. (క్లిక్ చేయండి: అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్) -
మ్యాగజైన్ స్టోరీ : యూకే నాట్ ఓకే
-
ట్రస్‌కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు. -
UK Political Crisis: ఎంపీలే కీలకం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో ఆమె వారసుడెవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది. ఎన్నిక ప్రక్రియ ఇలా... ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు. ► నామినేషన్‌కు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు. ► ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్లైన్లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు. ► ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు. ► ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ► అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు. రేసులో వీరే... రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది. బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. పెన్నీ మోర్డంట్: బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలే బ్రిటన్‌కు మందు
మహాసంక్షోభం ముంచుకొస్తున్నదని, నలుదిక్కులా పొంచివున్న సమస్యలు కాలనాగులై కాటేసే ప్రమాదముందని తెలిసినా అలవికాని హామీలిచ్చి బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల వ్యవధిలోనే తత్వం బోధపడి నిష్క్రమించారు. బ్రిటన్ చరిత్రలో అతి స్వల్పకాలం ఏలుబడి సాగించిన నేతగా అపకీర్తి మూటకట్టుకున్నారు. నెలాఖరుకల్లా మరొకరు ఆ పదవిని అధిష్ఠించాల్సి ఉంది. ఎనిమిది వారాల్లో ముచ్చటగా మూడో ప్రధానిని బ్రిటన్ ప్రజానీకం చూడబోతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే నేత ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఏం చేస్తారన్నది కొన్నిరోజుల్లో తేలిపోతుంది. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల ఊసెత్తకుండా కొత్త నేతతో నష్టనివారణకు ప్రయత్నించవచ్చు. కానీ అది అన్ని విధాలా అప్రజాస్వామికమే అవుతుంది. ప్రస్తుతం బ్రిటన్ చుట్టూ ముసురుకున్న సమస్యలకు లిజ్ ట్రస్ కారకులు కాకపోవచ్చు. 2016లో వెనకాముందూ చూడకుండా బ్రెగ్జిట్‌కు దేశం ఆమోదముద్ర వేయటంలోనే అందుకు బీజాలు పడివుండొచ్చు. ఈయూ నుంచి బయటికొచ్చినప్పటినుంచీ ఆర్థిక అస్థిరత పీడిస్తున్న సంగతి కాదనలేనిది. కరోనా కష్టాలు సరేసరి. ఈలోగా ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఇంధన ధరలను ఆకాశాన్నంటేలా చేసింది. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ఆమె అనుసరిస్తానన్న విధానాలపై ప్రధాని పదవికి పోటీపడినప్పుడే కన్సర్వేటివ్ పార్టీలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమె చూపుతున్న మార్గం ఆత్మహత్యాసదృశమవుతుందని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తెచ్చి వృద్ధికి దోహదపడతానని, అందుకోసం పన్నులపై కోత విధిస్తా నని, విద్యుత్ బిల్లులపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా అదుపు చేస్తానని ట్రస్ హామీ ఇచ్చినప్పుడు ఆమెతో పోటీపడిన రిషి సునాక్ అది మరింత సంక్షోభాన్ని కొనితెస్తుందన్నారు. పన్ను కోతల వల్ల ఏర్పడే లోటును ఎలా పూరిస్తారో, పెరిగే వ్యయానికి నిధులు ఎక్కణ్ణించి వస్తాయో చూప కుండా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. కానీ సునాక్‌ను ఆమె నిరాశావాదిగా కొట్టిపారేశారు. అయితే గత నెల 23న ఆర్థికమంత్రి క్వాసీ క్వార్టెంగ్ మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగింది అదే. ఒకపక్క ప్రభుత్వ వ్యయం పెంపు, మరో పక్క 4,500 కోట్ల పౌండ్ల పన్ను కోతలు, దాని భర్తీకి బాండ్ల జారీ ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని రుణ ఊబి లోకి నెట్టేస్తాయన్న అంచనాలకు దారీతీశాయి. వడ్డీరేట్లు పెరిగాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటి, ద్రవ్యోల్బణం పది శాతానికి ఎగబాకి, త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో చేసిన ఈ ప్రతిపాదనలు ఫైనాన్షియల్ మార్కెట్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి. ఫలి తంగా కొత్తగా జారీచేసే బాండ్లు కొనడంమాట అటుంచి, తమదగ్గర ఉన్నవాటిని మదుపుదారులు అమ్ముకోవటం ప్రారంభించారు. ఇది బాండ్ల విలువను మింగి, పౌండ్ పతనానికి దారితీసింది. ఈ సంక్షోభాన్ని అడ్డుకోవటానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక గత్యం తరం లేదని తెలిసి మినీ బడ్జెట్ ప్రతిపాదనలు ఒక్కొక్కటే ఉపసంహరించుకోవటం ప్రారంభిం చారు. చివరకు ఆర్థికమంత్రిని సాగనంపి ఆ స్థానంలో జెరిమీ హంట్‌ను తీసుకొచ్చారు. సమస్యలను సక్రమంగా విశ్లేషించి సరైన విధానాలకు రూపకల్పన చేయటం, వాటి అమలులో ఎదురయ్యే జయాపజయాలకు తామే బాధ్యత వహించటం నాయకత్వ స్థానంలో ఉండేవారు చేయాల్సిన పని. కానీ లిజ్ ట్రస్ అలా వ్యవహరించలేకపోయారు. తన అసమర్థతనూ, చేతకాని తనాన్నీ చాటుకున్నారు. ప్రధాని పదవికి పోటీపడినప్పుడు చేసిన వాగ్దానాలను అమలుచేయటానికి తనకు సన్నిహితుడైన క్వార్టెంగ్ను ఆర్థికమంత్రిని చేసింది లిజ్ ట్రస్సే. మినీ బడ్జెట్లోని ఆయన ప్రతిపాదనలన్నీ ట్రస్ మానసపుత్రికలే. ఆర్థికమంత్రిగా ఉన్నందుకైనా క్వార్టెంగ్ ఆమె ప్రతి పాదనలకు మార్పులు, చేర్పులు చేసిన దాఖలా కనబడదు. తీరా వీటిపై వ్యతిరేకత వెల్లువెత్తేసరికి ఆయన్ను బాధ్యుణ్ణి చేసి గతవారం కేబినెట్ నుంచి తప్పించారు. పైగా ఓపక్క తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూనే యోధురాలినని, తుదికంటా పోరాడతానని నమ్మబలికారు. ఆ వెంటనే పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రాజీనామా చేసిన హోంమంత్రి బ్రేవర్మన్ ఉన్నమాట న్నారు. ప్రభుత్వానికి సారథ్యంవహించేవారు తప్పులు చేయలేదని బుకాయించటానికి బదులు అవి జరిగాయని నిజాయితీగా అంగీకరించటానికి సిద్ధపడాలని ఒక ఎంపీకి పొరపాటున పంపిన మెయిల్లో ఆమె వ్యాఖ్యానించారు. తన సహచరుల్లో తనపై ఎలాంటి అభిప్రాయం ఉన్నదో అర్థమయ్యాక ఇక రాజీనామా చేయటమే ఉత్తమమని ట్రస్ భావించివుండొచ్చు. పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉండొచ్చు. అంతమాత్రంచేత జనామోదం ఉందో లేదో తెలియని మరొకరిని పార్టీ సభ్యులు లేదా ఎంపీల అంగీకారంతో ప్రతిష్ఠించి అధికారంలో పూర్తికాలం కొనసాగాలనుకోవటం అప్రజాస్వామికం. ఇది తొలిసారి కూడా కాదు. ఒకప్పుడు ‘సహజ పాలక పక్షం’గా నీరాజనాలందుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడింది. ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయని స్పష్టంగా తెలుస్తున్నప్పుడూ, అధికార కన్సర్వేటివ్ పార్టీ ముఠా తగాదాల్లో మునిగి మేధోశూన్యత లోకి జారిపోయిందని అర్థమవుతున్నప్పుడూ అన్ని పక్షాలూ ప్రజాతీర్పు కోరటమే పరిష్కారం.బ్రిటన్‌కు మందు -
ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కి యూకేతో ఉన్న వాణిజ్య ఒప్పందాల విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ ఎగుమతుల సదస్సులో వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ...ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై బ్రిటన్‌తో భారత్ చర్చలు బాగానే సాగిస్తోంది. ఐతే ఇటీవల బ్రిటన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా న్యూఢిల్లీ కాస్త వేచి ఉండక తప్పదని అన్నారు. ఆ తదనందరం మాత్రమే యూకేకి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించగలమని చెప్పారు. అదీగాక వచ్చే వారంలోనే బ్రిటన్‌లో ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ఆ తర్వాత లిజ్ వారసురాలిగా కొత్త ప్రధానిని పాలక కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకోవడం కూడా జరుగుతోందని తెలిపారు. అంతేగాదు యూకే నాయకులు కూడా భారత్‌తో వాణిజ్య వ్యాపారాలు అత్యంత ముఖ్యమని గుర్తించినట్లు చెప్పారు. యూకేలో ఎవరూ నాయకులుగా వచ్చిన భారత్‌తో వాణిజ్యం సాగించేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాలకు ఈ ట్రేడ్ డీల్ విజయం చేకూరడం తోపాటు సంతృప్తి చెందాలి అప్పుడే ఈ ఒప్పందం ఖరారవుతుందని లేదంటే ఎలాంటి ఒప్పందం ఉండదని తేల్చి చెప్పారు. అలాగే బ్రిటన్, కెనడా, యూరప్‌ల వంటి దేశాలతో కనీసం ఒకటి లేదా రెండు స్యేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు 2027 నాటికి వస్తువుల సేవల కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు లక్ష్యం ఉందని, దీన్ని2030 కల్లా సాధించగలమని చెప్పారు. ఈ మేరకు పరస్పర వస్తువుల ప్రమాణాల గుర్తింపు ఒప్పందం(ఎంఆర్ఏ) విషయం గురించి ప్రస్తావిస్తూ... భారత్‌కి ఏ కారణం చేతన ఎక్కువ ఎంఆర్ఏలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. బహుశా అధిక నాణ్యత వస్తువుల సేవలను అందించగల భారత్ సామర్థ్యంపై విశ్వాసం రావడానికి మరికొంత సమయం కావాలేమో అని వ్యగ్యంగా అన్నారు. అలాగే భారత్‌కి సరఫరా చేసే నాణ్యత నియంత్రణ ఆర్డర్లను కూడా పెంచాలని నొక్కి చెప్పారు. మీరు ఎంఆర్ఏలను ఇచ్చినట్లుగానే భారత్ కూడా మీకు ఇస్తుందని తేల్చి చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసిఓ)పై కూడా భారత పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయమై దేశాలను పునరాలోచించమని చెబుతున్నా, ఏ విషయంలో క్యూసీఓని కోరుకుంటున్నాయో కూడా చెప్పండి అని పియూష్ గోయల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా...
-
Liz Truss: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది. పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక లిజ్ ట్రస్ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్ ట్రస్ నెలకొల్పారు. తెరపైకి పలువురి పేర్లు లిజ్ ట్రస్ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్‌ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు. అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు. జీవించి ఉన్న ఏడుగురు మాజీలు ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్ జాన్సన్, థెరెసా మే, డేవిడ్ కామెరూన్, గోర్డాన్ బ్రౌన్, సర్ టోనీ బ్లెయిర్, సర్ జాన్ మేయర్ సరసన ఇప్పుడు ట్రస్ చేరారు. 45 రోజుల ప్రధానమంత్రి యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు. బాధ్యత నెరవేర్చలేకపోయా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే? -
బ్రిటన్ సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది!
లండన్: బ్రిటన్ ఆర్థిక సంక్షోభం.. నానాటికీ దిగజారుగుతోంది. ప్రధాని లిజ్ ట్రస్ నిర్ణయంతో పతనం దిశగా దేశం పయనిస్తోందని సొంత పార్టీ సభ్యులే విమర్శిస్తున్నారు. తాజాగా హోం సెక్రెటరీ సుయెల్లా బ్రేవర్మన్ తప్పుకోగా.. రాజీనామా లేఖలో ఆమె ఆర్థిక సంక్షోభ విషయంలో యూకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా నిప్పులు చెరిగారు. బ్రిటన్‌లో లక్షలాది మంది ఈ జీవన వ్యయ సంక్షోభాన్ని(Cost Of Living Crisis) నుంచి గట్టెక్కేందుకు భోజనాన్ని దాటవేస్తున్నారట. ఇక ఇంధన పేదరికం ఇది వరకే అంచనా వేసినట్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. చాలావరకు ఇళ్లలో విద్యుత్, హీటర్ ఈ విషయాలను విచ్ (Which?) అనే వినియోగదారుల సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది. మూడు వేల మందిని సర్వే చేసిన ఈ సంస్థ.. ఆ అంచనా ఆధారంగా సగం యూకే ఇళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక్కపూట భోజనానికి దూరం కావడం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలోనూ ఆర్థిక కష్టాల ప్రభావం కనిపిస్తోంది. బ్రిటన్ వాసులు(80 శాతం దాకా) హెల్తీ మీల్స్‌కు దూరంగా ఉంటున్నారని విచ్ ప్రతినిధి సూ డేవీస్ చెప్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 10.1 శాతానికి చేరుకుంది. ఇదిగాక.. ఇంధన ధరల ప్రభావంతో లక్షల ఇళ్లపై పడిందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెచ్చుమీరింది. లో ఇన్కమ్ కేటగిరీలో.. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరత సమస్యతో అతలాకుతలమవుతోంది. 2022వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఆహార సంక్షోభం కనిపించింది. అయితే సెప్టెంబరులో 18 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్ బుధవారం ఉదయం లిజ్ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ట్రస్ విధానాలతో బ్రవెర్మన్ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని లిజ్ ట్రస్‌పై భారత సంతతి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ విజయం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. యూగవ్ తాజాగా నిర్వహించిన గ్యాలప్ పోల్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55% మంది మొగ్గు చూపారు. పన్నుల్లో కోత పెట్టి, వివాదాస్పదం కావడంతో వాటిని ఉపసంహరించుకున్న లిజ్‌ట్రస్ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుంటుండగా, కొనసాగాలని 38% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. పార్టీ గేట్ కుంభకోణంతో తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను సరైన ప్రత్యామ్నాయంగా 63 శాతం మంది పేర్కొనడం విశేషం. ప్రధానిగా జాన్సన్‌ను 32%, రిషిని 23 శాతం బలపరిచారు. తప్పులు చేశాం..క్షమించండి: లిజ్ ట్రస్ ప్రధాని లిజ్‌ట్రస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లో నెట్టాయి. సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఆర్థిక మంత్రిని నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం’అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: రష్యా కొత్త పంథా.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి -
తప్పు జరిగిపోయింది.. లిజ్ ట్రస్ క్షమాపణలు
లండన్: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. జాతిని ఉద్దేశించి క్షమాపణలు తెలియజేశారు. మినీ బడ్జెట్.. పన్నుల కోత నిర్ణయాలు బెడిసి కొట్టడం వెనుక పెద్ద తప్పు జరిగిపోయిందని, ఆ తప్పు చాలా దూరం వెళ్లిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘జరిగిన పొరపాట్లకు క్షమించండి. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆ పరిణామాలు చాలా వేగంగా.. చాలా దూరం వెళ్లాయి. అందుకు బాధ్యత నేనే తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతాం’’ అని ఆమె పౌరులను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. అయితే.. తప్పులు జరిగినప్పటికీ దేశం కోసం పని చేయడానికే తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్జర్వేటివ్ తరపున తన సారథ్యంలోని ప్రభుత్వమే ఎన్నికలకు వెళ్తుందని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ట్రస్‌ను ఎన్నుకుని తప్పిదం చేశామన్న అభిప్రాయంలో ఉన్న కొందరు కన్జర్వేటివ్ ఎంపీలు.. అవిశ్వాసం ద్వారా ఆమెను గద్దె దించే ఆలోచనలో ఉన్నట్లు అక్కడి మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. ఇదీ చదవండి: అవిశ్వాసం.. లిజ్ ట్రస్‌కు ఉన్న ఏకైక ఆయుధం అదే! -
చేజేతులా... చిక్కుల్లో!
బోరిస్ జాన్సన్ స్థానంలో పగ్గాలు చేపట్టి నిండా నలభై రోజులు కాకుండానే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి చిక్కుల్లో పడింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అధిక ఆదాయం ఉన్నవారికి పన్నులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఇది. కన్జర్వేటివ్ పార్టీలోనూ, ఆర్థిక విపణుల్లోనూ ఆమె కష్టాల కడలి నుంచి గట్టెక్కడం సులభం కాదనే పరిస్థితి వచ్చింది. చెలరేగిన విమర్శలతో లిజ్ గత శుక్రవారం తన ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్తెంగ్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ‘మినీ బడ్జెట్’లోని ఆర్థిక ప్యాకేజీ అంశాలను కొత్త ఆర్థికమంత్రి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇది సంచలనమే! పన్నుల్లో కోతలపై లిజ్ వెనక్కితగ్గడం తాత్కాలిక ప్రశాంతతను తేవచ్చు. కానీ, పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడానికీ, దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించడానికీ ఇది సరిపోతుందా? సెప్టెంబర్ 23న లిజ్, అప్పటి ఆమె సహచర ఆర్థిక మంత్రి చేపట్టిన మితవాద పక్ష ప్రణాళిక ఎదురుతన్నింది. 1980లలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ స్ఫూర్తితో 4500 కోట్ల పౌండ్ల (5 వేల కోట్ల డాలర్లు) మేర పన్నుల్లో కోతలు విధించారు. దానికి స్పందనగా విపణులు కుప్పకూలాయి. లక్షలాది బ్రిటన్ పౌరులకు అప్పుల ఖర్చు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయావకాశాలు పడిపోయాయి. లిజ్ పగ్గాలు చేపట్టి కొద్దివారాలైనా గడవక ముందే సొంత పార్టీలో బాహాటంగా అసంతృప్తి అగ్గి రాజుకుంది. చిత్రమేమిటంటే, లిజ్ ఆర్థిక అజెండాను సాక్షాత్తూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం విమర్శించడం! నాటకీయ పరిస్థితుల్లో సొంత స్నేహితుడిని ఆర్థిక మంత్రిగా తప్పించాల్సి రావడం బాధాకరమేనని లిజ్ సైతం అంగీకరిస్తున్నారు. నిజానికి, విమర్శలతో వెనక్కి తీసుకున్న ఆ ఆర్థిక ప్యాకేజీ రూపకర్తల్లో లిజ్కూ సమాన భాగం ఉంది. కాకపోతే ఆర్థికమంత్రి బలిపశువయ్యారు. కొత్తగా ఆ శాఖ చేపట్టిన జెరెమీ హంట్ పని కత్తి మీద సామే. బ్రిటన్ దేశస్థులను వేధిస్తున్న జీవన వ్యయానికి పరిష్కారం చూపడం పెద్ద పనే. ఈ అక్టోబర్ 31న కొత్త బడ్జెట్ ప్లాన్‌ను దేశానికి ఆయన అందించాల్సి ఉంటుంది. దేశంలో మరింత ఆర్థిక కష్టాలు తప్పవన్న విశ్లేషణల నేపథ్యంలో, గడ్డు పరిస్థితులను ప్రజలతో నిజాయతీగా పంచుకొని, కఠినమైన కార్యాచరణకు దిగక తప్పదు. గతంలో కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతం వద్దే స్తంభింప జేస్తామన్న లిజ్ వచ్చే ఏడాది దాన్ని 25 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. మరోపక్క ఇప్పటికే లిజ్ సొంత పార్టీ నుంచే కనీసం నలుగురు ఎంపీలు ఆమెను ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సిందిగా బాహాటంగా అన్నారు. ఆరు వారాలకే ఆమె పదవీకాలం దాదాపు ముగింపునకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమె తప్పుకొంటే వారసుడు నిర్ణయమయ్యే దాకా పదవిలో కొనసాగుతారు. అదే జరిగితే, రెండు నెలల లోపలే రెండోసారి కన్జర్వేటివ్ పార్టీ సారథికి ఎన్నిక తప్పదు. అయితే, ఈసారి సుదీర్ఘ పోటీ లేకుండా ఒకరి వెంటే పార్టీ నిలిచి, పట్టాభిషేకం చేయవచ్చు. బ్రెగ్జిట్ రిఫరెండమ్ పర్యవసానాల తర్వాత 2016లో డేవిడ్ కామెరాన్ స్థానంలో థెరెసా మే అలానే వచ్చారు. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేక వర్గాలుగా చీలి, అంతర్గత విభేదాలున్న పార్టీలో అది సాధ్యమా అన్నది చూడాలి. పరిస్థితి చూస్తుంటే, ప్రధాని పదవికి లిజ్‌తో పోటీపడి, తగిన మద్దతు కూడగట్టుకోలేకపోయిన సొంత పార్టీ నేత రిషీ సునాక్‌కు ఉన్నట్టుండి దశ తిరిగేలా కనిపిస్తోంది. లిజ్ స్థానంలోకి రేపో, మాపో ఆయన వస్తారనే అంచనాలూ సాగుతున్నాయి. ప్రస్తుతానికి రిషి పెదవి విప్పడం లేదు. అంచనాలెలా ఉన్నా లిజ్ అంత తేలిగ్గా రాజీనామా చేయకపోవచ్చు. ప్రస్తుతానికి ఆమె దృష్టి సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడం మీదే ఉన్నట్టుంది. ఒకవేళ లిజ్‌ను బలవంతాన సారథ్యం నుంచి తప్పించాలంటే, అవిశ్వాస తీర్మానం పెట్టాలి. కానీ, 12 నెలల కాలంలో ఒకసారే పోటీ జరగాలనే కన్జర్వేటివ్ పార్టీ నియమావళి ప్రకారం కొత్తగా ఎన్నికైన నేతపై సహచరులు అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా, తొందరపాటు మినీ బడ్జెట్ ప్రతిపాదనలతో విశ్వసనీయత దెబ్బతిన్న లిజ్ ప్రస్తుత గండం నుంచి గట్టెక్కితే ఆశ్చర్యమే. కాకపోతే ఆ ఆర్థిక ప్రతిపాదనల ఉప సంహరణతో ఆర్థిక మార్కెట్లు కొంత తెరిపినపడ్డాయి. కొద్దిపాటి ఆర్థిక స్థిరత్వంతో ఊపిరి పీల్చుకొనే ఖాళీ దొరికింది గనక ఇప్పుడామె ఏవైనా అద్భుతాలు చేయాలి. సోమవారం రాత్రి క్యాబినెట్కిస్తున్న విందులో పార్టీలోని అసంతృప్త వర్గాలను కలిసి ఆమె చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. మరో ఛాన్స్ ఏమిటంటే, 2025 జనవరిలో జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలను ముందే జరపడం. ఎన్నికల సర్వేలలో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నవేళ అధికార పార్టీ ఎంపీలు ఆ సాహసానికి దిగుతారనుకోలేం. తప్పుడు రాజకీయ నిర్ణయాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయనడానికి బ్రిటన్ తాజా ఉదాహరణ. కోవిడ్ టీకాలు, కరోనా వేళ విందులతో పార్టీ ప్రతిష్ఠనూ, వచ్చే ఎన్నికల్లో విజయావకా శాలనూ జాన్సన్ దిగజారిస్తే, ఆశాకిరణమనుకున్న లిజ్ తప్పుడు విధానాలతో అసలే ఆర్థిక సంక్షో భంలో ఉన్న దేశాన్ని ఇంకా కిందకు నెట్టారు. ద్రవ్యోల్బణాన్నీ, యుద్ధంతో పైపైకి ఎగబాకుతున్న చమురు ధరల్ని అడ్డుకొనే చర్యలకు బదులు పన్నుల కోతకు దిగారు. తీరా చివరికి కోతల్ని ఉపసంహ రించుకొని, ఎన్నడూ లేని ‘యూ’ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. లిజ్ పుణ్యమా అని పాత అప్రతిష్ఠకు తోడు అసమర్థ ప్రభుత్వమనే ముద్ర పడింది. కథలో కొత్త మలుపు ఏమిటన్నది ఆసక్తిగా మారింది. -
డోంట్ కేర్.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది. ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా! -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రిషి సునాక్‌ను ప్రధాని చేసేందుకు కుట్ర!
లండన్: యూకే సంక్షోభం నడుమ ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్‌ను దించేసి.. రిషి సునాక్‌తో భర్తీ చేయడానికి రెబెల్స్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెజార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెబల్స్ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. అయితే.. కన్జర్వేటివ్ పార్టీలో ఈ పరిణామాలేవీ సహించడం లేదు. ప్రత్యేకించి రెబల్స్ మాత్రం లిజ్ ట్రస్‌ను పార్టీ నేతగా తప్పించి.. మాజీ ప్రధాని ప్రత్యర్థి రిషి సునాక్‌ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని ది టైమ్స్ YouGov పోల్ వెల్లడించింది. అంతేకాదు కన్జర్వేటివ్‌లో సగం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలోకి చేరుకున్నట్లు ఆ పోల్ సర్వే తెలిపింది. సుమారు 62 శాతం మంది తమది రాంగ్ ఛాయిస్ అయ్యిందనే పశ్చాత్తంలో ఉండిపోయారట. ఇక.. 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందే అనే అభిప్రాయం వ్యక్తం చేశారట. అదే సమయంలో రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలన సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని.. అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ సైతం ఉన్నారని ఆ పోల్ వెల్లడించింది. అయితే యూకే చట్టాల ప్రకారం టెక్నికల్‌గా లిజ్ ట్రస్‌కి ఏడాదిపాటు పదవి గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. ఇదికాగా.. నేరుగా పెన్నీ మోర్డాంట్ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, ఇదంతా సులభమైన విషయమేమీ కాదని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారు, ఎంపీ నాడైన్ డోరీస్ చెప్తున్నారు. అదే సమయంలో అధికార మార్పు అనుకున్నంత ఈజీనే అంటూ కన్జర్వేటివ్ సీనియర్ సభ్యులు ఒకరు చేసిన వ్యాఖ్యల్ని ది టైమ్స్ కథనం ఉటంకించింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన -
బ్రిటన్ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు
లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్ ట్రస్ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. -
‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై ఫైర్
లండన్: బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాణి అంత్యక్రియల ఈవెంట్‌ను కవరేజ్ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్-9.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్ ట్రేసీ గ్రిమ్షా, పీటర్ ఓవర్టన్‌లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్మిన్స్టర్ అబేకు వచ్చారు లిజ్ ట్రస్. కారు నుంచి బయటకు వచ్చిన లిజ్ ట్రస్‌ను ఉద్దేశించి గ్రిమ్ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్‌రాయల్స్(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్షా బదులిచ్చారు. అయితే.. I present, for your viewing pleasure, footage of Liz Truss getting out of a car, and Australian media being like, “Who the fuck is that?” Perfect.pic.twitter.com/dxNhdolvtK — Fancy Brenda 🏳️🌈🏳️⚧️ (they/them) (@SpillerOfTea) September 19, 2022 వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్ ట్రస్ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్‌లు యూకే ప్రధానిని ‘మైనర్‌రాయల్స్’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్‌కు ఆమాత్రం లిజ్ ట్రస్ తెలీదా అంటూ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ తదనంతరం.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్‌ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 6వ తేదీన ఆమె బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్ ఖండన -
ఈ ఓటమి స్వయంకృతమే!
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో హోరాహోరీ పోరులో ఓడిపోయారు. ఆయన ఓటమిలో జాతి, మతం కూడా తమ వంతు పాత్ర పోషించాయని కొందరు అంటున్నారు (తాను హిందువును అని సునాక్ చెప్పుకొన్నారు). కానీ బ్రిటన్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతేతరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఇది కన్జర్వేటివ్ పార్టీ ధోరణికి భిన్నం. అలాగే బోరిస్ జాన్సన్ గద్దె దిగిపోయేలా సునాక్ మొట్టమొదట రాజీనామా చేయడం కూడా జాన్సన్ మద్దతుదారుల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదే సమయంలో లిజ్ ట్రస్ చివరిదాకా జాన్సన్‌కు మద్దతిచ్చారు. పార్టీ సభ్యులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే సునాక్ ఓటమికి కారణం. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలో రిషీ సునాక్ ఓడిపోవడానికి జాతి, మతం కూడా తమదైన పాత్ర పోషిం చాయా అంటే మనకు ఎన్నటికీ కచ్చితంగా తెలీకపోవచ్చు. రిషి ఓటమికి ఇవి కూడా పనిచేశాయని నొక్కి చెప్పేవారు, ఇవి కారణాలు కావు అని చెబితే సమాధానపడరు. అయితే ఆయన ఓటమికి ఇవి కారణాలు కావు అని చెప్పేవారు దాన్ని నిరూ పించలేరు. నా ఊహ ఏమిటంటే, తన ఓటమికి జాతి, మతం కూడా కారణాలు అయివుండవచ్చు కానీ వాటికి అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. లేదా రిషి ఓడిపోవడానికి అవే ప్రధాన కారణం కావచ్చు కూడా! అయితే నిజం ఏమిటంటే, చాలామంది ప్రజలు నమ్ము తున్నట్లుగానే బ్రిటన్ ప్రస్తుతం చాలా విభిన్నమైన దేశంగా మారి పోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతే తరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. ఈ విషయం అర్థం కావడానికి మీరు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ మంత్రివర్గాలను చూడండి. అలాగే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ‘బీబీసీ’ ఛానల్లో మనకు కనబడే ముఖాలను చూడండి. తర్వాత ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తారు. (అమెరికన్ యువతి మేఘన్ మెర్కెల్ బ్రిటిష్ రాజవంశంలోని ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన తర్వాత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెను ససెక్స్ యువ రాణిగా ప్రకటించారంటే బ్రిటిష్ సమాజంలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనం అన్నమాట.) అందుకనే రిషీ సునాక్ ఓటమికి కారణాలు అనేకం అని నేను నమ్ముతున్నాను. ఆర్థికమంత్రిగా రిషి ట్రాక్ రికార్డులో గానీ, బహుశా ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రదర్శించిన వ్యక్తిత్వంలో గానీ, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత దిగ్భ్రాంతి కరమైన పతనానికి దారితీసేలా తన మంత్రిపదవికి ఇచ్చిన రాజీ నామాలో గానీ మనం రిషి శైలినీ, మూర్తిమత్వాన్నీ చూడవచ్చు. రిషికి అదృష్టం ముఖం చాటేసిందని చెప్పడం కంటే బహుశా ఆయనదే తప్పు అయివుండొచ్చు. బ్రిటన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి రిషి ఇష్టపడకపోవడమే ఆయన తప్పు కావచ్చు. ప్రధానంగా పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. కన్జర్వేటివ్ పార్టీని సాధారణంగా పన్నులు తక్కువగా విధించే పార్టీగా చెబుతుంటారు. ఇది వారికి ఒక పవిత్ర విశ్వాసం లాంటిది. కానీ ఆర్థిక మంత్రిగా సునాక్ పన్నులను గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని మాత్రమే ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరోవైపున ఆయన ప్రత్యర్థి ట్రస్ మాత్రం తన ప్రచార తొలిదశలోనే పన్నులను బాగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. సునాక్ చెప్పింది సరైనదేనని చాలామంది ఆర్థికవేత్తలు, పారిశ్రా మికవేత్తలు నమ్ముతున్నారు. లండన్ ప్రజలు కూడా సునాక్ వాదనను సమర్థించారని ‘వెంబ్లే ర్యాలీ’ సూచిస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ ఎన్నికల ప్రచారం అయినట్లయితే సునాక్ సులువుగా గెలిచేవారు. ఆయన వైఖరిని దేశం అంగీకరించేది. కానీ ఇది జాతీయ ఎన్నిక కాదు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఎన్నిక. వీరు బ్రిటన్ లోని జిల్లా కేంద్రాల్లో నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది ముసలి వారు. వీరు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. అందుకే లిజ్ ట్రస్ ఇచ్చిన సందేశం వీరిని నేరుగా తాకింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని ఎన్నికలో వీరే ముఖ్యమైన ఓటర్లు మరి. మరొక కారణం ఏమిటంటే, బోరిస్ జాన్సన్‌కు విశ్వసనీయమైన మద్దతుదారులు సునాక్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే తమ మనిషిని, తమ నాయకుడిని గద్దె దింపిన ఘటనలకు రిషీనే బాధ్యు డని వీరు నమ్మారు. టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యులలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బోరిస్ జాన్సనే అని పోల్స్ సూచి స్తున్నాయి. సునాక్ కానీ, ట్రస్ కానీ ఈయనతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నారు. పైగా మరోసారి పోటీపడి గెలిచి ప్రధాని పదవి చేపట్టాలని జాన్సన్ భావిస్తున్నట్లు ‘ద టైమ్స్’ పత్రిక కూడా సూచిస్తోంది. కాబట్టి బోరిస్ జాన్సన్ మంత్రివర్గం నుంచి మొట్టమొదట రాజీనామా చేసినదానికి రిషి ఫలితం అనుభవించినట్లు కనిపిస్తోంది. మరోవైపున లిజ్ ట్రస్ తన నాయకుడు జాన్సన్ పట్ల చివరివరకూ విశ్వాసం ప్రకటించారు. అలా బహుశా ప్రయోజనం పొందివుంటారు. మూడో కారణం సునాక్ శైలి, వ్యక్తిత్వంలో దాగి ఉంది. చిన్నచిన్న అంశాలలో కూడా ఇది ఒక సమస్యగా మారింది. కానీ ఇది మరో ఆందోళనకు దారితీసింది. ఉదాహరణకు, మొట్టమొదటి చర్చలో రిషిని అహంభావిగా టోరీ ఓటర్లు భావించారు. తాను చెబుతున్నదే సరైనది అని భావిస్తున్నాడని రిషి గురించి అనేకమంది ఆరోపించారు. పైగా గత ఆరు వారా లుగా రిషి ఆరోగ్యం గురించి అనేకమంది ప్రశ్నలు సంధిం చారు. నిస్సందేహంగా ఆయన ఆ ప్రశ్నలకు సమర్థంగా జవాబి చ్చారు. కానీ ఓటర్ల సందేహాలు సమసిపోలేదు. ప్రత్యేకించి సునాక్ శైలి, వ్యక్తిత్వం తన సొంత టీమ్‌లోనే భయాందోళనలు కలిగించినట్లుందని ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక నివే దించింది. ఈ పత్రిక ప్రకారం తన ప్రచారం తొలి దశలో రిషీ సునాక్ పదేపదే క్యాలిఫోర్నియా గురించి ప్రస్తావించడంతో పరిస్థితులు తప్పు దోవ పడుతున్నాయని ఆయన సొంత టీమ్‌లోనే భయం పుట్టు కొచ్చింది. క్యాలిఫోర్నియా తరహా వాణిజ్య సంస్కృతి పట్ల తన ఆరా ధనను రిషి ఏమాత్రం దాచుకోలేదు. దీంతో క్షేత్రస్థాయి టోరీ పార్టీ సభ్యులకు ఆయన దూరమైపోయాడని చెబుతున్నారు. కాబట్టి సునాక్ జాతి మూలం ఆందోళన కలిగిస్తున్నట్లయితే, అది అంత ప్రాధాన్యం కలిగిన విషయమా అని నేను సందేహ పడుతున్నాను. దాదాపుగా ఇది ప్రతి ఒక్కరికీ వర్తించవచ్చు కూడా! ఇప్పుడు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా, లిజ్ ట్రస్ ఎలా పనిచేస్తారనే అంశంపైనే రిషీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లిజ్ గెలిచినప్పటికీ, ఆమె ప్రధాన మంత్రిగా తగినంత ఆత్మవిశ్వాసంతో లేరని పోల్స్ సూచించాయి. ఇలాగే కొనసాగితే 2024లో ఆమె లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్‌కు తన పదవిని కోల్పోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే సునాక్ మళ్లీ పోటీ చేయడానికి దారి దొరుకుతుందని చెప్పవచ్చు. రిషీ సునాక్‌కు ఇప్పుడు 42 సంవత్సరాలు. 2029 వరకు ఆయన వేచి ఉండాల్సి వస్తే అప్పటికి కూడా తాను 50 ఏళ్ల వయసు లోపే ఉంటారు. వెనుక బెంచీల్లో కూర్చోవాలని రిషి తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుపై అతడు ఒక కన్నేసి ఉంచాడనేందుకు సంకేతంగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
బ్రిటన్ చరిత్రలో తొలిసారి.. కేబినెట్లో కీలక పదవులన్నీ వాళ్లకే..
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బుధవారం తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి విభిన్నమైన కేబినెట్‌ను ప్రకటించిన తర్వాత ఈ భేటీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక శాఖల బాధ్యతలను మైనార్టీ వర్గాలకే కేటాయించారు ట్రస్. దీంతో తొలిసారి శ్వేత జాతీయులు కీలక హోదాలో లేకుండా బ్రిటన్ కేబినెట్ ఏర్పాటు జరిగింది. రిషి సునాక్ టీంకు నో ఛాన్స్ అందరూ ఊహించినట్లుగానే ట్రస్ కేబినెట్లో భారత సంతతికి చెందిన, ప్రధాని పదవికి పోటీ పడిన రిషి సునాక్‌కు చోటు దక్కలేదు. ట్రస్ మంత్రివర్గంలో ఉండబోనని రిషి ముందుగానే చెప్పారు. అందుకు తగినట్లుగానే ట్రస్ ఆయనకు మొండిచేయి చూపారు. అంతేకాదు రిషికి మద్దతుగా నిలిచిన మాజీ మంత్రుల్లో ఏ ఒక్కరిని ట్రస్ తన కేబినెట్లోకి తీసుకోలేదు. దీంతో వారంతా ఏ పదవీ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన సుయెళ్లా బ్రవర్మన్కు హోంమంత్రిగా అవకాశం దక్కింది. ఆగ్రాలో పుట్టిన మరో భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మకు కూడా చోటు లభించింది. భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనాకు పర్యావరణ మంత్రిగా స్థానం దక్కింది. చదవండి: దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు.. -
Liz Truss: తక్షణమే అందుకు రంగంలోకి దిగుతా
బ్రిటన్ను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు తన వద్ద సాహసోపేత ప్రణాళికలున్నాయని ట్రస్ ప్రకటించారు. పన్ను కోతలు, సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘అత్యంత కీలక సమయంలో దేశ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంధన కొరత వంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటాం. అందరికీ ఆశించిన అవకాశాలు, అత్యధిక వేతనాలు, సురక్షిత వీధులతో కూడిన ఆకాంక్షల దేశంగా బ్రిటన్ను తీర్చిదిద్దుతా. తక్షణమే అందుకు రంగంలోకి దిగుతా’’ అని ప్రకటించారు. పలువురు ఎంపీలు వర్షంలో తడుస్తూనే ప్రసంగం విన్నారు. చదవండి: (పగ్గాలు చేపట్టిన లిజ్) -
బ్రిటన్ కొత్త ప్రధాని మేరీ ఎలిజబెత్ ట్రస్
-
పగ్గాలు చేపట్టిన లిజ్
లండన్: హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్2 లాంఛనంగా నియమించారు. ట్రస్ మంగళవారం స్కాట్లండ్ వెళ్లి అక్కడి బాల్మోరల్ క్యాజిల్‌లో వేసవి విడిదిలో సేదదీరుతున్న 96 ఏళ్ల రాణితో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు. కొత్త ప్రధానిని ప్రభుత్వ ఏర్పాటుకు రాణి ఆహ్వానించే ప్రక్రియ లండన్‌లోని బకింగ్‌హం ప్యాలెస్‌లో జరగడం ఆనవాయితీ. కానీ వృద్ధాప్యంతో రాణి ప్రయాణాలు బాగా తగ్గించుకున్నారు. దాంతో తొలిసారిగా వేదిక బాల్మోరల్ క్యాజిల్‌కు మారింది. ఎలిజబెత్2 హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్ లండన్ తిరిగి వచ్చారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్‌ను ఆమె ప్రకటించనున్నారు. భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బెవర్మన్‌ను హోం మంత్రిగా ట్రస్ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్‌తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘ఆట మధ్యలో నిబంధనలు మర్చేయడం ద్వారా’ సహచర పార్టీ నేతలే తనను బలవంతంగా సాగనంపారంటూ ఆక్రోశించారు. తనను తాను అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసిన బూస్టర్ రాకెట్‌గా అభివర్ణించుకున్నారు. మున్ముందు కూడా అవసరాన్ని బట్టి తళుక్కుమని మెరుస్తుంటానని చమత్కరించారు. ట్రస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. -
లిజ్ ట్రస్‌కు ఇది ముళ్ళకిరీటమే!
బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు. కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి. పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ. మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా. అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే! ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! -
ఊహించని ట్విస్ట్.. ప్రీతి పటేల్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ నమ్మినబంటు అయిన ప్రీతి పటేల్.. లిజ్ ట్రస్ హయాంలోనూ బ్రిటన్ హోం సెక్రటరీగా కొనసాగుతారని భావించారంతా. అయితే.. పదవికి రాజీనామానే చేయాలని నిర్ణయించుకుని ఆమె కన్జర్వేటివ్ పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అంతేకాదు.. లిజ్ ట్రస్ నేతృత్వంలోని కేబినెట్లో తాను పని చేయబోనంటూ పరోక్షంగా ఆమె ప్రకటించారు కూడా. ఈ మేరకు ప్రధాని పీఠం నుంచి దిగిపోతున్న బోరిస్ జాన్సన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఛాయిస్. లిజ్ ట్రస్ అధికారికంగా ప్రధాని పదవి చేపట్టగానే.. కొత్త హోం సెక్రటరీ నియమితులవుతారంటూ లేఖ రాసి ఆసక్తికర చర్చకు దారి తీశారామె. కన్జర్వేటివ్ పార్టీలో లిజ్ ట్రస్, ప్రీతి పటేల్‌కు పోసగదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం లిజ్ ట్రస్ బ్రిటన్ అధ్యక ఎన్నికల్లో గెలిచారన్న ప్రకటన తర్వాత.. ప్రీతీ పటేల్, ట్రస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త ప్రధానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మూడేళ్లుగా హోం సెక్రటరీ బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారామె. దీంతో.. తర్వాతి హోం సెక్రటరీగా కూడా ఆమె కొనసాగుతారని అంతా భావించారు. అయితే లిజ్ ట్రస్ హయాంలో పని చేయడం ఇష్టం లేకనే ఆమె రాజీనామా చేసినట్లు.. ఆమె అనుచర వర్గం అంటోంది. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్.. సుదీర్ఘకాలం బ్రిటన్ రాజకీయాల్లో కొనసాగారు. 1991లో పటేల్ కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. 2010లో ఆమె తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలో ఆమె సీనియర్ సభ్యురాలిగా ఉన్నారు. 2019 నుంచి యూకేకు హోం సెక్రటరీగా పని చేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో ప్రధాని అభ్యర్థిత్వం రేసులో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. బోరిస్ నమ్మినబంటుగా, బ్రెగ్జిట్ క్యాంపెయిన్‌లోనూ పటేల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. ప్రధాని అభ్యర్థి రేసు నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు లిజ్ ట్రస్ చేతిలో ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు.. కేబినెట్ బెర్త్ దక్కడం అనుమానంగానే మారింది. అయితే రిషి సునాక్ మద్దతుదారులకు మాత్రం కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్- కిమ్ జోంగ్ ఉన్ చేతులు కలిపిన వేళ.. -
బ్రిటన్ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె నాయకత్వంలో భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. ప్రధానిగా కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. Congratulations @trussliz for being chosen to be the next PM of the UK. Confident that under your leadership, the India-UK Comprehensive Strategic Partnership will be further strengthened. Wish you the very best for your new role and responsibilities. — Narendra Modi (@narendramodi) September 5, 2022 బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాన్పై లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ఆమెవైపే మొగ్గుచూపారు. ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషికి 60,399 ఓట్లు వచ్చాయి. అధికారిక ఫలితాలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. ప్రధానిగా ట్రస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం -
UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్ (లిజ్) ట్రస్ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్ జాన్సన్ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ట్రస్ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్ కింగ్డమ్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. రిషి సంచలనం పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్ అనూహ్యంగా దూసుకెళ్లారు. 1,72,437 లక్షల కన్జర్వేటివ్ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి... బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా తల్లి నర్స్ టీచర్. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్ఫోక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్–ఇంగ్లండ్ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని ట్రస్ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్ పేరుబడ్డారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ వస్త్రధారణను అనుకరించారు. -
Rishi Sunak: వెన్నుపోటు ఫలితమే.. ఈ ఓటమి!
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనుకున్న రిషి సునాక్ కల చెదిరింది. ప్రధాని రేసులో లిజ్ ట్రస్ చేతిలో 21వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే ముందుగా ప్రచారం ప్రారంభించింది రిషి సునాక్. పైగా ఆయన దూకుడు చూసి చాలామంది ఆయనే నెగ్గుతారని భావించారు కూడా. దీనికి తోడు.. విదేశాంగ మంత్రి అయిన ట్రస్‌కు.. టోరీ(కన్జర్వేటివ్) ఎంపీల సపోర్ట్ కూడా మొదట్లో తక్కువే ఉండేది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల సీన్ రివర్స్ అయ్యింది. ట్రస్‌కు క్రమక్రమంగా ఆధిక్యం పెరగుతూ వచ్చింది. మరోవైపు సర్వే ఫలితాలు కూడా ట్రస్‌కే మద్దతుగా వచ్చాయి. అయినప్పటికీ రిషి సునాక్ ధైర్యం వీడలేదు.. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. అధికారంలోకి రాగానే.. పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ చెప్పగా, సునాక్ మాత్రం ఆమెది తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం ద్రవ్యోల్బణం కట్టడి మీదే ప్రధానంగా దృష్టిసారిస్తానని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే పోటాపోటీగా ప్రచారం కార్యక్రమాలు సాగినా.. గ్రాండ్ ప్రచారంతో ఆకట్టుకున్నా.. రిషి సునాక్‌కు ‘ప్చ్’ ఓటమి మాత్రం తప్పలేదు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది?.. రిషి సునాక్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్ జాన్సన్)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్ ఓటమి ఖాయమైంది. బోరిస్ సింపథీ వర్కవుట్ రిషి సునాక్ మంచి సేల్స్‌మ్యాన్.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్. సాజిద్ జావిద్, రిషి సునాక్లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్. ఈ తరుణంలో.. లక్ష్యం కాదు.. విశ్వాస ఘాతుకం బ్రెగ్జిట్ సమయంలో, కరోనాను కంట్రోల్ చేయడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో 10 డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి. వివాదాలు.. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి అనే టాప్ జాబ్ రేసులోకి ఎంటర్ కాకముందే నుంచే.. సునాక్ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా. ► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది. ► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్. వ్యాక్సిన్ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది. ► నార్త్ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఇక ఓటమిపాలైతే.. ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని, ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్మండ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని, నియోజకవర్గం కోసం పని చేస్తానని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఓటమి తర్వాత.. తనకు ఓటేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కన్జర్వేటివ్ అంతా ఒక కుటుంబం అని, లిజ్ ట్రస్ కింద పని చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. -
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
-
బ్రిటన్ ప్రధానిగా నెగ్గిన లిజ్ ట్రస్
లండన్: ఉత్కంఠ వీడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో లిజ్ ట్రస్(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్ గ్రాహం బ్రాడీ. ట్రస్ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌తో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా ట్రస్ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్ నెగ్గినట్లయ్యింది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది విదేశాంగ మంత్రి అయిన లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకున్నారు. #WATCH | Liz Truss defeats rival Rishi Sunak to become the new Prime Minister of the United Kingdom pic.twitter.com/Xs4q2A2ldu — ANI (@ANI) September 5, 2022 ఇదీ చదవండి: ఆ కౌగిలింత.. తీవ్ర విమర్శలు -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్‌కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్‌షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
Rishi Sunak: చివరి ప్రచార ప్రసంగంలో భావోద్వేగం
లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమం కూడా కోలాహలంగా ముగిసింది. బుధవారం రాత్రి లండన్ వెంబ్లే వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లిజ్ ట్రస్- రిషి సునాక్‌లు పోటాపోటీగా తమ వాగ్దాటిని ప్రదర్శించి.. మెప్పించారు. ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదుగానీ.. ఈ ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్‌కు దక్కిన స్పందన మాత్రం అమోఘంగా ఉంది. ఇక ఈ వేదికగా బ్రిటన్ ప్రజలతో పాటు కుటుంబం కోసం కూడా ఓ భావోద్వేగ ప్రకటన చేశారు అభ్యర్థి రిషి సునాక్. ప్రధాని ఎన్నికల్లో ఉన్న తనకు మద్దతుగా నిలిచినందుకుగానూ తల్లిదండ్రులు, భార్య అక్షతా మూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు రిషి సునాక్. ‘‘ఈ ప్రసంగ వేదిక నాకెంతో ప్రత్యేకం. ప్రజా సేవలోకి రావడానికి నన్ను ప్రేరేపించిన నా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. విలువలు, కఠోర శ్రమ నాకు నేర్పించి.. నాలో నమ్మకాన్ని నింపినందుకు అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. కృషి, నమ్మకం మీ ప్రేమతో మన గొప్ప దేశంలో ఎవరైనా సాధించగలిగే వాటికి పరిమితి లేదన్న విషయాన్ని నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు అని రిషి పేర్కొన్నారు. అలాగే భార్య అక్షతను ఉద్దేశిస్తూ.. నా ఉద్దేశ్యం ఏమిటో మీకు తెలుసు. పద్దెనిమిదేళ్ల కిందట.. హైహీల్స్‌ను వదిలేసి.. తగిలించుకునే బ్యాగుతో పొట్టి పిల్లవాడిని ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞుడుని అంటూ సరదాగా మాట్లాడారాయన. ఇక ప్రసంగ సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నేను చేసిన గొప్ప త్యాగం ఏమిటంటే, నేను గత రెండు సంవత్సరాలుగా భయంకరమైన భర్త, తండ్రిగా బాధ్యతలు నిర్వహించాను అంటూ బదులిచ్చారు. ఇదేం కష్టమైన విషయమా? అని అనిపించొచ్చు. కానీ, ఇది నాకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను నా భార్యాపిల్లలకు ఎక్కువ ప్రేమను పంచలేకపోయాను. దురదృష్టవశాత్తు, గత కొన్ని సంవత్సరాలుగా నేను వాళ్ల జీవితాల్లో నేను ఇష్టపడేంతగా ఉండలేకపోయాను అని చెప్పుకొచ్చారు రిషి సునాక్. నేను ప్రజలు వినాలనుకునే విషయాలను చెప్పట్లేదు.. మన దేశం వినాలని నేను నమ్ముతున్న విషయాలను చెప్పాను అని ప్రసంగం చివర్లో రిషి సునాక్ పేర్కొన్నారు. ఈయన ప్రసంగం కొనసాగుతున్నంత సేపు అక్కడ కోలాహలం నెలకొనడం విశేషం. రిషి సునాక్-లిజ్ ట్రస్ ఇంగ్లండ్‌లోని సౌతంప్టన్ భారత సంతతికి చెందిన డాక్టర్(జనరల్ ప్రాక్టీషనర్) యశ్వీర్, తల్లి ఉష ఫార్మసిస్ట్ దంపతులకు జన్మించారు రిషి సునాక్(42). స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివే సమయంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి-సుధా మూర్తి కూతురైన అక్షతాతో పరిచయం ఏర్పడింది. 2009లో రిషి సునాక్-అక్షతా వివాహం జరిగింది. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి ఎవరనేది సోమవారం(సెప్టెంబర్ 5న) తేలనుంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ ల మధ్య మెరుగైన అభ్యర్థిని తేల్చడానికి 1.75 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో శుక్రవారం పాల్గొంటారు. చిత్తశుద్ధితో చెబుతున్నా.. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓ కుటుంబంలా మారదాం, వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిద్దాం. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకెలాంటి సందేహంలేదు. అయితే, మనం నిజాయతీతో, విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. నా వద్ద కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, విలువలతో కూడిన సరైన ప్రణాళిక ఉంది. నేను మొదటి నుంచి స్థిరంగా, చిత్తశుద్ధితో చెబుతున్నాను... మనం ముందు పరిష్కరించాల్సింది ద్రవ్యోల్బణం అంశాన్ని. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమవుతుంది. తక్కువ పన్నులు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, సవ్యమైన ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఫలాల సంపూర్ణ సద్వినియోగం, అభివృద్ధి, సమగ్రతల దిశగా పటిష్ఠ పునాది వేసుకోవడానికి ఇదే మార్గం అని ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇదీ చదవండి: గర్భిణి మృతితో ఆరోగ్యమంత్రి రాజీనామా -
బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ గోపూజ
లండన్: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రిషి సునాక్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా లండన్‌లో రిషి సునాక్(42) గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లండన్ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్ తన అధికారిక పేజీలో వివరించింది. అంతేకాదు.. స్వయంగా రిషి సునాక్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫొటోలను ఉంచారు. Who? Rishi Sunak (PM candidate) Where ? London, England What ? Performing Cow worship That’s our rich cultural heritage we must be proud about. तत् त्वम असि = Tat twam asi #Hinduism #Rishisunak #India #London #Hindutva pic.twitter.com/aaKdz9UM5R — Sumit Arora (@LawgicallyLegal) August 25, 2022 ఇదిలా ఉంటే.. చెకర్ ఛాన్స్‌లర్‌గా ఉన్న టైంలో 2020 దీపావళి వేడుకల్లో రిషి సునాక్ పాల్గొన్నారు. లాక్డౌన్ ఆంక్షల నడుమ దీపాలను వెలిగించి వేడుకల్లో ఆయన పాల్గొన్న తీరుపై అక్కడ విమర్శలు ఎదురైనా.. భారత్ నుంచి మాత్రం మంచి మద్దతే లభించింది. ఎక్కడికెళ్లినా భారతీయులు కొందరు తమ సంప్రదాయం, ఆచార వ్యవహారాలను మరిచిపోరని.. రిషి కుటుంబం అందుకు మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) ఇదీ చదవండి: అక్కడ భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
రిషి సునాక్, లిజ్ ట్రస్ వద్దు.. మాకు బోరిస్ కావాలి!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు దగ్గర పడుతున్న వేళ.. కన్జర్వేటివ్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో దూసుకుపోయిన ప్రధాని అభ్యర్థి రిషి సునాక్.. ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో.. ప్రధాని రేసులో తెరపైకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు వచ్చింది. జాన్సన్‌ను PM రేసు నుండి తొలగించబడకూడదంటూ స్వింగ్ ఓటర్లు పట్టుబడుతున్నారు. అంతేకాదు.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు లిజ్ ట్రస్, రిషి సునాక్‌లపై తక్కువ నమ్మకాన్ని ఓటర్లు ప్రదర్శించారు. టోరీ సపోర్టర్స్(కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు)లో 49 శాతం మంది ఇప్పటికీ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ప్రధాని రేసు నుంచి తప్పించొద్దని, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల కంటే ఆయన మీదే తమకు నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. జాన్సన్‌ను తొలగించడం ద్వారా పార్టీ, ఎంపీల ప్రతిష్ట దెబ్బతిందని తాము నమ్ముతున్నామని పలు ఇంటర్వ్యూలలో అట్టడుగు నియోజకవర్గాల ఓటర్లు చెప్తుండడం విశేషం. ‘‘ఆయనలా(బోరిస్) ఇతరులు వ్యవహరిస్తారనే నమ్మకం మాకు లేదు. ఎందుకంటే.. బ్రెగ్జిట్ సమయంలో, కరోనా వైరస్ కట్టడి సమయంలో, చివరకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ తలెత్తిన పరిస్థితులను ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిన్న చిన్న కారణాలతోనే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆయనలా వీళ్లు పాలిస్తారని అనుకోవడం లేదు. ఆయనకు మరో అవకాశం ఇవ్వడం మంచిది’’ అని చాలామంది ఓటర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. లిజ్ ట్రస్ మరియు రిషి సునక్‌ల మద్దతు కంటే మిస్టర్ జాన్సన్ ప్రధానమంత్రిగా కొనసాగాలని 49 శాతం మంది టోరీ మద్దతుదారులు భావించారని yougov చేసిన ప్రత్యేక జాతీయ పోలింగ్ ద్వారా వెల్లడైంది. పైగా 2024 ఎన్నికల సమయంలో ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉంటేనే.. కన్జర్వేటివ్ పార్టీకి బాగా కలిసొస్తుందని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్వేను కన్జర్వేటివ్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటాదా? అనేది కచ్చితంగా చెప్పలేం. మరోవైపు బ్రిటన్ ప్రధాని రేసులో తుది జాబితాలో ఉన్న రిషి సునాక్, విదేశాంగ కార్యదర్శి లిజ్ టస్లు.. తమ తమ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ వినూత్న ప్రచారం! -
ప్రతి ఓటు కోసం చివరిదాకా పోరు: రిషి సునాక్
లండన్: అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్ వర్గం కొత్త తరహా ప్రచారాన్ని ప్రకటించింది. శుక్రవారం రాత్రి మాంచెస్టర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో రిషి పాల్గొన్నారు. ‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’అంటూ రిషి సునాక్ ట్వీట్ చేస్తూ మాంచెస్టర్ ప్రచార వీడియోను విడుదల చేశారు. అందులో ‘అండర్ డాగ్‌తో జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే ఓటమి అంచున ఉన్న వాళ్లు పోగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. వారు కష్టపడి పని చేస్తారు, ఎక్కువసేపు ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. అండర్ డాగ్‌లు అవకాశాన్ని వదులుకోరు. కష్టపడి పని చేస్తూ.. ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందరు’’ అని వాయస్ ఓవర్ వినిపిస్తుంటుంది ఆ వీడియోలో. 🗓️ 30 days 💯 100 events 🫂 16,000 members 💪 and counting... I'll keep fighting for every vote until the final day.#Ready4Rishi 👇 pic.twitter.com/7GXaOOaUwm — Rishi Sunak (@RishiSunak) August 19, 2022 ఇదీ చదవండి: రిషి గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు -
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్ దంపతులు
Rishi Sunak Celebrate Sri Krishna Janmashtami.. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. భారతీయులందరూ ఎంతో భక్తి శ్రద్దలతో కృష్ణుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఆయన తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు సోషల్ మీడియాలో వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన వారి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ కృష్ణుడి పుట్టినరోజును జన్మాష్టమి పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా తన భార్య అక్షితతో కలిసి తాను గుడికి వెళ్లినట్లు రిషి తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. కాగా, బ్రిటన్ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్, రిషి సునాక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుత సర్వేల ప్రకారం.. రిషి సునాక్ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. UK PM contender Rishi Sunak visits temple with wife to celebrate Janmashtami Read @ANI Story | https://t.co/9k0ULR4wHR#Janmashtami #Janmashtami2022 #RishiSunak pic.twitter.com/uDAOX74hHi — ANI Digital (@ani_digital) August 19, 2022 -
UK PM Race: ఎవరెంత దూరం? బ్రిటన్ తదుపరి ప్రధానిపై ఉత్కంఠ
బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ మొదలైనప్పుడు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతీయ మూలాలున్న రిషి సునాక్ రేసులో వెనుకబడిపోతున్నారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ క్రమంగా ప్రధాని పీఠానికి దగ్గరవుతున్నట్టుగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజా సర్వేలో 58% మంది ట్రస్‌కు మద్దతుగా ఉంటే, సునాక్‌కు కేవలం 26% మంది సభ్యుల మద్దతు లభించింది. 12% మంది ఎటూ తేల్చుకోలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో స్కై న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషి సునాక్ అనూహ్యంగా విజయం సాధించడం ఆయనకి నైతికంగా బలం చేకూరింది. అయినప్పటికీ ప్రధాని పీఠం అంత సులభంగా దక్కేలా లేదు. ఇరువురు నేతలు వచ్చే నెలరోజుల్లో కనీసం మరో 10 సార్లు చర్చల్లో పాల్గొనాలి. ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఆకట్టుకునేలా చెప్పగలగాలి. దాదాపుగా లక్షా 80 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని మెప్పించగలగాలి. కోవిడ్ –19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో బ్రిటన్ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 9.4శాతానికి చేరుకుంది. ఇంధనం ధరలు ఆకాశాన్నంటడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ప్రజలు తీవ్ర అసహనంలో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగడంతో పాలనాపరంగానూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ రిషికి మంచి పట్టు ఉంది. దీంతో ఎంపీలంతా ఆయన వైపే ఉన్నప్పటికీ, టోరీ సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎన్నికల బ్యాలెట్ పత్రాలను పార్టీ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2న ఓటింగ్ జరుగుతుంది. 5న ఫలితాలు వెల్లడిస్తారు. రిషి ఎందుకు వెనుకబడ్డారు ? పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతానని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీతో ఒక్కసారిగా ఆమె హవా పెరిగింది. ఆదాయ పన్నులో కూడా రాయితీ ఇస్తానని ప్రకటించడం, రిషి ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడంతో వారి మధ్య పోటీ పెరిగింది. రిషితో పోల్చి చూస్తే ఎంపీల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత చేస్తున్న ప్రచారంలో వివిధ అంశాలపై ఆమె ఇస్తున్న హామీలు సభ్యుల్ని ఆకర్షిస్తున్నాయి. రిషిపై ఆగ్రహంతో ఉన్న బోరిస్ జాన్సన్ తెర వెనుక నుంచి లిజ్ ట్రస్‌కు మద్దతునిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. చర్చా కార్యక్రమాల్లో లిజ్ ట్రస్ మాజీ ప్రధాని థాచర్‌ను తలపించే ఆహార్యంతో ఉండడం, ఆదాయ పన్ను రాయితీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నారు. ట్రస్ స్థానికురాలు కావడం, రిషి తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని బహిరంగంగా చెబుతూ ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. రిషి జీవన విధానం చాలా లావిష్‌గా ఉంటుంది. దేశం ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న సమయంలో ఆయన 500 పౌండ్ల షూ వేసుకోవడం, కోట్ల ఖర్చుతో ఆధునిక వసతులతో ఇల్లు నిర్మించడం, భార్య అక్షతా మూర్తి విదేశీ కార్డుని అడ్డం పెట్టుకొని పన్నులు ఎగ్గొట్టడం వంటివి రిషిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న చర్యల్ని ప్రశంసిస్తున్న వారూ ఉన్నారు. వివిధ అంశాలపై వీరిద్దరి వైఖరి.. – నేషనల్ డెస్క్, సాక్షి -
రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తుది పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషీ సునాక్, లిజ్ ట్రస్ హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా స్కై టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషీ సునాక్‌కు అనూహ్య మద్దతు లభించింది. టీవీ డిబేట్‌ను స్టూడియోలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆయనవైపు మొగ్గుచూపారు. స్కై టీవీ డిబేట్లో గురువారం రిషీ సునాక్, లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెజెంటర్ కే బర్లీ... రిషీకి మద్దతు ఇస్తున్న వారిని చేతులు పైకి ఎత్తమనగా స్టూడియోలో ఉన్న దాదాపు అందరూ స్పందించారు. లిజ్ ట్రస్‌కు ఎంత మంది మద్దతు ఇస్తున్నారని అడగ్గా అంత అంతమాత్రం స్పందన లభించింది. దీంతో రిషీ, ట్రస్ సహా అక్కడున్నవారంతా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే రిషీ గెలిచే అవకాశాలు 10 శాతం మాత్రమే ఉన్నాయని బ్రిటన్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనేది సెప్టెంబర్ 5న తెలుస్తుంది. ఇక డిబేట్లో భాగంగా రిషీ సునాక్, లిజ్ ట్రస్ ఇద్దరూ కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. లండన్ బయట నివసించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని డిమాండ్ చేసి యూటర్న్ తీసుకోవడం గురించి లిజ్ ట్రస్‌ను ప్రశ్నించగా.. తన ప్రతిపాదనను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని సమాధానం ఇచ్చారు. మంచి నాయకులు తమ తప్పులను ఒప్పుంటారా, ఇతరులను నిందిస్తారా అని కే బర్లీ ఎదురు ప్రశ్న వేయగా.. తాను ఎవరినీ నిందిచడం లేదని, తాను ప్రతిపాదించిన విధానాన్ని వక్రీకరించారని చెబుతున్నానని లిజ్ ట్రస్ తడబడుతూ జవాబిచ్చారు. రష్యా దండయాత్రపై ఉక్రెయిన్ తరపున పోరాడేందుకు బ్రిట్స్‌కు మద్దతు ఇస్తానని చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆమె ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుత తరుణంలో బ్రిటీష్ ప్రజలు ఉక్రెయిన్‌కు వెళ్లకూడదనే ట్రావెల్ ఎడ్వైజరీ ఉందని గుర్తు చేశారు. రిషీ సునాక్ కూడా కే బర్లీ నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘మీరు ఖరీదైన ప్రాడా షూస్‌లో నడుస్తున్నందున వారి బూట్లు ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తున్నార’ని పశ్నించారు. బిలియనీర్ అయిన మామగారికి అల్లుడనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రశ్న అడిగ్గా.. ‘తాను ఎన్హెచ్ఎస్ కుటుంబంలో పెరిగానని, నా ప్రచారంలో ఈ విషయం గురించి మీరు వినే ఉంటార’ని రిషీ జవాబిచ్చారు. తన తండ్రి జాతీయ ఆరోగ్య సేవ(ఎన్హెచ్ఎస్)లో డాక్టర్‌గా పనిచేశారని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. కాగా, స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్లో ఎక్కువ మంది రిషీ సునాక్‌కు మద్దతు పలుకుతారని తాను అసలు ఊహించలేదని కే బర్లీ వ్యాఖ్యానించారు. (క్లిక్: మన రిషి గెలుస్తాడంటారా?) -
లిజ్ ట్రస్‌కే 90 శాతం విజయావకాశాలు
లండన్: బ్రిటిష్ ప్రధానమంత్రి పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇరువురు తమ పార్టీ సభ్యుల మద్దతు పొందడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే లిజ్ ట్రస్‌కే పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సర్వేల్లో ఆమె ముందంజలో ఉన్నట్లు తేలింది. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానంటూ ట్రస్ ఇస్తున్న హామీ వైపు అందరూ ఆకర్శితులవుతున్నట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఉన్నాయని ప్రఖ్యాత బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ ‘స్మార్కెట్స్’ తాజాగ ప్రకటించింది. రిషి సునాక్‌కు కేవలం 10 శాతం అవకాశాలే ఉన్నాయని స్పష్టం చేసింది. ట్రస్‌కు తొలుత 60 శాతం విజయావకాశాలు ఉండగా, అది ఇప్పుడు 90 శాతానికి చేరడం ఆసక్తికరంగా మారింది. ఇక రిషి విజయావకాశాలు 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయాయి. పరిస్థితులు మొత్తం ట్రస్‌కు క్రమంగా సానుకూలంగా మారుతున్నాయని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ అధినేత మాథ్యూ షాడిక్ చెప్పారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీవీ చర్చా కార్యక్రమాల్లో రిషి కంటే లిజ్ ట్రస్ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. తాను వెనుకంజలో ఉన్నా చివరి దాకా పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని రిషి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
లిజ్ ట్రసే బ్రిటన్ కొత్త ప్రధాని.. రిషికి 10 శాతమే ఛాన్స్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్‌లలో బోరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంది. రిషి కంటే ట్రస్‌కు ప్రధాని అయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఎక్కువ ఉన్నాయని చెబుతోంది. బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య గట్టి పోటీ ఉంటుందని తొలుత భావించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఎక్కువమంది రిషికే మద్దతుగా నిలిచినా.. పార్టీ సభ్యులు మాత్రం లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రస్‌కు 60శాతం, రిషికి 40 శాతం విజయావకాశాలు ఉంటాయని అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోరీ సభ్యులతో సమావేశాలు మొదలుపెట్టాక రిషి విజయావకాశాలు దారుణంగా 10 శాతానికి పడిపోయాయి. అయితే రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని రిషి సునాక్ అంగీకరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
Rishi Sunak: ఔను.. వెనుకంజలో ఉన్నా
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్ అంగీకరించారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు. రిషి, ట్రస్ గురువారం రాత్రి యార్క్‌షైర్‌లోని లీడ్స్ పట్టణంలో ఒకే వేదికపైకి వచ్చి తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి దక్కితే తాము అమలు చేయబోయే ఆర్థిక విధానాల గురించి వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ఈ సందర్భంగా రిషిని ఓ సభ్యుడు ప్రశ్నించారు. తద్వారా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆక్షేపించారు. ‘10, డౌనింగ్ స్ట్రీట్’ (ప్రధాని నివాసం)లో రిషిని చూడాలని జనం కోరుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలపై బోరిస్‌తో విభేదాలు తీవ్రతరం కావడం వల్ల రాజీనామా చేయక తప్పలేదని రిషి బదులిచ్చారు. అందుకు దారి తీసిన కారణాలను వివరించి ఆకట్టుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీలోని 1,75,000 మంది సభ్యులు పార్టీని నేత, తద్వారా తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 విజేతను ప్రకటిస్తారు. -
బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు. నార్త్ యార్క్‌షైర్ లీడ్స్‌లో వేదికగా జరిగిన ఈ కర్యక్రమంలో టోరీ సభ్యుల నుంచి రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వారంతా ప్రధాని బోరిస్ జాన్సన్ పట్ల తమ విధేయతను చాటుకుంటూ రిషిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 'మీరు మంచి సేల్స్‌మన్, బలమైన వ్యక్తి. కష్ట సమయంలో స్థిరంగా పాలన సాగించిన బోరిస్‌కు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ మీరు మాత్రం వెన్నుపోటు పొడిచారని చాలా మంది అనుకుంటున్నారు. మిమ్మల్ని సీనియర్ పొలిటీషియన్‌ను చేసింది బోరిసే' అని ఓ టోరీ సభ్యుడు రిషి సునాక్‌ను ప్రశ్నించారు. అయితే రిషి ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. గత్యంతరం లేకే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక విధానాలపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినందుకే అలా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే తాను అధికారంలోకి వస్తే పన్ను రాయితీ ఇస్తానని ప్రకటించిన లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలపైనా రిషి విమర్శలు గుప్పించారు. తాత్కాలిక ఉపశమనం కోసం పన్నుల్లో కోత విధించి తర్వాతి తరాల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని స్పష్టం చేశారు. చదవండి: లైవ్ ప్రోగ్రామ్‌లో కుప్పకూలిన యాంకర్.. సాయం చేసిన రిషి సునాక్ -
రిషి సునాక్ మంచి మనసు.. కళ్లుతిరిగి పడిపోయిన యాంకర్‌కు సాయం
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ మంచి మనసు చాటుకున్నారు. లైవ్ టీవీ ప్రోగ్రాంలో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయిన యాంకర్‌కు సాయం చేశారు. రిషి తన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌తో టీవీ డిబేట్లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 'టాల్క్ టీవీ' డిబేట్లో తాను గెలిస్తే చేపట్టే కార్యక్రమాలపై లిజ్ ట్రస్ వివరిస్తున్న సమయంలో ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యాంకర్.. ఒక్కసారిగా కళ్లుతిరిగిపడిపోయింది. దీంతో ట్రస్ షాక్‌కు గురయ్యారు. మరోవైపు రిషి మాత్రం యాంకర్ పడిపోతుండగానే హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A TV host faints during the UK's second leaders' debate between Liz Truss and Rishi Sunak pic.twitter.com/blovJGPiMK — TICKER NEWS (@tickerNEWSco) July 26, 2022 యాంకర్ బాగానే ఉన్నప్పటికీ అనుకోకుండా అలా జరిగిందని, ఆమె ప్రోగ్రాం కొనసాగించవద్దని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు డిబేట్‌ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రస్, రిషి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నుల్లో కోత విధిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంపైనే తాను దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు బ్రిటన్‌లోని పలు సర్వేలు లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. రిషిపై ట్రస్ 24 పాయింట్ల శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. చదవండి: కరోనా మూలాల గుట్టు విప్పిన అధ్యయనం.. వైరస్ పుట్టింది అక్కడే.. కానీ ల్యాబ్‌లో కాదు -
నేను అండర్డాగ్.. తక్కువ అంచనా వేయొద్దు: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్‌డాగ్‌గా అభివర్ణించుకున్నారు. కచ్చితంగా తాను గట్టి పోటీ ఇస్తానని పేర్కొన్నారు. కొన్ని శక్తులు తనతో పోటీపడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్నాయని, కానీ నిర్ణయం టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఎవర్ని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. రిషి సనాక్తో పోటీ పడుతున్న లిజ్ ట్రస్‌కే టోరీ సభ్యులు పట్టం గడుతున్నారని యూగో సర్వే గురువారం వెల్లడించింది. రిషిపై ట్రస్ 24 శాతం పాయింట్ల లీడ్‌లో ఉన్నట్లు ఆ పోల్ అంచనా వేసింది. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ తాను అండర్డాగ్నని చెప్పారు రిషి. సెంట్రల్ ఇంగ్లండ్ గ్రాంథమ్లో శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా రిషి, ట్రస్ నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రధానంగా పన్ను కోతలు, రక్షణ వ్యయం గురించే మాట్లాడుతున్నారు. తనను గెలిపిస్తే 2030 నాటికి రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతానని ట్రస్ ప్రకటించారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక నిర్వహణే అన్నింటికంటే ముఖ్యమని, ఆ తర్వాత పన్ను రాయితీలని పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. చదవండి: లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు! -
సీన్ రివర్స్.. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌ను వెనక్కినెట్టిన ట్రస్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు బ్రిటన్ 'యూగోవ్' సంస్థ సర్వే చెబుతోంది. ఇది బ్రిటన్‌లో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్, ఎనలిటిక్స్ సంస్థ. కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులు రిషి, లిజ్ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం గమనార్హం. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. 1.60 లక్ష మందికిపైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే తెలిపింది. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్‌లో రిషికి 137 మంది ఎంపీలు ఓటు వేయగా.. ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ టోరీ సభ్యుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదవండి: రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్!