Britain: రిషి వారసుడెవరో?! | Britain: Tory leadership candidates make pitch to members ahead of party conference | Sakshi
Sakshi News home page

Britain: రిషి వారసుడెవరో?!

Published Tue, Oct 1 2024 3:13 AM | Last Updated on Tue, Oct 1 2024 3:13 AM

Britain: Tory leadership candidates make pitch to members ahead of party conference

టోరీల సారథ్య రేసులో నలుగురు 

ముందంజలో జెన్రిక్‌  

గట్టి పోటీ ఇస్తున్న కేమీ

బ్రిటన్‌లో రిషి సునాక్‌ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్‌ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్‌ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.

గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్‌ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. 

ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్‌ స్ట్రైడ్‌ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్‌ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.

కేమీ బేడ్‌నాక్‌ (44)
నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్‌ జాన్సన్‌ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.

జేమ్స్‌ క్లెవర్లీ (54)
పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్‌ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్‌ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.

రాబర్ట్‌ జెన్రిక్‌ (42)
పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్‌లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

టామ్‌ టూగన్‌హాట్‌ (51)
మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్‌ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడారు.              

ఎంపిక ఇలా...
టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. 

చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్‌ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్‌ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్‌ 15 నుంచి 31 దాకా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్‌ 2న తేలుతుంది.
  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement