14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర?
లేబర్ పార్టీదే గెలుపు అంటున్న సర్వేలు
బ్రిటన్‌లో జూలై 4న సార్వత్రిక ఎన్నికలు
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...
ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు.
ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్‌స్టర్ల అంచనా.
లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...!
హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి.
ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్
‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.
ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో...
బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.
→ 2022 అక్టోబర్లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.
→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి.
→ వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.
→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment