బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో హోరాహోరీ పోరులో ఓడిపోయారు. ఆయన ఓటమిలో జాతి, మతం కూడా తమ వంతు పాత్ర పోషించాయని కొందరు అంటున్నారు (తాను హిందువును అని సునాక్ చెప్పుకొన్నారు). కానీ బ్రిటన్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతేతరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఇది కన్జర్వేటివ్ పార్టీ ధోరణికి భిన్నం. అలాగే బోరిస్ జాన్సన్ గద్దె దిగిపోయేలా సునాక్ మొట్టమొదట రాజీనామా చేయడం కూడా జాన్సన్ మద్దతుదారుల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదే సమయంలో లిజ్ ట్రస్ చివరిదాకా జాన్సన్‌కు మద్దతిచ్చారు. పార్టీ సభ్యులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే సునాక్ ఓటమికి కారణం.
బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలో రిషీ సునాక్ ఓడిపోవడానికి జాతి, మతం కూడా తమదైన పాత్ర పోషిం చాయా అంటే మనకు ఎన్నటికీ కచ్చితంగా తెలీకపోవచ్చు. రిషి ఓటమికి ఇవి కూడా పనిచేశాయని నొక్కి చెప్పేవారు, ఇవి కారణాలు కావు అని చెబితే సమాధానపడరు. అయితే ఆయన ఓటమికి ఇవి కారణాలు కావు అని చెప్పేవారు దాన్ని నిరూ పించలేరు. నా ఊహ ఏమిటంటే, తన ఓటమికి జాతి, మతం కూడా కారణాలు అయివుండవచ్చు కానీ వాటికి అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. లేదా రిషి ఓడిపోవడానికి అవే ప్రధాన కారణం కావచ్చు కూడా!
అయితే నిజం ఏమిటంటే, చాలామంది ప్రజలు నమ్ము తున్నట్లుగానే బ్రిటన్ ప్రస్తుతం చాలా విభిన్నమైన దేశంగా మారి పోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతే తరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. ఈ విషయం అర్థం కావడానికి మీరు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ మంత్రివర్గాలను చూడండి. అలాగే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ‘బీబీసీ’ ఛానల్‌లో మనకు కనబడే ముఖాలను చూడండి. తర్వాత ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తారు. (అమెరికన్ యువతి మేఘన్ మెర్కెల్ బ్రిటిష్ రాజవంశంలోని ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన తర్వాత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెను ససెక్స్ యువ రాణిగా ప్రకటించారంటే బ్రిటిష్ సమాజంలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనం అన్నమాట.)
అందుకనే రిషీ సునాక్ ఓటమికి కారణాలు అనేకం అని నేను నమ్ముతున్నాను. ఆర్థికమంత్రిగా రిషి ట్రాక్ రికార్డులో గానీ, బహుశా ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రదర్శించిన వ్యక్తిత్వంలో గానీ, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత దిగ్భ్రాంతి కరమైన పతనానికి దారితీసేలా తన మంత్రిపదవికి ఇచ్చిన రాజీ నామాలో గానీ మనం రిషి శైలినీ, మూర్తిమత్వాన్నీ చూడవచ్చు. రిషికి అదృష్టం ముఖం చాటేసిందని చెప్పడం కంటే బహుశా ఆయనదే తప్పు అయివుండొచ్చు. బ్రిటన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి రిషి ఇష్టపడకపోవడమే ఆయన తప్పు కావచ్చు.
ప్రధానంగా పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. కన్జర్వేటివ్ పార్టీని సాధారణంగా పన్నులు తక్కువగా విధించే పార్టీగా చెబుతుంటారు. ఇది వారికి ఒక పవిత్ర విశ్వాసం లాంటిది. కానీ ఆర్థిక మంత్రిగా సునాక్ పన్నులను గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని మాత్రమే ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరోవైపున ఆయన ప్రత్యర్థి ట్రస్ మాత్రం తన ప్రచార తొలిదశలోనే పన్నులను బాగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు.
సునాక్ చెప్పింది సరైనదేనని చాలామంది ఆర్థికవేత్తలు, పారిశ్రా మికవేత్తలు నమ్ముతున్నారు. లండన్ ప్రజలు కూడా సునాక్ వాదనను సమర్థించారని ‘వెంబ్లే ర్యాలీ’ సూచిస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ ఎన్నికల ప్రచారం అయినట్లయితే సునాక్ సులువుగా గెలిచేవారు. ఆయన వైఖరిని దేశం అంగీకరించేది. కానీ ఇది జాతీయ ఎన్నిక కాదు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఎన్నిక. వీరు బ్రిటన్ లోని జిల్లా కేంద్రాల్లో నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది ముసలి వారు. వీరు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. అందుకే లిజ్ ట్రస్ ఇచ్చిన సందేశం వీరిని నేరుగా తాకింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని ఎన్నికలో వీరే ముఖ్యమైన ఓటర్లు మరి.
మరొక కారణం ఏమిటంటే, బోరిస్ జాన్సన్‌కు విశ్వసనీయమైన మద్దతుదారులు సునాక్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే తమ మనిషిని, తమ నాయకుడిని గద్దె దింపిన ఘటనలకు రిషీనే బాధ్యు డని వీరు నమ్మారు. టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యులలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బోరిస్ జాన్సనే అని పోల్స్ సూచి స్తున్నాయి. సునాక్ కానీ, ట్రస్ కానీ ఈయనతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నారు. పైగా మరోసారి పోటీపడి గెలిచి ప్రధాని పదవి చేపట్టాలని జాన్సన్ భావిస్తున్నట్లు ‘ద టైమ్స్’ పత్రిక కూడా సూచిస్తోంది. కాబట్టి బోరిస్ జాన్సన్ మంత్రివర్గం నుంచి మొట్టమొదట రాజీనామా చేసినదానికి రిషి ఫలితం అనుభవించినట్లు కనిపిస్తోంది. మరోవైపున లిజ్ ట్రస్ తన నాయకుడు జాన్సన్ పట్ల చివరివరకూ విశ్వాసం ప్రకటించారు. అలా బహుశా ప్రయోజనం పొందివుంటారు.
మూడో కారణం సునాక్ శైలి, వ్యక్తిత్వంలో దాగి ఉంది. చిన్నచిన్న అంశాలలో కూడా ఇది ఒక సమస్యగా మారింది. కానీ ఇది మరో ఆందోళనకు దారితీసింది. ఉదాహరణకు, మొట్టమొదటి చర్చలో రిషిని అహంభావిగా టోరీ ఓటర్లు భావించారు. తాను చెబుతున్నదే సరైనది అని భావిస్తున్నాడని రిషి గురించి అనేకమంది ఆరోపించారు. పైగా గత ఆరు వారా లుగా రిషి ఆరోగ్యం గురించి అనేకమంది ప్రశ్నలు సంధిం చారు. నిస్సందేహంగా ఆయన ఆ ప్రశ్నలకు సమర్థంగా జవాబి చ్చారు. కానీ ఓటర్ల సందేహాలు సమసిపోలేదు.
ప్రత్యేకించి సునాక్ శైలి, వ్యక్తిత్వం తన సొంత టీమ్‌లోనే భయాందోళనలు కలిగించినట్లుందని ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక నివే దించింది. ఈ పత్రిక ప్రకారం తన ప్రచారం తొలి దశలో రిషీ సునాక్ పదేపదే క్యాలిఫోర్నియా గురించి ప్రస్తావించడంతో పరిస్థితులు తప్పు దోవ పడుతున్నాయని ఆయన సొంత టీమ్‌లోనే భయం పుట్టు కొచ్చింది. క్యాలిఫోర్నియా తరహా వాణిజ్య సంస్కృతి పట్ల తన ఆరా ధనను రిషి ఏమాత్రం దాచుకోలేదు. దీంతో క్షేత్రస్థాయి టోరీ పార్టీ సభ్యులకు ఆయన దూరమైపోయాడని చెబుతున్నారు.
కాబట్టి సునాక్ జాతి మూలం ఆందోళన కలిగిస్తున్నట్లయితే, అది అంత ప్రాధాన్యం కలిగిన విషయమా అని నేను సందేహ పడుతున్నాను. దాదాపుగా ఇది ప్రతి ఒక్కరికీ వర్తించవచ్చు కూడా! ఇప్పుడు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా, లిజ్ ట్రస్ ఎలా పనిచేస్తారనే అంశంపైనే రిషీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లిజ్ గెలిచినప్పటికీ, ఆమె ప్రధాన మంత్రిగా తగినంత ఆత్మవిశ్వాసంతో లేరని పోల్స్ సూచించాయి. ఇలాగే కొనసాగితే 2024లో ఆమె లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్‌కు తన పదవిని కోల్పోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే సునాక్ మళ్లీ పోటీ చేయడానికి దారి దొరుకుతుందని చెప్పవచ్చు. రిషీ సునాక్‌కు ఇప్పుడు 42 సంవత్సరాలు. 2029 వరకు ఆయన వేచి ఉండాల్సి వస్తే అప్పటికి కూడా తాను 50 ఏళ్ల వయసు లోపే ఉంటారు. వెనుక బెంచీల్లో కూర్చోవాలని రిషి తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుపై అతడు ఒక కన్నేసి ఉంచాడనేందుకు సంకేతంగా కనిపిస్తోంది.
కరణ్ థాపర్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
Comments
Please login to add a commentAdd a comment