Tory leader
-
రిషి సునాక్ స్థానంలో టోరీల సారథిగా బేడ్‌నాక్.. తొలి నల్లజాతి మహిళగా రికార్డు
లండన్: బ్రిటన్ విపక్ష నేతగా, కన్జర్వేటివ్ పార్టీ సారథిగా కేమీ బేడ్‌నాక్ ఎన్నికయ్యారు. నైజీరియా మూలాలున్న 44 ఏళ్ల కేమీ ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. మూడు నెలల పాటు జరిగిన పార్టీపరమైన ఎన్నికల్లో మాజీ మంత్రి రాబర్ట్ జెన్రిక్ను బేడ్‌నాక్ ఓడించారు. ఆమెకు 53,806 ఓట్లు రాగానే జెన్నిక్కు 41,388 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజీనామా చేసిన మాజీ ప్రధాని రిషి సునాక్ స్థానంలో ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సునాక్‌కు బేడ్‌నాక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఈ కష్టకాలంలో పార్టీ కోసం అంతగా కష్టపడేవారు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. సునాక్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పార్టీ సారథిగా గొప్పగా రాణిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధాని కియర్ స్టార్మర్ కూడా బేడ్నాక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక నల్లజాతి మహిళ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు స్వీకరించడాన్ని చరిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు. బేడ్‌నాక్ నార్త్‌వెస్ట్ ఎసెక్స్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్‌లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్‌నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీన్ రివర్స్.. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌ను వెనక్కినెట్టిన ట్రస్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు బ్రిటన్ 'యూగోవ్' సంస్థ సర్వే చెబుతోంది. ఇది బ్రిటన్‌లో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్, ఎనలిటిక్స్ సంస్థ. కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులు రిషి, లిజ్ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం గమనార్హం. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. 1.60 లక్ష మందికిపైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే తెలిపింది. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్‌లో రిషికి 137 మంది ఎంపీలు ఓటు వేయగా.. ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ టోరీ సభ్యుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదవండి: రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్! -
'పీఎం పదవి రేసు నుంచి తప్పుకుంటున్నా'
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో లేనని లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థత తనకు లేదని, ఐక్యత దిశగా దేశాన్ని నడిపించలేనని అన్నారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నానని న్యాయశాఖ మంత్రి, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన మైఖేల్ గోవ్ ప్రకటించిన తర్వాత బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం. హోంమంత్రి థెరెసా మే కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రజలు మద్దతు పలకడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ 9న కొత్త కామెరాన్ వారసుడిని ఎంపిక చేయనుంది.