వచ్చే జులై 4న బ్రిటన్ దిగువసభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్సర్వేటివ్ పార్టీ నిరంతరాయంగా పద్నాలుగేళ్లనుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుంది. అయిదేళ్ల గడువుకు అయిదు నెలల ముందే జరుగుతున్న ఈ ఎన్నికలు వారి పాలనకు చరమగీతం పాడతాయా, మరోసారి అందలమెక్కిస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కన్సర్వేటివ్‌లకు ఆ విషయంలో అనుమానం లేదు. ఓటమి ఖాయమన్న దిగులు ఆ పార్టీని ఆవరించింది. విశ్వవిఖ్యాత కవి, రచయిత విలియం షేక్స్‌పియర్ విరచిత ‘హామ్లెట్’ నాటకంలోని పాత్ర పలికిన ఆత్మగత సంభాషణలో ‘టు బీ ఆర్ నాట్ టు బీ...’ అందరికీ గుర్తుండిపోయే పదబంధం. బతకటమా, చావటమా అనే సందిగ్ధ స్థితిని అది చెబుతుంది.
కన్సర్వేటివ్ పార్టీ ప్రస్తుతం ఆ సంకటస్థితిలోనే ఉంది. నిరుడు జులైలో దిగువ సభకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకటే గెల్చుకుంది. ఈ నెల మొదట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దాని పరిస్థితి ఏమంత బాగులేదు. నిజానికి నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ దేశం అధిక ద్రవ్యోల్బణంతో కుంగిపోయింది. కానీ నెలరోజుల్లో ఉప ఎన్నికలుంటాయనగా అది చెప్పుకోదగ్గ మేర తగ్గింది. అయినా వోటర్లు కరుణించలేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడిన సూచనలు కనబడ్డాయి. వృద్ధి రేటు బాగుందని జీడీపీ గణాంకాలు చాటాయి. ఆర్థిక మాంద్య ప్రమాదం తప్పిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ స్థానిక ఎన్నికల్లో జనం లేబర్ పార్టీవైపే మొగ్గారు.
కన్సర్వేటివ్ పార్టీ రేటింగ్ కనీవినీ ఎరుగని రీతిలో 20 శాతానికి పడిపోయిందని, లేబర్ పార్టీ 44 శాతంతో ముందంజలో ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బహుశా అందుకే కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలూ, రిషి మంత్రివర్గ సహచరులూ గడువుకు ముందే పార్లమెంటు రద్దు చేయటం ప్రమాదకరమంటూ వాదించారు. అయితే రిషి సునాక్ లెక్కలు వేరు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు వెల్లడైన ఆర్థిక గణాంకాలు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని గణాంకాలు తేల్చాయి.
2022 అక్టోబర్‌లో 11.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.3 శాతానికి దిగొచ్చింది. కన్సర్వేటివ్‌లు పెట్టుకున్న 2 శాతం లక్ష్యం కన్నా ఇది కాస్తా ఎక్కువే అయినా ఇంతకు మించి ఆశించకూడదన్న అభిప్రాయం అధికారపక్షంలో ఉంది. మరోపక్క అక్రమ వలసదారులను రువాండాకు సాగనంపే చట్టం ఆమోదం పొందాక ఆ తరహా వలసలు కొద్దో గొప్పో తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రిషి అత్యుత్సాహంగా ఎన్నికల ప్రకటన చేశారు. అయితే ఈ పరిస్థితి నిలకడగా కొనసాగుతుందా... మళ్లీ దిగజారుతుందా అన్న సంశయం కన్సర్వేటివ్ శ్రేణులను పట్టి కుదుపుతోంది.
అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పుడు సమాచారాన్ని జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం రివాజుగా మారింది. బ్రిటన్ కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం ఎదుర్కొంటున్న సకల అరిష్టాలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగటమే కారణమన్న తప్పుడు ప్రచారాన్ని తలకెత్తుకున్నది కన్సర్వేటివ్ పార్టీయే. చివరకు వారి ఏలుబడిలోనే తప్పనిసరై ఆ తంతు ముగించారు. బ్రిటన్ స్వేచ్ఛాజీవి అయింది. అయినా ఆర్థిక ఒడుదొడుకులు దాన్ని పీడించాయి. అధిక ధరలు, నిరుద్యోగం పాలకపక్షాన్ని నిద్రపోనీయకుండా చేశాయి.
వోటర్లలో కనబడిన అనాసక్తత వల్ల 2019 డిసెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా కన్సర్వేటివ్ పార్టీ నికరమైన మెజారిటీతో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దలేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన లిజ్ ట్రస్ సైతం ప్రజల్ని నిరాశపరిచారు. కనుకనే ప్రధానిగా రిషి సునాక్‌ను కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకుంది. కానీ పదవిలోకొచ్చింది మొదలు రిషికి సమస్యలు తప్పలేదు.
జాన్సన్, ట్రస్‌ల మాదిరే ఆయనపై కూడా సాధారణ వోటర్లలో ఏవగింపు మొదలైంది. వ్యక్తిగతంగా రిషి రేటింగ్ కూడా తీసికట్టే! సర్వేలన్నీ వరసబెట్టి దీన్నే చాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడటమంటే ఏ ప్రధానికైనా ఆత్మహత్యాసదృశమే. కానీ రిషి తెగింపు వెనక కారణం ఉంది. ప్రత్యర్థి లేబర్ పార్టీకి వోటర్ల ఆదరణ బాగానేవున్నా వ్యక్తిగతంగా ఆ పార్టీ నాయకుడు కియర్ స్టార్మర్ పై ప్రజలకంత విశ్వాసం లేదు. అందుకే ఎన్నికలకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఉండబోదన్న నిర్ణయానికి రిషి వచ్చివుండొచ్చు. దానికితోడు స్టార్మర్ ప్రధాన నినాదం ‘ఆర్థిక సుస్థిరత’. అది ఇప్పటికే సాధించినట్టు గణాంకాలు చెబుతుండగా ఆ నినాదానికి విలువుండదని రిషి నమ్మకం.
రష్యా దురాక్రమణ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ, ఇరాన్ దూకుడు... మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయన్న భయాందోళనలు అన్నిచోట్లా ఉన్నట్టే బ్రిటన్‌లోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద పార్టీ కన్సర్వేటివ్‌లు అధికారంలో ఉండటమే ఉత్తమమన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. సైనిక వ్యయాన్ని అదుపు చేస్తామన్న లేబర్ పార్టీ వాగ్దానం ప్రమాదకరమని కూడా ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. కనుక రాబోయే ఎన్నికలు రక్షణ, భద్రత చుట్టూ తిరిగే అవకాశం లేకపోలేదు. తనకొచ్చిన అవకాశాన్ని లేబర్ పార్టీ సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వస్తుందా లేక వోటర్లను ఒప్పించలేక చతికిలపడుతుందా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోతుంది.
రిషి సాహసం!
Published Fri, May 24 2024 5:30 AM | Last Updated on Fri, May 24 2024 5:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment