మహాసంక్షోభం ముంచుకొస్తున్నదని, నలుదిక్కులా పొంచివున్న సమస్యలు కాలనాగులై కాటేసే ప్రమాదముందని తెలిసినా అలవికాని హామీలిచ్చి బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల వ్యవధిలోనే తత్వం బోధపడి నిష్క్రమించారు. బ్రిటన్ చరిత్రలో అతి స్వల్పకాలం ఏలుబడి సాగించిన నేతగా అపకీర్తి మూటకట్టుకున్నారు. నెలాఖరుకల్లా మరొకరు ఆ పదవిని అధిష్ఠించాల్సి ఉంది. ఎనిమిది వారాల్లో ముచ్చటగా మూడో ప్రధానిని బ్రిటన్ ప్రజానీకం చూడబోతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టే నేత ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఏం చేస్తారన్నది కొన్నిరోజుల్లో తేలిపోతుంది. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల ఊసెత్తకుండా కొత్త నేతతో నష్టనివారణకు ప్రయత్నించవచ్చు. కానీ అది అన్ని విధాలా అప్రజాస్వామికమే అవుతుంది.
ప్రస్తుతం బ్రిటన్ చుట్టూ ముసురుకున్న సమస్యలకు లిజ్ ట్రస్ కారకులు కాకపోవచ్చు. 2016లో వెనకాముందూ చూడకుండా బ్రెగ్జిట్‌కు దేశం ఆమోదముద్ర వేయటంలోనే అందుకు బీజాలు పడివుండొచ్చు. ఈయూ నుంచి బయటికొచ్చినప్పటినుంచీ ఆర్థిక అస్థిరత పీడిస్తున్న సంగతి కాదనలేనిది. కరోనా కష్టాలు సరేసరి. ఈలోగా ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఇంధన ధరలను ఆకాశాన్నంటేలా చేసింది. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ఆమె అనుసరిస్తానన్న విధానాలపై ప్రధాని పదవికి పోటీపడినప్పుడే కన్సర్వేటివ్ పార్టీలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమె చూపుతున్న మార్గం ఆత్మహత్యాసదృశమవుతుందని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తెచ్చి వృద్ధికి దోహదపడతానని, అందుకోసం పన్నులపై కోత విధిస్తా నని, విద్యుత్ బిల్లులపై ద్రవ్యోల్బణం ప్రభావం పడకుండా అదుపు చేస్తానని ట్రస్ హామీ ఇచ్చినప్పుడు ఆమెతో పోటీపడిన రిషి సునాక్ అది మరింత సంక్షోభాన్ని కొనితెస్తుందన్నారు. పన్ను కోతల వల్ల ఏర్పడే లోటును ఎలా పూరిస్తారో, పెరిగే వ్యయానికి నిధులు ఎక్కణ్ణించి వస్తాయో చూప కుండా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. కానీ సునాక్‌ను ఆమె నిరాశావాదిగా కొట్టిపారేశారు. అయితే గత నెల 23న ఆర్థికమంత్రి క్వాసీ క్వార్‌టెంగ్ మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగింది అదే. ఒకపక్క ప్రభుత్వ వ్యయం పెంపు, మరో పక్క 4,500 కోట్ల పౌండ్ల పన్ను కోతలు, దాని భర్తీకి బాండ్ల జారీ ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని రుణ ఊబి లోకి నెట్టేస్తాయన్న అంచనాలకు దారీతీశాయి. వడ్డీరేట్లు పెరిగాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటి, ద్రవ్యోల్బణం పది శాతానికి ఎగబాకి, త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో చేసిన ఈ ప్రతిపాదనలు ఫైనాన్షియల్ మార్కెట్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి. ఫలి తంగా కొత్తగా జారీచేసే బాండ్లు కొనడంమాట అటుంచి, తమదగ్గర ఉన్నవాటిని మదుపుదారులు అమ్ముకోవటం ప్రారంభించారు. ఇది బాండ్ల విలువను మింగి, పౌండ్ పతనానికి దారితీసింది. ఈ సంక్షోభాన్ని అడ్డుకోవటానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక గత్యం తరం లేదని తెలిసి మినీ బడ్జెట్ ప్రతిపాదనలు ఒక్కొక్కటే ఉపసంహరించుకోవటం ప్రారంభిం చారు. చివరకు ఆర్థికమంత్రిని సాగనంపి ఆ స్థానంలో జెరిమీ హంట్‌ను తీసుకొచ్చారు.
సమస్యలను సక్రమంగా విశ్లేషించి సరైన విధానాలకు రూపకల్పన చేయటం, వాటి అమలులో ఎదురయ్యే జయాపజయాలకు తామే బాధ్యత వహించటం నాయకత్వ స్థానంలో ఉండేవారు చేయాల్సిన పని. కానీ లిజ్ ట్రస్ అలా వ్యవహరించలేకపోయారు. తన అసమర్థతనూ, చేతకాని తనాన్నీ చాటుకున్నారు. ప్రధాని పదవికి పోటీపడినప్పుడు చేసిన వాగ్దానాలను అమలుచేయటానికి తనకు సన్నిహితుడైన క్వార్‌టెంగ్‌ను ఆర్థికమంత్రిని చేసింది లిజ్ ట్రస్సే. మినీ బడ్జెట్‌లోని ఆయన ప్రతిపాదనలన్నీ ట్రస్ మానసపుత్రికలే. ఆర్థికమంత్రిగా ఉన్నందుకైనా క్వార్‌టెంగ్ ఆమె ప్రతి పాదనలకు మార్పులు, చేర్పులు చేసిన దాఖలా కనబడదు. తీరా వీటిపై వ్యతిరేకత వెల్లువెత్తేసరికి ఆయన్ను బాధ్యుణ్ణి చేసి గతవారం కేబినెట్ నుంచి తప్పించారు. పైగా ఓపక్క తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూనే యోధురాలినని, తుదికంటా పోరాడతానని నమ్మబలికారు. ఆ వెంటనే పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రాజీనామా చేసిన హోంమంత్రి బ్రేవర్మన్ ఉన్నమాట న్నారు. ప్రభుత్వానికి సారథ్యంవహించేవారు తప్పులు చేయలేదని బుకాయించటానికి బదులు అవి జరిగాయని నిజాయితీగా అంగీకరించటానికి సిద్ధపడాలని ఒక ఎంపీకి పొరపాటున పంపిన మెయిల్‌లో ఆమె వ్యాఖ్యానించారు. తన సహచరుల్లో తనపై ఎలాంటి అభిప్రాయం ఉన్నదో అర్థమయ్యాక ఇక రాజీనామా చేయటమే ఉత్తమమని ట్రస్ భావించివుండొచ్చు.
పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉండొచ్చు. అంతమాత్రంచేత జనామోదం ఉందో లేదో తెలియని మరొకరిని పార్టీ సభ్యులు లేదా ఎంపీల అంగీకారంతో ప్రతిష్ఠించి అధికారంలో పూర్తికాలం కొనసాగాలనుకోవటం అప్రజాస్వామికం. ఇది తొలిసారి కూడా కాదు. ఒకప్పుడు ‘సహజ పాలక పక్షం’గా నీరాజనాలందుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడింది. ప్రభుత్వ నిర్ణయాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయని స్పష్టంగా తెలుస్తున్నప్పుడూ, అధికార కన్సర్వేటివ్ పార్టీ ముఠా తగాదాల్లో మునిగి మేధోశూన్యత లోకి జారిపోయిందని అర్థమవుతున్నప్పుడూ అన్ని పక్షాలూ ప్రజాతీర్పు కోరటమే పరిష్కారం.బ్రిటన్‌కు మందు
Comments
Please login to add a commentAdd a comment