రిషి సునక్
లండన్: భారత మూలాలు కలిగిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ఆయన తన లక్ష్యాలను స్పష్టం చేశారు. మాటలతో కాదు చేతలతో తానేంటో చూపిస్తానని ప్రకటించారు. లిజ్ ట్రస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని వెల్లడించారు. రిషి సునాక్ ప్రసంగంలోని 5 ప్రధానాంశాలు ఇవి...
1. బ్రిటన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా తలెత్తిన విపరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థ బలహీనపడింది.
2. బ్రిటన్‌ను అభివృద్ధి పథంలో నడపాలని లిజ్ ట్రస్ కోరుకున్నారు. గొప్ప లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేసిన ఆమెను మెచ్చుకోవాల్సిందే. కానీ లిజ్ ట్రస్ హయాంలో కొన్ని తప్పులు జరిగాయి.
3. నేను నా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే పని తక్షణమే ప్రారంభమవుతుంది.
4. ఆర్థిక స్థిరత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తాం. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నేను చేసిన ప్రయత్నాలను మీరంతా చూశారు.
5. మాటలతో కాదు నా పనితీరుతో మన దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి ప్రతిరోజు కష్టపడతాను. (క్లిక్ చేయండి: అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్)
Comments
Please login to add a commentAdd a comment