మార్పు మంచికే! అయితే, అన్ని మార్పులూ మంచి చేస్తాయా? మంచిని ఆశించడమే తప్ప, ఆఖరికి ఏమవుతుందో అప్పటికప్పుడు చెప్పలేం. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ప్రస్తుతం మార్పునే నమ్మారు. క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలపై విరుచుకుపడిన హోమ్ మంత్రి సువెల్లా బ్రేవెర్మన్‌ను పక్కకు తప్పించారు. ఆమె స్థానాన్ని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి అప్పగించారు.
మాజీ ప్రధాని అయిన 57 ఏళ్ళ డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా ముందుకు తెచ్చారు. భారతీయ సంతతికి చెందిన 43 ఏళ్ళ బ్రేవెర్మన్ ఛాందసవాద, వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడడంతో, ఆమెకు ఉద్వాసన పలికి, మధ్యేవాదానికి జై కొడుతున్నట్టు కనిపించే యత్నం చేశారు. మునుపటి లిజ్ ట్రస్ హయాం నుంచి ప్రతికూలత మూటగట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల మళ్ళీ నమ్మకం కలిగించడానికి సునాక్‌కు ఇవి సరిపోతాయా?
కన్జర్వేటివ్ పార్టీ తన సొంత ఉనికిని కాపాడుకొనేందుకు కిందా మీదా పడుతోందనడానికి తాజా ఉదాహరణ రిషీ సునాక్ తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని విశ్లేషకుల మాట. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఒక్కరే కాక ఇంకా పలువురు పెద్ద పదవులు నిర్వహించినవారు సైతం ఈ మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో చిన్న హోదాలు చేపట్టారు.
గతంలో ప్రధానమంత్రి పదవికి రేసులో నిలబడ్డ నాయకురాలు, వ్యాపార శాఖ మంత్రి అయిన డేమ్ ఆండ్రియా లెడ్‌సమ్ ఇప్పుడు జూనియర్ హెల్త్ మినిస్టర్ పదవి చేపట్టారు. అలాగే ఇంకొందరు! సునాక్ వైపు నుంచి చూస్తే – ఇది మునుపటి లిజ్ ట్రస్ హయాం వారిని కొందరినైనా వదిలించుకొని, తనదైన జట్టును నిర్మించుకొనేందుకు ఆయన చేస్తున్న యత్నంగా కనిపిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే – మునుపటి లిజ్ పాలన తలనొప్పులు తేవడంతో ఏడాది క్రితం ఆ స్థానంలోకి వచ్చిన సునాక్ తన సర్కార్‌పై నమ్మకం కలిగించడంలో విఫలమయ్యారనీ, అందుకే ఈ మార్పులనీ అనిపిస్తుంది.
ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి సునాక్ తరచూ కామెరాన్‌తో సంభాషిస్తున్నారనీ, వారం రోజుల క్రితమే విదేశాంగ మంత్రిగా పగ్గాలు పట్టాల్సిందిగా కోరారనీ ఒక కథనం. ఇంతలోనే బ్రేవెర్మన్ దురుసు రాతలతో రచ్చ రేగింది. చివరకు సునాక్ అనుకుంటున్న మార్పే అనివార్యంగా, ముందుకు తోసుకొచ్చింది. ‘డీసీ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డేవిడ్ కామెరాన్ పునరాగ మనంతో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి పాలకçపక్షం చిక్కుల్లో పడి, బయటపడేందుకు మరో మార్గం లేనప్పుడు పాత కాపులను మళ్ళీ రంగంలోకి దింపి ఉన్నత పదవులివ్వడం, ఎంపీలు కాని వారిని ఎగువ సభ ద్వారా పార్లమెంట్‌లోకి తేవడం బ్రిటన్‌లో తరచూ ఉన్నదే! వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతున్న వేళ సునాక్ సర్కార్ ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి. అందులో భాగమే తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కామెరాన్ పునరాగమనం లాంటి చర్యలు.
మాటలతో ముగ్ధుల్ని చేయగల కామెరాన్‌ను జనం నమ్ముతారనీ, రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందనీ సునాక్ అంచనా. అయితే, పదకొండేళ్ళు పార్టీకి నేతగా, ఆరేళ్ళ కాలం ప్రధానిగా పనిచేసి, గత ఏడేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కామెరాన్ అనుభవం కష్టాల్లో ఉన్న పార్టీకీ, సునాక్ ప్రభుత్వానికీ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
కామెరాన్‌కు పలువురు ప్రపంచ నేతలతో స్నేహం, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలన్నీ అస్థిరంగా ఉన్న వర్తమానంలో అది బ్రిటన్ ప్రభుత్వానికి ఉపయుక్తమే. కానీ, వచ్చే ఎన్నికల్లో కలిసిరావడం మాత్రం కష్టమే. కేవలం 24 శాతం మంది బ్రిటన్ వయోజనులు కామెరాన్‌కు సానుకూలంగా ఉంటే, 45 శాతం మంది ఆయనకు ప్రతికూలంగా ఉన్నారని నెల కిందటి తాజా సర్వే. వెరసి కామెరాన్‌పై సునాక్ అతిగా ఆశలు పెట్టుకుంటే నిరుత్సాహం తప్పదు.
పదమూడేళ్ళ పాటు సొంత కన్జర్వేటివ్ పార్టీయే గద్దె మీద ఉన్నాక వచ్చే ఎన్నికలు సునాక్‌కు ఏటికి ఎదురీతే. ఆయన తనను తాను మార్పుకు ప్రతిరూపంగా, స్థిరచిత్తుడిగా జనానికి చూపుకోవడం అవసరం. అందుకని మాటల్లో, రాతల్లో జాత్యహంకార, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బ్రేవెర్మన్‌ను పదవిలో కొనసాగిస్తే కష్టం. గతంలో పలుమార్లు మాటల తూటాలు పేల్చిన ఆమె తాజాగా పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనపై నిర్లక్ష్యంగా, నొప్పించేలా ‘ది టైమ్స్’ పత్రికలో రాశారు.
ప్రధాని ఆమోదం లేని ఆ వ్యాసంతో తన కథకు తానే ముగింపు రాసుకున్నారు. స్వతంత్ర పోలీసు వ్యవస్థను తప్పుబట్టడమే కాక, నిరసనను ప్రాథమిక హక్కుగా భావించే ఆధునిక బ్రిటన్ సమాజాన్నీ దూరం చేసుకున్నారు. పదవీచ్యుతురాలయ్యారు. అయితే, రానున్న రోజుల్లో ఆమె ఊరకుంటారని అనుకోలేం. సునాక్ పాలన అనంతరం అవసరమైతే పార్టీ పగ్గాలు చేపట్టగల ఛాందస వర్గ నేతగా ఆమె తనను తాను గట్టిగా నిలుపుకొన్నారు.
అయిదేళ్ళ లోపల 650 మంది సభ్యుల దిగువ సభకు ఎన్నికలు జరగడం బ్రిటన్ విధానం. ఆ లెక్కన 2025 జనవరి 28 లోపల ఎన్నికలు జరగాలి. ఏ తేదీన జరగాలో నిర్ణయించే అధికారం ప్రధా నిదే. 2011లో చట్టం తెచ్చి, దాన్ని మార్చినా, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కన్జర్వేటివ్‌లు మళ్ళీ యథాపూర్వ స్థితిని పునరుద్ధరించారు.
ఆ లెక్కన పార్లమెంట్‌ను ముందే రద్దు చేసి, ఎన్నికలు జరిపించమని సునాక్ కోరినా కోరవచ్చు. ఏడాది క్రితం సునాక్ పగ్గాలు చేపట్టినప్పటితో పోలిస్తే, కన్జర్వే టివ్‌ల ప్రతిష్ఠ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అప్పటి అనుకూల వాతావరణమూ లేదు. మరి, సునాక్ చేసిన తాజా మార్పులు ఎన్నికల నాటికి అద్భుతాలు చేయగలవా? ఏమో గుర్రం ఎగరావచ్చు!
UK PM Rishi Sunak: మార్పుల వ్యూహంతో మేలెంత?!
Published Wed, Nov 15 2023 4:09 AM | Last Updated on Wed, Nov 15 2023 11:32 AM
Comments
Please login to add a commentAdd a comment